kanchi peetham
-
పరమత సహనానికి ప్రతిరూపం కంచి పీఠం
ఈ శతాబ్ది సమాజం జ్ఞాన సమాజం. ఆ జ్ఞానాన్ని వెలికితీయాలంటే ఉన్నత ప్రమాణాలుగల విద్యాసంస్థలు, పరిశోధన అవసరం. ఆ అవసరాలను దృష్టిలో పెట్టుకొనే కంచి పీఠం వారు భవిష్యత్ ప్రణాళికలను రూపొందిస్తున్నారు. వారి దూరదృష్టిని మనం గమనించాలి. రెండవది.. వివిధ వర్గాల మధ్య సంఘర్షణ కాదు సామరస్యం అవసరమని కంచి పీఠం నిరూపిస్తున్నది. మఠం పక్కనే మసీదు ఉంది. ప్రతీరోజూ సాయంత్రం మసీదు నుండి వినపడే ‘నమాజు’ సమయంలో మఠంలోని సందడిని శాంతింపజేయడం గమనిస్తే పీఠం వారి పరమత సహనాన్ని గుర్తించవచ్చు. ‘‘మానవసేవే మాధవ సేవ’’ అన్న మాటల్ని కంచి పీఠం నిజం చేసింది. ఇటీవల కంచి పీఠం వారి ఆహ్వానం మేరకు అక్కడికి వెళ్ళాను. భారత దేశంలో ఎన్నో ధార్మిక సంస్థలు ఉన్నాయి. ఆయా రంగాలకు పరిమితమై అవి సేవచేస్తున్నాయి. కానీ కంచి పీఠం వారు బహుముఖీయంగా చేస్తున్న సేవను కళ్ళారా చూసిన తర్వాత కదిలిపోయాను. ఒకవైపు ఆధ్యాత్మి కమైన క్షేత్రంగా భాసిల్లుతూనే మరోవైపు సామాజిక సంక్షే మంలో భాగంగా విద్య, వైద్య రంగాల్లో కంచి పీఠం చేస్తున్న సేవ, వారి కృషి వెనకాల ఉన్న సామాజిక çస్పృహ, పేద వర్గాల పట్ల వారి దృక్పథం స్ఫూర్తి దాయకమైనవని అర్థం చేసుకున్నాను. కంచి పీఠం వారి ఆధ్వర్యంలో నడుస్తున్న విద్యా సంస్థలలో సామాజికాభివృద్ధికి, ప్రమాణాల పెంపునకు, భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఏయే చర్యలు తీసుకుంటే బాగుంటుందో సూచించమని చెప్పడానికి నన్ను ఆహ్వానించారు. నేనూ, నాలాంటి భావజాలంతోనే ఉన్న వందేమాతరం ఫౌండేషన్ వ్యవస్థాపకుడు రవీందర్‌తో కలిసి రెండు రోజులపాటు కంచిలో అక్కడి విద్య, వైద్య, సేవా సంస్థలను దర్శించాను. అమెరికాలో స్టాన్‌ఫర్డ్ యూనివర్సిటీని అన్ని రకాలైన వనరులున్న ప్రదేశంలో ఏర్పాటు చేశారు. దాంతో అక్కడి విద్యార్థులు, అక్కడ చుట్టు పక్కల ఉన్న కంపెనీలతో కోర్సులో భాగంగా అనుబంధాన్ని ఏర్పాటు చేసుకొని మంచి ఉపాధి అవకాశాలను పొందారు. విద్యార్థులకు తెలివితేటలు ఉండవచ్చు. కానీ వారి ఆలోచనల్ని, ఆశయాల్ని ఒక నిర్ది ష్టమైన కార్యరూపంలోకి తీసుకొని రావడానికి తగిన పెట్టు బడి అవసరం. ఆర్థికపరంగా సంపన్నమైన అమెరికాలో ఆ పనిని బహుళజాతి కంపెనీలు చేశాయి. వర్ధమాన దేశాలలో ఆ పనిని ప్రజాప్రభుత్వాలు నిర్వహించాలి. ఈ నేపథ్యంలో లాటిన్ అమెరికా దేశాలు తమ విద్యా వ్యవస్థను పటిష్టపరుచుకొని అభివృద్ధిలో ముందుకు దూసు కెళుతున్న పరిణామాల్ని గుర్తించిన కంచి పీఠం 21వ శతా బ్దిలో దేశానికి అవసరమైన విద్యార్థులను నైపుణ్యంగల మానవ వనరులుగా మార్చడానికి తమ సంస్థలలో అమల వుతున్న విద్యా విధానాన్ని భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకొని సమీక్షిస్తున్నది. ఈ శతాబ్ది సమాజం జ్ఞాన సమాజం. ఆ జ్ఞానాన్ని వెలి కితీయాలంటే ఉన్నత ప్రమాణాలుగల విద్యాసంస్థలు, పరిశోధన అవసరం. ఆ అవసరాలను దృష్టిలో పెట్టుకొనే కంచిపీఠం వారు భవిష్యత్ ప్రణాళికలను రూపొందిస్తు న్నారు. వారి దూరదృష్టిని మనం గమనించాలి. రెండవది వివిధ వర్గాల మధ్య సంఘర్షణ కాదు సామరస్యం అవస రమని నిరూపిస్తున్నది. మఠం పక్కనే మసీదు ఉంది. ప్రతీ రోజూ సాయంత్రం మసీదు నుండి వినపడే ‘నమాజు’ ఆ సమయంలో మఠంలోని సందడిని శాంతింపజేయడం గమనిస్తే పీఠం వారి పరమత సహనాన్ని గుర్తించవచ్చు. పరస్పర సహనం, సహకారమే శాంతికి మూల మంత్రం. కంచి పీఠం ఆధ్వర్యంలో ప్రాథమిక పాఠశాల నుంచి విశ్వవిద్యాలయం దాకా విద్యాసంస్థలు కొనసాగుతు న్నాయి. అందులో ఇంజనీరింగు, మెడికల్, ఆయుర్వేదిక్, వైదిక, ఆర్ట్స్, గ్రూపులతో పాటు, శిల్పశాస్త్రానికి సంబంధిం చిన కళాశాల కూడా ఉండటం ఇక్కడి ప్రత్యేకత. అంతేకాదు వైద్యరంగానికి సంబంధించి కంచిలో ఉన్న శంకరనేత్రా లయం ప్రపంచ ప్రసిద్ధి పొందింది. రోజూ వేలాది మంది కంటి పరీక్షలకోసం, ఆపరేషన్ల కోసం వస్తుంటారు. అంతేకాదు దేశంలోని వివిధ ప్రాంతాలలో పీఠం ఆధ్వర్యంలో నెలకొల్పిన ప్రాథమిక వైద్యశాలలు గ్రామీణ ప్రాంతాలలో ప్రజలకు అవసరమైన వైద్య సదుపాయాల్ని అందిస్తుంది. కంచి పీఠం ముఖ్యంగా గర్భవతులైన పేద స్త్రీలకు, అలాగే పసిపిల్లలకు పౌష్టిక ఆహారాన్ని సమకూరు స్తున్నది. ప్రాథమిక విద్యాభ్యాస కాలంలోనే పిల్లలలోని కంటి లోపాల్ని గుర్తించినట్లయితే వారికి సత్వరమే వైద్య సహాయాన్ని అందించవచ్చు. ఆ స్ఫూర్తితో మొదలైన శంకర నేత్ర వైద్యాలయం ఇవాళ మరింత విస్తరించింది. ముఖ్యంగా వృద్ధాప్యంలో అనారోగ్యంతో బాధపడు తున్న మనుషుల పట్ల వారు చూపిస్తున్న శ్రద్ధాసక్తులు మనల్ని ఆశ్చర్యపరుస్తాయి. ‘‘మానవసేవే మాధవ సేవ’’ అన్న మాటల్ని కంచి పీఠం నిజం చేసింది. ఆధ్యాత్మికతకు సామాజిక న్యాయాన్ని జోడించినప్పుడు కొత్త విలువలు గల నవశకం ఆవిష్కారమవుతుంది. గ్రామీణ ప్రాంతాల్లో నెలకొన్న అస్తవ్యస్త పరిస్థితుల వల్ల పట్టణీకరణ పెరిగింది. వలసలు పెరిగాయి. గ్రామాలు స్వయం సమృద్ధంగా లేనప్పుడు అక్కడి నుంచి రాజకీయ పరమైన నాయకత్వం రాదు. విద్య, ఉద్యోగ, ఉపాధి అవ కాశాల కారణంగా వలస వెళ్తున్న తరానికి గ్రామాల్లోని పెద్ద తరానికీ మధ్యన పెద్ద అగాధం ఏర్పడింది. ఒక దశ దాటిన తర్వాత జంతువుల మధ్య అనుబంధాలు కొరవడుతున్న ట్లుగా మన సమాజంలో తల్లిదండ్రులకు పిల్లలకు మధ్య కుటుంబ సంబంధాలు అదృశ్యమవుతున్నాయి. ఈ ధోరణి మన సంస్కృతిని పూర్తిగా ధ్వంసం చేస్తు న్నది. అందుకే మన దేశంలో కల్చర్కూ, అగ్రికల్చర్కూ మధ్య అనుబంధం పెరగాలి. అది