కేవలం రాహుల్ గాంధీని నమ్ముకుంటే గట్టెక్కుతామా? ప్రత్యామ్నాయమేమైనా ఉందా? ప్రియాంక గాంధీ నూతన ఆశాజ్యోతి అయ్యేనా? కాంగ్రెస్ శ్రేణుల్ని వెంటాడుతున్న ప్రశ్నలివి. కేంద్రంలో అధికారం చేజారిన తర్వాతి ఆరేళ్లలో పార్టీ పరిస్థితి రాజకీయంగా ఒక అడుగు ముందుకు, రెండడుగులు వెనక్కి అన్నట్టు తయారయింది. సంస్థాగతం, ప్రజా దరణ... ఎలా చూసినా ఎదుగుదల లేదు. ఒక సంక్షోభం నుంచి మరో సంక్షోభానికి జారిపోతున్నట్టుంది. సుస్థిర, ఆధారపడదగ్గ నాయకత్వ లేమి పార్టీలో కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది.
ప్రత్యామ్నాయ రాజకీయ, ఆర్థిక, వ్యవసాయ, పారిశ్రామిక విధానాల్ని వెల్లడించలేకపోవడమూ లోపమే! దేశవ్యాప్తంగా తాము, తమ కూటమి (యుపీఏ) ప్రత్యామ్నాయ రాజకీయ శక్తి అని ఎక్కడికక్కడ ఉనికి చాటుకునేందుకే పోరాడాల్సి వస్తోంది. ఒకటొకటిగా రాష్టాలన్నీ ‘చే’జారిపోతున్నాయి. ఈ పరిస్థితుల్లో రాహుల్ పంజాబ్ రైతులతో ‘ఖేతీ బచావ్’ట్రాక్టర్ ర్యాలీలు, సోదరి ప్రియాంకతో కలిసి ఉత్తర్ ప్రదేశ్‌లో జరిపిన ‘హథ్రాస్ పర్యటన’ పార్టీలో నూతనోత్సాహాన్ని నింపాయని అధినాయకత్వం భావిస్తోంది. ‘పోరాడొచ్చు, మరీ చేతు లెత్తేయాల్సిన దుస్థితిలేదు’ అన్న కొత్త నమ్మకం శ్రేణుల్లో కలుగు తున్నట్టు పార్టీ వర్గాల్లో ప్రచారం మొదలైంది. అందుకే, నాయకత్వం క్షేత్రస్థాయి నుంచి స్పందన సమాచారం (ఫీడ్‌బ్యాక్) తెప్పించుకుం టోంది.
రెండు పరిణామాలకు సంబంధించీ... కాంగ్రెస్ నాయక త్వంలో, దాని విధానాలు–అమలులో ద్వైదీభావమున్నట్టు కనిపి స్తోంది. సొంత వైఖరిని గట్టిగా సమర్థించుకోలేని స్థితి, గతానికి జవా బుదారుగా నిలువలేని పరిస్థితి! దీన్నొక అవకాశంగా మలుచుకుంటూ పాలక బేజీపీ కాంగ్రెస్‌ను ఎండగట్టే పనిలోపడింది. అధికారంలో ఉంటే ఒక పంథా, విపక్షంలో ఉంటే మరో వైఖరా? అని ప్రశ్నిస్తు న్నాయి. దేశంలో ప్రధాన ప్రతిపక్షంగా ప్రత్యామ్నాయ ప్రభుత్వం ఇస్తామనే వాళ్లు ఏకరీతి వ్యవసాయ విధానాన్ని ప్రకటించాలని నిలదీస్తున్నాయి. ఇదివరకటి విధానాల నుంచి దారిమళ్లుతున్నపుడు సంజాయిషీ ఇవ్వాలంటున్నాయి. అందుకు కాంగ్రెస్ నాయకత్వం సిద్ధంగా ఉందా? అనే ప్రశ్న కాంగ్రె‹స్‌కు ఇంటా బయటా ఎదురౌ తోంది.
