హత్యలుండవు ఆత్మహత్యలే! | Dileep Reddy Write Guest Columns On Challenges Facing The Congress | Sakshi
Sakshi News home page

Published Fri, Dec 28 2018 1:58 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

Dileep Reddy Write Guest Columns On Challenges Facing The Congress - Sakshi

గత దశాబ్ద కాలంలో కాంగ్రెస్‌లో వచ్చిన వేగవంత మార్పులు పార్టీ భవిష్యత్తు మనుగడపైనే తీవ్ర ప్రభావం చూపేవిగా ఉన్నాయి. కాంగ్రెస్‌ను సంస్థాగతంగా బలోపేతం చేయాలని రాహుల్‌కు, సోనియాగాంధీకి బలంగా ఉన్నా, ఎలా చేయాలో, అందుకు ఏం చేయాలో మార్గం తోచడం లేదు. 2004 ఎన్నికల్లో కాంగ్రెస్‌ నెగ్గి, యూపీఏ ప్రభుత్వం ఏర్పరచింది. ఏపీలో డాక్టర్‌ వై.ఎస్‌.రాజశేఖరరెడ్డి వంటి నేతలు ఆయా రాష్ట్రాల్లో సాధించిన గొప్ప విజయాలు కాంగ్రెస్‌కు లాభించాయి. రేపటి సార్వత్రిక ఎన్నికల్లో మోదీ వర్సెస్‌ రాహుల్‌గా ప్రజలు నిర్ణయించాల్సి ఉంటుంది. ఎన్నో పరీక్షలను ఎదుర్కొని కాంగ్రెస్‌ 2019 ఎన్నికలను ఎదుర్కోవలసి ఉంది.

భారత స్వాతంత్య్రానికి ముందొక ఆరు, తర్వాతొక ఆరేడు దశాబ్దాలు ప్రబల రాజకీయ శక్తిగా ఉన్న కాంగ్రెస్‌ పార్టీకి నేడేమైంది? రాజకీయ, మేధావి, పాత్రికేయ వర్గాల్లో ఇటీవల తరచూ మెదళ్లను తొలు స్తున్న ప్రశ్న ఇది!  సిద్దాంత పరంగా, విధానాల రీత్యా, నిర్మాణం–ఆచరణల వారీగా చూసినా, ఈ సుదీర్ఘ ప్రస్తానంలో కాంగ్రెస్‌ పలు మార్పు లకు గురైంది. ఇంకా గురవుతూనే ఉంది. ఏర్పడిన నాటికి, నేటికి పొంతనే లేని పార్టీగా కాంగ్రెస్‌ నేడు మిగిలిందనే భావన ఉంది. స్వతంత్రం సిద్దించగానే కాంగ్రెస్‌ను రద్దు చేయాలనీ పూజ్య బాపూజీ ఒక ఆలోచన చేశారు. కానీ, అలా జరుగక... దేశ రాజకీయాల్లో చాలా కాలం ఏకచత్రాధిపత్యం సాగించిన కాంగ్రెస్‌ నేడొక విచిత్ర పరిస్థితిని ఎదు ర్కొంటోంది. ఒక రాజకీయ పార్టీని ఎన్నికల్లో గెలుపోటముల పరంగానే తూచలేము! పైగా ప్రపంచంలోనే సుదీర్ఘ చరిత్ర కలిగిన రాజకీయ పార్టీల్లో ఒకటైన కాంగ్రెస్‌ తాజా స్థితిని అంచనా వేసేటప్పుడు ఎన్నో విషయాల్ని పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. లోకసభ సార్వత్రిక ఎన్నికలు, వివిధ రాష్ట్రాల శాసనసభలకు జరిగే ఎన్నికల ఫలితాల విశ్లేషణల్లో పార్టీ ఉత్ధాన పతనాలు ప్రజల కళ్లకు కడుతూనే ఉన్నాయి. ఇన్నేళ్లలో సంస్థాగతంగా, నాయకత్వపరంగా, జనాదరణలో చూసినా... పార్టీలో గుర్తించదగిన మార్పులే చోటుచేసుకుంటున్నాయి.

