జయేంద్ర సరస్వతి బృందావన ప్రవేశఘట్టం
కాంచీపురం నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: శివైక్యం చెందిన కంచి పీఠాధిపతి శ్రీ జయేంద్ర సరస్వతి (82) బృందావన ప్రవేశం (అంత్యక్రియలు) గురువారం ముగిసింది. మఠంలోని బృందావనంలో వేదమంత్రోచ్ఛారణల మధ్య సంప్రదాయపద్ధతిలో ఆయన భౌతికకాయాన్ని మహాసమాధి చేశారు. శిష్యులు, వేదపండితులు, రాజకీయ ప్రముఖుల సమక్షంలో అశ్రునయనాల మధ్య స్వామి ‘బృందావన ప్రవేశ’ (అధిష్టానం అని కూడా అంటారు) కార్యక్రమం ముగిసింది. గురువారం ఉదయం 7.45 గంటలకు ప్రారంభమైన ఈ కార్యక్రమం మూడున్నర గంటలసేపు కొనసాగింది.
ఉదయం అభిషేకంతో ప్రారంభమైన అంతిమసంస్కారం హారతితో ముగిసింది. దీంతో దాదాపు నాలుగు దశాబ్దాల పాటు మఠ పీఠాధిపతిగా దేశ, విదేశాల్లో కీర్తించబడిన శ్రీ జయేంద్ర సరస్వతి శంకరాచార్య భౌతిక శరీరం పంచభూతాల్లో కలిసి పోయింది. ఈ కార్యక్రమంలో తమిళనాడు గవర్నర్ భన్వరీలాల్, కేంద్ర మంత్రులు రాధాకృష్ణన్, సదానంద గౌడ సహా పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. అంతిమసంస్కారం జరుగుతున్నంతసేపు కైలయ వాద్యం (శివారాధన సందర్భంగా గుళ్లలో వాయించే తమిళ సంప్రదాయ వాయిద్యం) మోగుతూనే ఉంది.
రాత్రంతా మఠంలో ప్రార్థనలు
సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు, శిష్యులు, వైరాగ్య పండితులు బుధవారం రాత్రంతా మండపాల్లో స్వామీజీ పార్థివదేహం ముందు ప్రార్థనలు చేశారు. ఉదయం 7 గంటలకు బృందావన ప్రవేశ కార్యక్రమం ప్రారంభమైంది. స్వామీజీ భౌతికకాయాన్ని సమాధి చేసే తంతును మఠం నిర్వాహకులు బృందావన ప్రవేశ కార్యక్రమంగా పేర్కొన్నారు. గురువారం నుంచి మఠం పీఠాధిపతి బాధ్యతలు చేపట్టిన శ్రీ విజయేంద్రసరస్వతి పర్యవేక్షణలో అధిష్టాన పూజాధికాలు ప్రారంభమయ్యాయి.
ఉద్విగ్నం.. ఉద్రిక్తం
జయేంద్ర సరస్వతిని కడసారి చూసేందుకు మందిర ప్రాంగణంలోకి వచ్చిన వారిని అంతిమసంస్కారం సమయంలో కాసేపు పోలీసులు ఆపివేశారు. అప్పటివరకు ఎల్‌ఈడీ స్క్రీన్‌ల ద్వారా మొత్తం కార్యక్రమాన్ని భక్తులకోసం మఠం నిర్వాహకులు అందుబాటులో ఉంచారు. అయితే అలంకరణ సమయంలో కాసేపు ప్రత్యక్షప్రసారాన్ని నిలిపేశారు. దీంతో పోలీసుల వలయాన్ని దాటుకుని లోపలకు వెళ్లేందుకు భక్తులు ప్రయత్నించారు. ఈ సమయంలో అక్కడున్న వాలంటీర్లు కొందరు కిందపడిపోవటంతో పరిస్థితి కాస్త ఉద్రిక్తంగా మారింది.