(చదవండి: ‘ఎవరికీ భయపడం.. న్యాయం తప్ప ఇంకేమీ వద్దు’)
వాటన్నింటికన్నా ముందు సంస్థాగతంగా పార్టీ బలోపేత మవ్వాలి, బలమైన నాయకత్వాన్ని సుస్థిరపరచుకోవాలి, అందుకు నాయకత్వం ఏం చేస్తోందనే ప్రశ్న పార్టీ అన్ని స్థాయిల నుంచీ వస్తోంది. ఇదే విషయమై 23 మంది సీనియర్లు పార్టీ అధినేత్రికే లేఖ రాసి, ఇటీవలి వర్కింగ్ కమిటీ (సీడబ్లు్యసీ) భేటీలోనూ లేవనెత్తారు. ఆ అంశాలకు తామింకా కట్టుబడే ఉన్నట్టు వారిలో ఒకరైన మనీష్ తివారీ తాజాగా ఒక ఇంటర్వూ్యలో ప్రకటించారు. వీటికి సంతృప్తికర సమా ధానాలిచ్చి, శ్రేణుల్లో నైతిక స్థయిర్యం నింపితే తప్ప ముందుకు కదల లేని స్థితిలో నాయకత్వం సతమతమౌతోంది.
అన్నీ, అంతటా చేయగలరా?
ఎన్డీయే ప్రభుత్వం తీసుకువచ్చిన మూడు వ్యవసాయ చట్టాలని కాంగ్రెస్ తీవ్రంగా తప్పుబడుతోంది. అలాంటి చట్టాల్ని తీసుకు వస్తామని లోగడ తమ ఎన్నికల మానిఫెస్టోలో ప్రకటించిన కాంగ్రెస్, భిన్న వైఖరితో ఇప్పుడు ఓటుబ్యాంకు రాజకీయాలకు పాల్పడుతోం దని పాలకపక్షం చేసే విమర్శకు వారివద్ద సమాధానం లేదు. కాంగ్రెస్ లోగడ ఆర్జేడీతో కలిసి మహాకూటమిగా గెలుపొందిన బిహార్‌లో ప్రయివేట్ మండీ వ్యవస్థ అమలౌతోంది. ఇప్పుడు తామధికారంలో ఉన్న రాజస్తాన్‌లోనూ వ్యవసాయోత్పత్తులకు ప్రయివేటు మార్కెట్ వ్యవస్థ ఉంది. రైతులు ఇబ్బంది పడుతున్నారు.
(చదవండి: వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన వ్యక్తి అరెస్ట్)
అక్కడ వాటిని రద్దు చేసి, ప్రభుత్వ మార్కెట్ వ్యవస్థల్ని పటిష్టపరుస్తూ, మద్దతు ధర లభిం చేలా చేస్తామని కాంగ్రెస్ ప్రకటించగలదా? అన్న ప్రశ్నకు స్పందిం చాలి. కొత్త చట్టాలతో తమకు దక్కకుండా పోతాయేమోనని పంజా బ్‌లో రైతాంగం ఆందోళన చెందుతున్న మద్దతు ధర, ప్రభుత్వ పక్కా మార్కెటింగ్ వ్యవస్థల్ని దేశవ్యాప్తంగా ఏకరీతిన అమలు చేస్తామని ప్రకటిస్తే తప్ప రైతాంగం కాంగ్రెస్‌ను విశ్వసించదు. కొత్త వ్యవసాయ చట్టాలను తాము అధికారంలోకి వచ్చాక బుట్టదాఖలు చేస్తామని రాహుల్ ప్రకటించారు. హత్రాస్ వంటి దాష్టీకాలు దేశంలోని పలు చోట్ల జరుగుతున్నాయి. వివిధ రాష్ట్రాల్లో ప్రజలు రకరకాల సమస్య లతో సతమతమవుతున్నారు. వాటన్నిటికి ఇదే స్ఫూర్తితో నాయకత్వం ఎందుకు స్పందించదనే ప్రశ్న తలెత్తుతోంది. ఉత్తరాదిపై చూపే శ్రద్ధ దక్షిణాది రాష్ట్రాలపై చూపరని, ఉత్తరాదిలోనూ శ్రద్ధ ఉత్తరప్రదేశ్‌పైనే ఉంటుందనే విమర్శ ఉంది. 2022లో అక్కడ అసెంబ్లీ ఎన్నికలుం డటం, తమ కుటుంబానికి అది రాజకీయ కార్య క్షేత్రం కావడమే కారణమైతే ఈ వివక్ష తగదనే భావన పార్టీ శ్రేణుల్లో ఉంది.