ముఖ్యంగా గత దశాబ్దకాలంలో కాంగ్రెస్‌లో వచ్చిన వేగవంత మార్పులు పార్టీ భవిష్యత్తు మనుగడపైనే తీవ్ర ప్రభావం చూపేవిగా ఉన్నాయి. 2019 సార్వత్రిక ఎన్నికల ముంగిట్లో పార్టీ తాజా స్థితి వివిధ వేదికలపై చర్చను లేవనెత్తుతోంది. ఈ ఎన్నికల ముందర, ఎన్నికల అనంతర రాజకీయ సమీకరణాల్ని కాంగ్రెస్‌ ఏ విధంగా ప్రభావితం చేయనుందనేది ఇప్పుడు ఆసక్తిని రేకెత్తిస్తోంది. నేటికి సరిగ్గా 133 సంవత్సరాల కింద, ఇదే రోజు 28 డిసెంబరు(1885)న, ముంబాయిలో కాంగ్రెస్‌ ఏర్పడి, తొలి సదస్సు జరిపింది. బ్రిటిష్‌ రిటైర్డు అధికారి ఆలెన్‌ ఆక్టవియన్‌ హ్యూమ్‌ పూనికతో జరిగిన ఈ సదస్సులో దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన 72 మంది ప్రతినిధులు పాల్గొన్నారు. దాదాబాయ్‌ నౌరోజీ, జస్టిస్‌ రనడే, ఫిరోజ్‌షా మెహతా, కె.టి.తలంగ్, దిన్‌షా వాచా తదితర ముఖ్యులు పాల్గొన్న ఈ సదస్సుకు డబ్లు.సి.బెనర్జీ అధ్యక్షత వహించి, కాంగ్రెస్‌ ఉద్దేశాలు, లక్ష్యాలను వివరించారు. ‘‘రాజ్యంలో అక్కడక్కడ నెలకొంటున్న మత, వర్గ, ప్రాంత విభేదాలను పరిహరించి దేశ సంపూర్ణ సమైక్యత సాధనకు అంకితమైన కార్యకర్తల మధ్య మరింత సాన్నిహిత్యాన్ని, స్నేహభావాన్ని పెంపొందించడానికి’’ కాంగ్రెస్‌ ఏర్పడినట్టు చెప్పారు. ఇది చరిత్ర! 

నాయకత్వ లేమి 
ఇప్పుడు కాంగ్రెస్‌ ఒక రాజకీయ పార్టీగా పలు సమస్యల్ని ఎదుర్కొంటోంది. సమర్థ నాయకత్వం లేకపోవడం ప్రధాన సమస్య! స్వతంత్రానికి పూర్వం.. గోఖలే, మదన్‌మోమన్‌ మాలవ్య, మహాత్మాగాంధీ, మోతీలాల్‌ నెహ్రూ, అబుల్‌ కలామ్‌ ఆజాద్, లాలా లజపతిరాయ్, సుభాష్‌ చంద్రబోస్, జవహర్‌లాల్‌ నెహ్రూ వంటి గొప్ప నేతలు కాంగ్రెస్‌కు నాయకత్వం వహించారు. స్వతంత్రం తర్వాత ఏళ్లపాటు పాలకపక్షంగా ఉండిన తొలి ప్రధాని నెహ్రూ, తదనంతర ప్రధానులు ఇందిరాగాంధీ, రాజీవ్‌ గాంధీ, పీవీ నర్సింహారావులే కాకుండా జగ్జీవన్‌రామ్, నిజలింగప్ప, పట్టాభి సీతారామయ్య, కామరాజ్‌నాడార్, నీలం సంజీవరెడ్డి, కాసు బ్రహ్మానందరెడ్డి వంటి హేమాహేమీలు నేతృత్వం వహించిన కాంగ్రెస్‌ పార్టీ ఈ రోజు రాహుల్‌గాంధీ నేతృత్వంలోకి వచ్చింది. గాంధీ–నెహ్రూ కుటుంబ వారసత్వాన్ని మించిన అర్హతలు ఇంకా ఆయన నిరూపించుకోవాల్సి ఉంది. నిన్నా మొన్న ఆయన పగ్గాలు చేపట్టేనాటికే పార్టీ సంస్థాగతంగా ఎంతో బలహీన పడింది. క్రమంగా పార్టీకి జనాదరణ కూడా తగ్గి ఉన్న సమయంలో ఆయన చేతికి పగ్గాలు అందాయి. అప్పటికే, ప్రధాన రాజకీయ ప్రత్యర్థిగా భారతీయ జనతాపార్టీ తరపున ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీ బలమైన క్లాస్‌–మాస్‌ నాయకుడిగా స్థిరపడి ఉన్నారు.

