కంచి కామకోటి పీఠాధిపతుల్లో అత్యంత వివాదాస్పదమైన ఆధ్యాత్మిక గురువుగా జయేంద్ర సరస్వతిని పరిగణిస్తే ఆయనకు ముందు 88వ పీఠాధిపతిగా దాదాపు 87 ఏళ్లు కొనసాగిన చంద్రశేఖరేంద్ర సరస్వతిని అత్యధిక గౌరవ ప్రతిపత్తులున్న ‘పరమాచార్య’గా గౌరవిస్తారు. అసలు కంచి పీఠం హోదాపైనే చాలా కాలం వివాదం సాగింది. హిందూ మత పునరుద్ధరణకు పునాదులు వేసిన ఆది శంకరాచార్య స్థాపించిన నాలుగు పీఠాల్లో కంచి లేదనీ, దీన్ని ఆయనే ఏర్పాటు చేశారనే మాటల్లో నిజం లేదని అనేక మంది వాదిస్తారు.
ఎనిమిదో శతాబ్దంలో జీవించిన ధర్మసంస్కర్త శంకరాచార్య అద్వైత వేదాంత ప్రచారానికి తూర్పున పూరీ(ఒడిశా), పశ్చిమాన ద్వారక(గుజరాత్), ఉత్తరాన జ్యోతిర్మఠ్బదరీనాథ్(ఉత్తరాఖండ్), దక్షిణాన శృంగేరి(కర్ణాటక)లో నాలుగు మఠాలు స్థాపించారని, కంచి పీఠం వీటిలో లేదని కొందరు చెబుతారు.
అయితే, కంచి కామకోటి పీఠాన్ని ఆది శంకరుడే (ఆది శంకర భగవత్పాద)స్థాపించారని, ఆయనే తొలి పీఠాధిపతి(కీస్తుపూర్వం 482477) అని కంచి పీఠం పేర్కొంది. ఈ పీఠం లెక్క ప్రకారం చూస్తే దాదాపు 2500 సంవత్సరాల చరిత్రలో జయేంద్ర సహా 69 మంది ఇప్పటీ వరకూ కంచి కామకోటి పీఠాధిపతులుగా ఉన్నారు. చెన్నైకి సమీపంలో ఉన్న కారణంగా కంచిపీఠం అత్యధిక హిందువులతోపాటు ఐరోపా దేశాలకు చెందిన పలువురిని ఆకట్టుకుంది.
‘పరమాచార్య’ హయాంలో పెరిగిన జనాదరణ
190794 మధ్య కంచి కామకోటి పీఠాధిపతిగా ఉన్న జగద్దురు చంద్రశేఖరేంద్ర సరస్వతి మిగిలిన అన్ని పీఠాలతో పోల్చితే తన పీఠానికి ఎప్పుడూ లేనంత జనాదరణ సంపాదించిపెట్టారు. ఈ కాలంలో బ్రిటిష్అధికారులు, స్వాతంత్య్ర సమరయోధులు, తర్వాత ప్రధానులు, ముఖ్యమంత్రులు, మంత్రులు సహా వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు కంచి పరమాచార్యను కలిసి ముచ్చటించడం ఆనవాయితీగా ఉండేది.
1947కు ముందు చంద్రశేఖరేంద్రతో ప్రఖ్యాత ఇంగ్లిష్రచయిత, జర్నలిస్ట్పాల్బ్రంటన్సమావేశం పరమాచార్యకు ప్రపంచవ్యాప్తంగా పేరు తెచ్చింది. స్వాతంత్య్ర పోరాట సమయంలో అప్పటి మద్రాసులో అంతర్భాగమైన పాలకాడ్లో పరమాచార్యను మహత్మా గాంధీ కలుసుకున్నారు. కుల వ్యవస్థ, స్త్రీ విద్య, బాల్య వివాహాలు, వితంతువుల హోదా వంటి విషయాల్లో చంద్రశేఖరేంద్ర సంప్రదాయవాది అయినా ఆయనకు ఎనలేని గౌరవం ఉండేది.