వెంటనే పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. అయితే కాసేపటికే అభిషేకం, అలంకరణ తర్వాత స్వామీజీ భౌతికకాయాన్ని మండపంలోకి తీసుకురావటంతో మళ్లీ భక్తులందరూ చూసేందుకు అవకాశం లభించింది. కడసారి స్వామీజీని చూసిన భక్తుల ఆవేదనతో మండపం, మఠం ప్రాంగణం ఒక్కసారిగా ఉద్వేగంగా మారిపోయింది. జయేంద్ర సరస్వతి శివైక్యంపై నటుడు రజనీకాంత్ ట్వీటర్‌లో సంతాపం వ్యక్తం చేయగా.. కమల్ çహాసన్ పార్టీ మక్కల్ నీతి మయ్యం కూడా ఒక ప్రకటనలో విచారం వ్యక్తం చేసింది.
శంకరాచార్యుని బోధనలతో..
గురువు శంకరాచార్య జయేంద్ర సరస్వతి బోధనలను భక్తులు అలవర్చుకుని.. ఆధ్యాత్మిక జీవితాన్ని గడపాలని కంచిమఠం కొత్త పీఠాధిపతి విజయేంద్ర సరస్వతి ఉపదేశించారు. శివైక్యం పొందిన జయేంద్ర సరస్వతి స్వామీజీకి ప్రజలు, దేశం నాడీ బాగా తెలుసన్నారు. ప్రజల మధ్య వివక్ష చూపకుండా అందరం ఒకటేననే భావనను ఆయన ప్రచారం చేశారన్నారు.
బృందావన ప్రవేశం ఇలా
స్వామీజీ భౌతిక కాయానికి శాస్త్రబద్ధంగా చందన, పుష్ప, క్షీరాభిషేకాలు జరిపారు. ఆపైన వేదపండితులందరూ కలిసి చంద్రమౌళేశ్వర పూజ నిర్వహించారు. అనంతరం పుష్పాలు, సుగంధ ద్రవ్యాలు, పరిమళాలు వెదజల్లే పూలమాలలతో స్వామీజీని అలంకరించారు. పట్టువస్త్రాలు చుట్టి, అమ్మవారి కుంకుమను దిద్దారు. భక్తులందరూ చూసేందుకు వీలుగా ఎత్తైన బల్లపై భౌతిక కాయాన్ని కూర్చోబెట్టారు. చుట్టూ విజయేంద్ర స్వామీజీ, పండితులు, ముఖ్యమైన శిష్యులు నిలబడి అధిష్టాన కార్యక్రమాన్ని నిర్వహించారు.
మఠం ఆచారాల ప్రకారం, సనాతన సంప్రదాయాల ప్రకారం 13 అడుగుల లోతు, 15 అడుగుల పొడవు, 10 అడుగుల వెడల్పుతో గొయ్యి తీశారు. ధ్యానముద్రలో ఉన్న స్వామి పార్థివదేహాన్ని సింహాసనం లాంటి కుర్చీలో కూర్చోబెట్టి గొయ్యిలోకి మెల్లిగా దించారు. ఈ సమాధిలో పూలు, వాసంబు (ఔషధ మొక్క), చందనం చెక్కలతోపాటు పలు సుగంధ ద్రవ్యాలు, ఉప్పు, ఇసుక వంటి వాటితో నింపేశారు. ఆపైన రాహుకాలం ప్రవేశించే 10.30 గంటలకు ముందే అశేష భక్త జనావళి సమక్షంలో స్వామీజీ భౌతిక కాయాన్ని బృందావన ప్రవేశం చేశారు. ఈ ప్రక్రియకు ముందు స్వామీజీకి ప్రియ శిష్యుడిని ఎంపిక చేసి ఆయన చేతుల మీదుగా నారికేళంతో కపాలమోక్షం చేయించారు.
కార్యక్రమానికి హాజరైన వందలాది మంది ప్రజలు
Comments
Please login to add a commentAdd a comment