కాంగ్రెస్‌ను సంస్థాగతంగా బలోపేతం చేయాలని రాహుల్‌కు, సోనియాగాంధీకి బలంగా ఉన్నా... ఎలా చేయాలో, అందుకు ఏం చేయాలో మార్గం తోచడం లేదు. స్వతంత్రానంతర ప్రస్థానంలోనూ కాంగ్రెస్‌ ఎన్నో రూపాల్లోకి మారినా, ప్రధానంగా వాటిని మూడు దశలుగా చెప్పుకోవచ్చు. 1947 తర్వాత 1952, ’57, ’62 వరుస సార్వత్రిక ఎన్నికల్లో గెలిచిన కాంగ్రెస్‌లో పెద్దగా మార్పులు లేవు. ఇక నెహ్రూ, లాల్‌బహదూర్‌ శాస్త్రి మరణం తర్వాత ఇందిరాగాంధీ నేతృత్వంలో ఎన్నికలు జరిగాయి. 520 లోకసభ స్థానాల్లో 283 స్థానాలకే పరిమితమైన 1967 ఎన్నికల నాటికి కొంత మార్పు పొడచూపింది. కానీ, 1971లో ఇందిరా గాంధీ పార్టీలో చీలిక తెచ్చి, ‘గరీబీ హటావో’ నినాదంతో ఎన్నికలకు వెళ్లినప్పటి నుంచి రెండో దశగా చెప్పొచ్చు. ఆ సంక్షోభం తర్వాత ప్రజాదరణ కన్నా, విధేయతకు పెద్దపీట వేస్తూ ఇష్టానుసారంగా రాష్ట్రాల్లో పార్టీ నాయకుల్ని మారుస్తూ తెచ్చిన కొత్త సంస్కృతి కాంగ్రెస్‌లో సంస్థా గత మార్పులకు నాంది అయింది. ఎమర్జెన్సీ, విపక్ష కూటమి జనతా ప్రయోగం విజయవంతమవడం, తిరిగి కాంగ్రెస్‌ అధికారం, ఇందిర హత్యోదంతం, రాజీవ్‌గాంధీ ప్రధాని కావడం, మైనారిటీ ప్రభుత్వాన్ని నడిపిన ఘనాపాటిగా పీవీ నర్సింహారావు పాలనాకాలమంతా ఈ దశలోదే! ఇక, గాంధీ–నెహ్రూ కుటుంబేతరుడిగా సీతారామ్‌ కేసరి బలహీన నాయకత్వం నుంచి పరోక్షంగా సోనియగాంధీ పార్టీ నాయకత్వ పగ్గాలు చేబుచ్చుకున్న 1997 నుంచి కాంగ్రెస్‌ మూడో దశగా పరిగణించవచ్చు. ఈ దశలోనే పార్టీ బాగా బలహీనపడింది. 