పెరిగితేనే అభివృద్ధి సాధ్య మవుతుంది. అదే ఆది భౌతికతకూ, ఆది దైవికానికీ ఉండే సంబంధం. ఏదైనా ఒక సమస్య పరిష్కారానికి సంబంధించి తొందరపడి నిర్ణయం తీసుకోవడం కన్నా లోతుగా ఆలో చించాలి. అప్పుడే ఆ సమస్యకు శాశ్వత పరిష్కారాన్ని ఇవ్వ గలుగుతాం. ఎలాంటి ప్రతిఫలాన్నీ ఆశించకుండా ఎదుటి వారికి చేతనైన సహాయం చేయడం కంటే మించిన మానవ ధర్మం లేదని నిరూపించారు. బాహ్యప్రపంచానికి కేవలం ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా కనిపించే కంచిపీఠంలో వ్యవస్థలా సామాజిక సేవా కార్య క్రమాలు కొనసాగుతున్నాయి. పెరియార్ చంద్రశేఖరేంద్ర స్వాములవారు దేశవ్యాప్తంగా పాదయాత్ర సలిపి భక్తినీ, ధర్మాన్నీ ప్రబోధించడమే కాకుండా తన యాత్ర పర్యటన సందర్భంగా గమనించిన ప్రజల కష్ట సుఖాలను దృష్టిలో పెట్టుకొని, వాటి పరిష్కారానికై విద్య, వైద్య, సేవా సంస్థల్ని నెలకొల్పారు. ఆ స్ఫూర్తినే స్వామి జయేంద్ర సరస్వతి కొన సాగించారు. ఆ మార్గంలోనే ప్రస్తుత పీఠాధిపతులు శ్రీ విజ యేంద్ర సరస్వతి స్వామి వారు నిర్వహిస్తున్నారు. అందుకే కంచి మఠం ఒక సామాజిక సేవాపీఠం అని మనవి చేస్తున్నాను. చుక్కా రామయ్య వ్యాసకర్త ప్రముఖ విద్యావేత్త,శాసనమండలి మాజీ సభ్యులు -
జయేంద్ర సరస్వతి మహాసమాధి
కాంచీపురం నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: శివైక్యం చెందిన కంచి పీఠాధిపతి శ్రీ జయేంద్ర సరస్వతి (82) బృందావన ప్రవేశం (అంత్యక్రియలు) గురువారం ముగిసింది. మఠంలోని బృందావనంలో వేదమంత్రోచ్ఛారణల మధ్య సంప్రదాయపద్ధతిలో ఆయన భౌతికకాయాన్ని మహాసమాధి చేశారు. శిష్యులు, వేదపండితులు, రాజకీయ ప్రముఖుల సమక్షంలో అశ్రునయనాల మధ్య స్వామి ‘బృందావన ప్రవేశ’ (అధిష్టానం అని కూడా అంటారు) కార్యక్రమం ముగిసింది. గురువారం ఉదయం 7.45 గంటలకు ప్రారంభమైన ఈ కార్యక్రమం మూడున్నర గంటలసేపు కొనసాగింది. ఉదయం అభిషేకంతో ప్రారంభమైన అంతిమసంస్కారం హారతితో ముగిసింది. దీంతో దాదాపు నాలుగు దశాబ్దాల పాటు మఠ పీఠాధిపతిగా దేశ, విదేశాల్లో కీర్తించబడిన శ్రీ జయేంద్ర సరస్వతి శంకరాచార్య భౌతిక శరీరం పంచభూతాల్లో కలిసి పోయింది. ఈ కార్యక్రమంలో తమిళనాడు గవర్నర్ భన్వరీలాల్, కేంద్ర మంత్రులు రాధాకృష్ణన్, సదానంద గౌడ సహా పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. అంతిమసంస్కారం జరుగుతున్నంతసేపు కైలయ వాద్యం (శివారాధన సందర్భంగా గుళ్లలో వాయించే తమిళ సంప్రదాయ వాయిద్యం) మోగుతూనే ఉంది. రాత్రంతా మఠంలో ప్రార్థనలు సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు, శిష్యులు, వైరాగ్య పండితులు బుధవారం రాత్రంతా మండపాల్లో స్వామీజీ పార్థివదేహం ముందు ప్రార్థనలు చేశారు. ఉదయం 7 