అసలెక్కడ బావుందని?
కాంగ్రెస్ పరిస్థితి దేశమంతటా దిగదుడుపుగానే ఉంది. 2004 నుంచి పదేళ్ల పాలన తర్వాత 2014 లోక్‌సభ ఎన్నికల్లో చరిత్రాత్మక అత్యల్ప సంఖ్య, 44 నమోదు చేసింది. కొత్తగా ఏర్పాటైన నరేంద్రమోదీ నేతృ త్వపు ఎన్డీయే ప్రభుత్వంపై యువనాయకుడు రాహుల్ నేతృత్వంలో పార్టీ అయిదేళ్లు పోరాడి, 2019 ఎన్నికల్లో 8 స్థానాలు మాత్రమే (మొత్తం 52) పెంచుకోగలిగింది. అతి పెద్ద వైఫల్యమిది. దేశంలో విస్తీర్ణపరంగా, రాజకీయంగా కీలకమైన అయిదు రాష్ట్రాలు ఉత్తర ప్రదేశ్, బీహార్, పశ్చిమబెంగాల్, మహారాష్ట్ర, తమిళనాడుల్లో కలిపి 249 లోక్‌సభ స్థానాలుంటే కాంగ్రెస్ ప్రాతినిధ్యమున్నది 12 చోట్ల. ఇక్కడే మొత్తం 1462 అసెంబ్లీ స్థానాలకు గాను కాంగ్రెస్‌కున్నవి 130 మాత్రమే!
ఏపీ, ఢిల్లీ, త్రిపుర, సిక్కిం, నాగాలాండ్‌లలో కనీసం ఒక స్థానం కూడా లేదు. సొంతంగా ప్రభుత్వాలున్న కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల సంఖ్య దేశంలో 3కు తగ్గిపోయింది. పంజాబ్, రాజస్తాన్, ఛత్తీస్‌గఢ్ కాకుండా పాలనలో ఉన్న పాండిచ్చేరి సగం రాష్ట్రమైతే, మహారాష్ట్రలో కాంగ్రెస్ సంకీర్ణ భాగస్వామి. కర్ణాటకలో 13 మంది ఎమ్మెల్యేల రాజీనామాలను, సంకీర్ణ ప్రభుత్వం ‘చే’జారడాన్ని ఆపలేక పోయింది. అంతకు ముందు గోవా, మణిపూర్ ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా అవతరించి కూడా ప్రభుత్వాలు ఏర్పాటు చేయలేక చతికిల పడింది. సమర్థనాయకత్వం లేదనే భావన కాంగ్రెస్ శ్రేణుల్లో బలపడు తోంది. రాజకీయాల్లోకి వచ్చి, ఎదగాలనుకునేవారు నాయకత్వంపై నమ్మకం కుదరనపుడు ప్రత్యామ్నాయ రాజకీయ వేదికల్ని వెతుక్కో వడం çసహజం. బీజేపీ తరఫున గెలిచిన 300 పైచిలుకు ఎంపీల్లో కనీసం పది శాతం, అంటే 30 మందిపైనే మాజీ కాంగ్రెస్ నాయకు లున్నారు. గెలిచిన తర్వాత పార్టీ ఫిరాయించి పాలకపక్షం పంచన చేరిన వారిలో లోక్‌సభ సభ్యులకన్నా శాసన సభ్యులే అధికం.