ఆశలు రేపి అడుగంటిన దశ! 
1998, 1999 ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఓటమిపాలయింది. పార్టీపై కాంగ్రెస్‌ నాయకత్వం పట్టు క్రమంగా సడలడం మొదలైంది అప్పుడే! కొత్తదనం కొంత, అయోమయం మరింత... అనవసరపు ఢిల్లీ పెత్తనాలు పెరిగాయి. ఈ దశ ఆరంభంలోనే మమతా బెనర్జీ. శరద్‌పవార్, సంగ్మా, తారిక్‌ అన్వర్‌ వంటి సీనియర్‌ నాయకుల్ని కాంగ్రెస్‌ దూరం చేసుకుంది. రాజేష్‌ పైలట్, మాధవరావ్‌ సింధియా వంటి  ద్వితీయ శ్రేణి నాయకులు దుర్ఘటనల్లో మరణించడం పార్టీకి నికర నష్టమైంది. దివంగత ప్రధాని వాజ్‌పేయి నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం 2004 వరకు అధికారంలో ఉంది. సంస్థాగతమైన ప్రతికూలతల నడుమ కూడా, మారిన రాజకీయ సమీకరణాల్లో 2004 ఎన్నికల్లో కాంగ్రెస్‌ నెగ్గి, యూపీఏ ప్రభుత్వం ఏర్పరచింది. ఏపీలో డాక్టర్‌ వై.ఎస్‌.రాజశేఖరరెడ్డి వంటి నేతలు ఆయా రాష్ట్రాల్లో సాధించిన గొప్ప విజయాలు కాంగ్రెస్‌కు లాభించాయి. కమ్యూనిస్టుల ఒత్తిళ్ల వల్లో, కనీస ఉమ్మడి కార్యక్రమం అమలు వల్లో యుపీఏ–1 (2004–2009) పాలనా పరంగా సత్ఫలితాలు సాధించింది.

కానీ, పార్టీగా కాంగ్రెస్‌ బాగా దెబ్బతిన్నది! కేంద్ర నాయకత్వ లోపమనే నింద ఎక్కువైనప్పటికీ, పార్టీ బలహీనపడటానికి కారణాలు చాలానే ఉన్నాయి. సంప్రదింపులు, ఏకాభిప్రాయ సాధనతో నిర్ణయాలు తీసుకునే పద్దతికి పార్టీ తిలోదకాలిచ్చింది. విశాల దృక్పథంతో రాష్ట్రాల్లో పార్టీ నాయకత్వాన్ని ప్రోత్సహించే సంస్కృతి నిలిచిపోయింది. సంబంధాలు పోయాయి. స్వీయ శ్రమతో ఎదిగిన వైఎస్సార్‌ వంటి ఒకరిద్దరికి తప్ప రాష్ట్ర నాయకులెవరికీ ‘అధిష్టానం’ వద్ద ప్రాధాన్యత దొరకని స్థితి వచ్చింది. సోనియా చుట్టూ చేరిన ‘కోటరీ’ ముఖ్యులు అయిదారు గురికి క్షేత్రస్థాయి వాస్తవాలు తెలిసేవి కావు. క్షేత్రస్థాయిలో ప్రజానాడి గ్రహించి ఎదిగిన, ఎదుగుతున్న రాష్ట్ర నాయకులకు అత్యున్నత నాయకత్వంతో లింకుని తెంపివేశారు. ఇరువురికీ నడుమ ‘కోటరీ’ సైంధవ పాత్ర పోషించేది. ఈ తప్పుడు ప్రాధాన్యతలు, నాయకత్వపు ఒంటెద్దు పోకడల వల్ల కాంగ్రెస్‌ క్రియాశీల కార్యకర్తల్లో ఉత్సాహం నీరుకారింది. వివిధ రాజకీయ సమీకరణాల వల్ల 2009లో యూపీయే అధికారాన్ని నిలబెట్టుకున్నా, పార్టీ సంస్థాగతంగా మరింత దిగజారింది. ఈ అసాధారణ విజయాన్ని కార్యకర్తల ఖాతాలో వేయకుండా, ‘కోటరీ’ తమ వ్యూహ విజయంగా చెప్పుకొని నాయకత్వాన్ని తప్పుదోవ పట్టించింది. పార్టీ శ్రేణు లకు అధినాయకత్వానికి నడుమ మరింత దూరం పెరిగింది! ఒకవైపు యూపీఏ–2 పాలనా వైఫల్యాలు, మరోవైపు దిగజారిన పార్టీ వ్యవస్థ, వెరసి 2014 ఎన్నికల్లో కాంగ్రెస్‌ 44 స్థానాలకు కుదించుకుపోయింది.