జాతీయ నాయకులతోపాటు శాస్త్రవేత్తలు, రచయితలు అన్ని ఖండాల నుంచి వచ్చి ఆయనతో భేటీ అయ్యేవారు. ఆయన హయాంలో కంచి పీఠం పేరు బాగా విస్తరించింది. దేశంలో ఎమర్జెన్సీ విధించి అప్రదిష్ఠపాలైన ప్రధాని ఇందిరాగాంధీ క్రమం తప్పకుండా పరమాచార్యతో సమావేశం కావడం అందరికీ తెలిసిన విషయమే. ఎమర్జెన్సీ కాలంలో కంచి వచ్చిన ఇందిరను పరమాచార్య నిరాకరించడం వల్లే ఆమె ఆత్యయికస్థితిని తొలగించి ఎన్నికలు ప్రకటించారని కూడా కొందరు ప్రముఖులు చెబుతారు.
వివాదాస్పద శంకరాచార్య జయేంద్ర!
చంద్రశేఖరేంద్ర మతతత్వ పార్టీలకు దూరంగా ఉండడమేగాక ఏ ఒక్క రాజకీయపక్షానికి దగ్గరకాలేదు. కాని, 1996 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా అప్పటి ఏఐఏడీఎంకే ప్రధాన కార్యదర్శి జయలలిత తన పార్టీ అభ్యర్థుల జాబితా విడుదలకు ముందు జయేంద్ర సరస్వతి ఆశీర్వాదాల కోసం ఆయనతో భేటీ అయ్యారు. 2004 లోక్సభ ఎన్నికల్లో చెన్నై బీజేపీ ఎన్నికల కార్యాలయాన్ని జయేంద్ర ప్రారంభించారు.
1994లో చంద్రశేఖరేంద్ర కన్నుమూశాక కంచి పీఠం ఇలాంటి పరిణామాలకు అవకాశమిచ్చింది. అప్పటి నుంచి కంచి మఠం కార్యకలాపాలు కొత్త రంగాలకు విస్తరించాయి. రాజకీయాలకు దూరంగా ఉండాలనే సంప్రదాయానికి స్వస్తిపలికారు. ఏఐఏడీఎంకే(జయలలిత) తొలి పాలనాకాలంలో దేవాలయ ఆస్తుల పరిరక్షణ కమిటీ అధిపతిగా జయేంద్ర నియమితులయ్యారు. తిరుమల వెంకటేశ్వర ఆలయంలో జరిగే పూజా విధానంలో ఆయన కొన్ని మార్పులు సూచించి వివాదం సృష్టించారు.
తిరుపతి గుడి వ్యవహారాల్లో కంచి పీఠాధిపతి జోక్యం తగదని త్రిదండి శ్రీమన్నారాయణ చిన జీయర్స్వామి వంటి వైష్టవ పీఠాధిపతులు అభ్యంతరం చెప్పారు. అయితే, 1990ల్లో దేశంలో దళితుల్లో చైతన్యం పెరగడంతో వారిని ‘హిందూ ప్రధాన జీవన స్రవంతి’లోకి తీసుకురావడానికి జయేంద్ర కృషిచేశారు. దళితుల సంక్షేమానికి అనేక కార్యక్రమాలు చేపట్టారు. మొత్తంమీద చంద్రశేఖరేంద్ర సనాతనవాదిగా ఉంటూనే కంచి పీఠానికి ప్రాచుర్యం తీసుకొస్తే, జయేంద్ర వివాస్పద పీఠాధిపతిగా కొన్నాళ్లు కొనసాగి చివరి రోజుల్లో ప్రశాంత జీవనం గడిపారు.
(సాక్షి నాలెడ్జ్ సెంటర్)
Comments
Please login to add a commentAdd a comment