తరాల మధ్య తరగని అంతరాలు
ఇంకా గాంధీ–నెహ్రూ కుటుంబాన్ని నమ్ముకుంటే ఓట్లు రాలటం లేదు. కాదని బయటకు నడుద్దామంటే పార్టీ నిలిచే పరిస్థితి లేదు. పార్టీని సమైక్యంగా ఉంచడానికి ఆ కుటుంబంపైనే ఆధారపడాల్సి వస్తోంద న్నది పార్టీ వర్గాల నిశ్చితాభిప్రాయం. నాయకత్వానికి పరిష్కారం తట్టడం లేదు, దానికి వర్కింగ్ కమిటీ భేటీలో రభసే నిదర్శనం. రాహుల్ తన స్థానాన్ని దిటువు చేసుకోకపోవడం ప్రధాన సమస్య. ఒకటిన్నర దశాబ్దాల పరిణామాల్లో సోనియాగాంధీ వృద్ధకోటరీ పాత తరం, రాహుల్ కేంద్రకంగా తయారైన ‘నవతరం’ మధ్య పెనుగులాట సాగుతోంది. ఇందులో మేలైన స్పర్థ కన్నా పొసగనితనమే ఎక్కువ. ఫలితంగా పార్టీకి ఏ మేలూ జరగట్లేదు. ఫలితాలు ఆశాజనకంగా లేవు. పదిహేడేళ్ల కింద పడ్డ ఓ బీజం, ఎదుగుదల సరిగా లేదు.
2003 సిమ్లాలో పార్టీ ‘చింతన్ శిబిర్’ జరుగుతున్నపుడు, సోనియా కోటరీ ప్రధానకార్యదర్శి ఒకరు సర్వే జరిపించారు. పార్టీలో యువతను ప్రోత్స హించాల్సి వస్తే ఎవరైతే బావుంటుంది? అప్పుడు జ్యోతిరాధిత్య సింధియా, సచిన్‌పైలట్, జితిన్‌ప్రసాద్, మిలింద్ దేవర, ఆర్పీఎన్ సింగ్ వంటి పేర్లు వచ్చాయి. ఒక ఎమ్మెల్యేను మినహా యించి 2004 ఎన్నికల్లో వారందరికీ పార్టీ టిక్కట్లిచ్చి నాయకత్వం లోక్‌సభకు తెచ్చింది. అప్పుడే 33 ఏళ్ల రాహుల్ కూడా సభకు వచ్చారు, రాహుల్ యువ బృందం ఏర్పడింది. నిజానికి, మంత్రిపదవి తీసుకొని 2004లో ఏర్పడ్డ యూపీఏ ప్రభుత్వంలోనో, తర్వాతి 2009 ప్రభుత్వంలోనో రాహుల్ భాగస్వామి అయుండాల్సిందనే అభిప్రాయం కొందరు ఇప్ప టికీ వ్యక్తం చేస్తారు. కానీ ఆయన పార్టీ ఉపాధ్యక్షుడిగా ఉన్నారు.
తారుమారైన పరిస్థితి
సంస్థాగత వ్యవహారాల్లో రాహుల్ క్రియాశీల పాత్ర ప్రారంభించారు. చొరవ తీసుకొని రాజస్థాన్ కాంగ్రెస్ పగ్గాలు సచిన్ పైలట్‌కు, హరి యాణా పీసీసీ పీఠం అశోక్ తన్వర్‌కు ఇప్పించడంతో కాంగ్రెస్‌లో నెమ్మదిగా ఇక తరం మారుతోందనుకున్నారు. కానీ, 2014 సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ ఓటమి తర్వాత వృద్ధ తరం ఆధిపత్యం పుంజుకుంది. వివిధ స్థాయిల్లో నాయకత్వ మార్పిడితో యువతకు పట్టం కట్టాలన్న రాహుల్ ప్రతిపాదనను వారు పొసగనీయలేదు. అధికారంలో లేన పుడు అటువంటివి సత్ఫలితాలివ్వవంటూ మార్పును అడ్డుకున్నారు. బిహార్‌లో సంకీర్ణ విజయం (2015), పంజాబ్‌లో సొంత గెలుపు (2017), గుజరాత్‌లో దాదాపు గెలుపు వాకిట్లోకి రావడం (2017 చివర్లో), ఎంపీ, ఛత్తీస్‌గఢ్, రాజస్తాన్ మూడు రాష్ట్రాల్లో విజయాలు (2018) పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నింపాయి.
కానీ, వృద్ధతరం ఆధిపత్యం యువతరాన్ని వెనక్కినెట్టి మధ్యప్రదేశ్, రాజస్తాన్‌లో జ్యోతిరాదిత్య, సచిన్ పైలెట్‌లు ముఖ్యమంత్రులు కానీకుండా అడ్డు కున్న నాటకం పార్టీకి తగిలిన పెద్ద దెబ్బే! కమల్‌నాథ్, అశోక్ గెహ్లా ట్‌లు ముఖ్యమంత్రులయ్యారు కానీ, యువత అసంతృప్తి వల్ల పార్టీ చితికిపోయింది. అసంతృప్తికి గురైన సింధియా తన అనుచర ఎమ్మెల్యే లతో నిష్క్రమించడంతో ఎంపీలో ప్రభుత్వం బీజేపీ పరమైంది. చివరి క్షణం రాజీతో రాజస్తాన్‌లో చావుతప్పి కన్నులొట్టబోంది. రాహుల్ ‘పప్పు’ అనే ప్రచారాన్ని బీజేపీ తీవ్రం చేసింది. మోదీ–అమిత్‌షా ద్వయం చేపట్టిన ‘కాంగ్రెస్ విముక్త భారత్’ ఊపందుకుంది. రాహుల్ వ్యవహారశైలి కూడా విమర్శలకు గురైంది. బాధ్యత తీసుకోరని, రిమోట్ పద్ధతిన అధికారం చెలాయింపజూస్తారనేది ముఖ్యారోపణ.
అంతటా తన మనుషులుండాలనుకుంటారు, కానీ, అవసర సమ యాల్లో వారికీ అందుబాటులో ఉండరని ఆరోపణ. అందుకు తగ్గట్టు గానే ఒక్క హిమంత్ బిశ్వశర్మను లెక్కజేయనితనంవల్ల నేరుగా ఓడిపోయో, పరోక్ష కారణాలతో సర్కార్లు కూలిపోయో మొత్తం ఈశాన్య రాష్ట్రాల్లోనే కాంగ్రెస్ తుడిచిపెట్టుకుపోయింది. ప్రాంతీయ పార్టీలతో పొత్తులు పెట్టుకొని పలుచోట్ల చతికిల పడింది. తెలంగాణ కాంగ్రెస్‌లో ఇంకా వీడని అయోమయం. ఏపీలో ఇప్పటికీ పార్టీకి నామరూపాల్లేవు. బిహార్‌లో ఆశాజనక పరిస్థితి లేదు. కేరళలో పుంజుకునే సంకేతాల్లేవు. నాయకత్వలేమి, సమిష్టి తత్వలోపం, విధానాల అస్పష్టత వంటి సమస్యల నుంచి పార్టీ గట్టెక్కితే గాని బీజేపీ సంకీర్ణానికి కాంగ్రెస్ గట్టిపోటీ ఇవ్వలేదు. ట్రాక్టర్ ర్యాలీ, హాథ్రస్ పర్యటన కొత్త స్ఫూర్తి అనుకుంటే... ప్రయాణం ఇప్పుడిప్పుడే తిరిగి మొదలైనట్టు భావించాలి.
వ్యాసకర్త: దిలీప్ రెడ్డి
ఈ–మెయిల్ : dileepreddy@sakshi.com
Comments
Please login to add a commentAdd a comment