నిన్నటి ఫలితాలూ తప్పుడు అన్వయమే! 
పెద్దనోట్ల రద్దు తర్వాత ఉత్తరప్రదేశ్‌ తదితర అయిదు రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్‌ సానుకూల ఫలితాలు సాధించి ఉండాల్సింది. పంజాబ్‌ తప్ప ఏమీ దక్కలేదు. గుజరాత్‌ ఎన్నికల్లో సమీపం వరకు వచ్చినా తుది ఫలితం దక్కలేదు. ఒకదశలో, దేశం మొత్తంలో మూడు (పంజాబ్, కర్ణాటక, మిజోరాం) రాష్ట్రాల్లోనే కాంగ్రెస్‌ ప్రభుత్వాలున్న పరిస్థితి! నిన్నటి అయిదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్‌కు కొంత ఊరటనిచ్చినా విశ్లేషణ సరిగా లేదు. మధ్యప్రదేశ్, రాజస్తాన్, ఛత్తీస్‌గఢ్‌ ఫలితాలు కాంగ్రెస్‌ ఏకపక్ష విజయాలు కావు. ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్‌లలో 15 ఏళ్ల వరుస పాలన తర్వాత కూడా బీజేపీ పోటాపోటీగా స్థానాలు గెలిచింది. ప్రతిసారీ ప్రత్యామ్నాయ ప్రభుత్వాల్ని ఎన్నుకునే రాజస్తాన్‌లో కాంగ్రెస్‌కు చావు తప్పి కన్ను లొట్టబోయిన పరిస్థితి! ఒక సర్వే ప్రకారం ఆయా రాష్ట్రాల్లో ప్రజాదరణ స్థానిక బీజేపీ నాయకత్వం కన్నా ప్రధాని మోదీకి ఎక్కువ మోతాదులో ఉంది. రేపటి సార్వత్రిక ఎన్నికల్లో మోదీ వర్సెస్‌ రాహుల్‌గా ప్రజలు నిర్ణయించాల్సి ఉంటుంది. హిందీ రాష్ట్రాల్లో సానుకూలంగా ఉండే మాయావతితో పొత్తు కుదరకపోవడం పార్టీ నాయకత్వ వైఫల్యమే! విశ్వసనీయతే లేని చంద్రబాబు నాయుడు వంటి నాయకులతో పొత్తు కుదిరినా తెలంగాణలో ఫలితం వికటించడం వంటివి పార్టీ నాయకత్వ సామర్థ్యాన్ని ఎండగట్టేవే!  

ఇప్పుడున్న పరిస్థితుల్లో చంద్రబాబొక చెల్లని రూపాయి! తెలంగాణలో టీఆరెస్‌తో నేను పొత్తుకు యత్నించినా, వారు కుదరనీయనందున కాంగ్రెస్‌తో పెట్టుకోవాల్సి వచ్చిందని బాబు బహిరంగంగానే చెప్పారు. ఆయనిచ్చే ‘వనరుల’కు కక్కుర్తి పడి రాష్ట్రంలో పార్టీ ప్రయోజనాల్ని తాకట్టు పెట్టాలా? మరో చోట వనరులు దొరక్కపోయేవా? కాంగ్రెస్‌ నాయకత్వం ఆలోచించాలి. ఇటువంటి పరీక్షలన్నిటికీ నిలిచి, కాంగ్రెస్‌ 2019 ఎన్నికల్ని ఎదుర్కోవాల్సిన కూడలిలో ఉందిప్పుడు! (నేడు కాంగ్రెస్‌ ఆవిర్భావ దినోత్సవం)


వ్యాసకర్త: దిలీప్‌ రెడ్డి, 
ఈ–మెయిల్‌ : dileepreddy@sakshi.com

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement