నివాళి
పేదవాడిని ప్రేమించడమే పెరుమాళ్లును సేవించడమని ఆయన మనసావాచా నమ్మారు. అందుకే మఠం సొమ్ముతో కంచి కామకోఠి ఆస్పత్రులు, నేత్ర వైద్యశాలలు, నామమాత్రంగా రుసుము తీసుకునే విద్యాసంస్థలు నెలకొల్పారు.
సనాతన ధర్మాన్ని నిలబెట్టడం కోసం జగద్గురు ఆది శంకరాచార్య స్థాపించి, స్వయంగా వారే ఆధిపత్యం వహించిన కంచి పీఠం ఎంతో విశిష్టమైనది. ఆ పరంపరలో 68వ పీఠాధిపతిగా అందరినీ తరింప చేసిన పరమాచార్య శ్రీశ్రీశ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామి వారు సాక్షాత్తూ భూమిపైకి దిగివచ్చిన శంకరులుగా, నడిచే దైవంగా, త్రికాలజ్ఞులుగా అందరికీ తెలుసు.
మఠ సంప్రదాయాన్ని అను సరించి, ఆయన జీవించి ఉండ గానే, ఆయన సంకల్పంతో, తన తరువాతి పీఠాధిపతిగా వారసు లుగా నియమితు లయ్యారు శ్రీశ్రీశ్రీ జయేంద్ర సరస్వతీ స్వామి. ఆ కంచిమఠ ప్రాధాన్యాన్ని నిలబెడుతూ మనందరికీ మార్గదర్శకులు అయ్యారు. అయితే ఆయన మహిమలేమీ చూపలేదు. మాయలూ చేయలేదు. కానీ ఆచరించదగ్గ మంచి మాటలెన్నో చెప్పారు. వాటిలో కొన్నింటిని మననం చేసుకుందాం...
తల్లిదండ్రులు చిన్నప్పుడు పిల్లలకు నేర్పిందే వారికి జీవితాంతం ఉంటుంది. పిల్లలను ప్రేమించడం అంటే వారికి ఏ కష్టమూ రాకుండా చూసుకోవడం కాదు, కష్టం వచ్చినప్పుడు దానిని అధిగమించడం ఎలాగో నేర్పడం. వారికి బాల్యం నుంచి రామాయణ భారత భాగవత కథలు చెబుతూ, అందులోని నీతిని, ధర్మాన్ని, న్యాయాన్ని నేర్చుకునేలా చేయి. ఎలా బతకాలో, ఎలా బతకకూడదో, పొరుగువారిని ప్రేమించడం ఎలాగో నేర్పు...
నీకేదో నాలుగు అక్షరం ముక్కలు వచ్చినాయని గర్వ పడటం కాదు, నీకు తెలిసిన విద్యను, నీ సంస్కారాన్ని వారు నేర్చుకునేలా చేయాలి. కాబట్టి ముందు నువ్వు మంచి ప్రవర్తనతో మెలుగు అనేవారు. అదేవిధంగా నువ్వు పూజా పురస్కారాలు చేయడం కాదు, నీ కుమారుడికి నేర్పు, నీవు రుచికరమైన వంటలు చేయడం కాదు, నీ కుమార్తెకు మంచి మంచి వంటకాలు చేయడం నేర్పించు.
మన సంస్కృతిలోని గొప్పదనాన్ని వారంతట వారే తెలుసుకునేలా చేయి. ధనం సంపాదించడం ఒక్కటే కాదు, నీతి నిజాయితీలతో జీవించగలిగే ఇంధనాన్ని వారి జీవన ప్రయాణంలో నింపు అని చెప్పేవారు తన వద్దకొచ్చిన వారితో. అయితే, ఎన్ని మంచి మాటలు చెప్పినా, సమాజానికి వారు ఎంత సేవ చేసినా, వారిపైన కూడా కొన్ని నీలినీడలు, అపవాదులు, అభి యోగాలు ఉన్నాయి.
మాయలో ఉన్న ప్రకృతిలో కలిప్రభావంతో వచ్చే అపవాదులవంటి వాటిని సహనంతో తట్టుకొని, దైవశక్తితో నిష్కళంకులై, ధర్మప్రబోధానికి ప్రత్యక్షసాక్షులు అయ్యారు! వారు సిద్ధిపొంది, భౌతిక కాయాన్ని విడిచినా, ఆ దైవశక్తి పరంపరగా కొనసాగుతుంది. ఆదిశంకరులు మనకందించిన ధర్మాచరణ విధానం, అద్వైత మత ఆచరణ – ఆ కంచి పీఠం ద్వారా, శ్రీశ్రీశ్రీ విజయేంద్ర ఇందిరా సరస్వతీ మార్గదర్శనంలో మనం పనిచేస్తాము. శ్రీశ్రీశ్రీ జయేంద్ర సరస్వతీ స్వామి మన మధ్యలో భౌతి కంగా లేకపోయినా, పరంపరాగత శక్తి మనకి మార్గదర్శనం చేస్తూ ఉంటుంది. అనంతానికి ఎంత కలసినా అనంతమే!
అనంతంలో నుంచీ ఎంత తీసేసినా అనంతమే!
మానవాళి కోసం, విశ్వ శాంతి కోసం ఆచార్యుల వారు చేసిన కృషి అనన్య సామాన్యమైనది. పేదవాడిని ప్రేమించడమే పెరుమాళ్లును సేవిం చడమని మనసా వాచా నమ్మిన వారాయన. అందుకే మఠం సొమ్ముతో మఠం పేరుతో కంచి కామకోఠి ఆస్పత్రులు, నేత్ర వైద్యశాలలు, నామ మాత్రంగా రుసుము తీసుకునే విద్యాసంస్థలు నెలకొల్పారు. ఆయన చేసిన మహా మంచి పనులకు లెక్క కట్టటం కూడా కష్టసాధ్యమైనదే ననడం అతిశయోక్తి కాదు..
సామాన్యుల నుంచి అసాధారణమైన వారి వరకు ఆయనకు పాదాభివందనం చేయటం కోసం వేచి ఉండేవారు. అలాంటి ఒక ఉత్తమో త్తములకు, శిఖరాగ్రం అయినటువంటి మహా మనీషికి ఎవరు ఎంతటి మర్యాద ఇచ్చినా ఇవ్వకపోయినా, ఆయన విలువ మాత్రం ఎపుడూ అలానే నిలిచి ఉంటుంది.. అది ఆచంద్ర తారార్కం.. అలాంటి ఒక గురుతుల్యులకు, భగవత్సమానులకు అంజలి ఘటిస్తూ దేశం యావత్తూ కన్నీటి వీడ్కోలు సమర్పిస్తోంది.
–డి.వి.ఆర్.భాస్కర్
Comments
Please login to add a commentAdd a comment