గంటలకు బృందావన ప్రవేశ కార్యక్రమం ప్రారంభమైంది. స్వామీజీ భౌతికకాయాన్ని సమాధి చేసే తంతును మఠం నిర్వాహకులు బృందావన ప్రవేశ కార్యక్రమంగా పేర్కొన్నారు. గురువారం నుంచి మఠం పీఠాధిపతి బాధ్యతలు చేపట్టిన శ్రీ విజయేంద్రసరస్వతి పర్యవేక్షణలో అధిష్టాన పూజాధికాలు ప్రారంభమయ్యాయి. ఉద్విగ్నం.. ఉద్రిక్తం జయేంద్ర సరస్వతిని కడసారి చూసేందుకు మందిర ప్రాంగణంలోకి వచ్చిన వారిని అంతిమసంస్కారం సమయంలో కాసేపు పోలీసులు ఆపివేశారు. అప్పటివరకు ఎల్ఈడీ స్క్రీన్ల ద్వారా మొత్తం కార్యక్రమాన్ని భక్తులకోసం మఠం నిర్వాహకులు అందుబాటులో ఉంచారు. అయితే అలంకరణ సమయంలో కాసేపు ప్రత్యక్షప్రసారాన్ని నిలిపేశారు. దీంతో పోలీసుల వలయాన్ని దాటుకుని లోపలకు వెళ్లేందుకు భక్తులు ప్రయత్నించారు. ఈ సమయంలో అక్కడున్న వాలంటీర్లు కొందరు కిందపడిపోవటంతో పరిస్థితి కాస్త ఉద్రిక్తంగా మారింది. వెంటనే పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. అయితే కాసేపటికే అభిషేకం, అలంకరణ తర్వాత స్వామీజీ భౌతికకాయాన్ని మండపంలోకి తీసుకురావటంతో మళ్లీ భక్తులందరూ చూసేందుకు అవకాశం లభించింది. కడసారి స్వామీజీని చూసిన భక్తుల ఆవేదనతో మండపం, మఠం ప్రాంగణం ఒక్కసారిగా ఉద్వేగంగా మారిపోయింది. జయేంద్ర సరస్వతి శివైక్యంపై నటుడు రజనీకాంత్ ట్వీటర్లో సంతాపం వ్యక్తం చేయగా.. కమల్ çహాసన్ పార్టీ మక్కల్ నీతి మయ్యం కూడా ఒక ప్రకటనలో విచారం వ్యక్తం చేసింది. శంకరాచార్యుని బోధనలతో.. గురువు శంకరాచార్య జయేంద్ర సరస్వతి బోధనలను భక్తులు అలవర్చుకుని.. ఆధ్యాత్మిక జీవితాన్ని గడపాలని కంచిమఠం కొత్త పీఠాధిపతి విజయేంద్ర సరస్వతి ఉపదేశించారు. శివైక్యం పొందిన జయేంద్ర సరస్వతి స్వామీజీకి ప్రజలు, దేశం నాడీ బాగా తెలుసన్నారు. ప్రజల మధ్య వివక్ష చూపకుండా అందరం ఒకటేననే భావనను ఆయన ప్రచారం చేశారన్నారు. బృందావన ప్రవేశం ఇలా స్వామీజీ భౌతిక కాయానికి శాస్త్రబద్ధంగా చందన, పుష్ప, క్షీరాభిషేకాలు జరిపారు. ఆపైన వేదపండితులందరూ కలిసి చంద్రమౌళేశ్వర పూజ నిర్వహించారు. అనంతరం పుష్పాలు, సుగంధ ద్రవ్యాలు, పరిమళాలు వెదజల్లే పూలమాలలతో స్వామీజీని అలంకరించారు. పట్టువస్త్రాలు చుట్టి, అమ్మవారి కుంకుమను దిద్దారు. భక్తులందరూ చూసేందుకు వీలుగా ఎత్తైన బల్లపై భౌతిక కాయాన్ని కూర్చోబెట్టారు. చుట్టూ విజయేంద్ర స్వామీజీ, పండితులు, ముఖ్యమైన శిష్యులు నిలబడి అధిష్టాన కార్యక్రమాన్ని నిర్వహించారు. మఠం ఆచారాల ప్రకారం, సనాతన సంప్రదాయాల ప్రకారం 13 అడుగుల లోతు, 15 అడుగుల పొడవు, 10 అడుగుల వెడల్పుతో గొయ్యి తీశారు. ధ్యానముద్రలో ఉన్న స్వామి పార్థివదేహాన్ని సింహాసనం లాంటి కుర్చీలో కూర్చోబెట్టి గొయ్యిలోకి మెల్లిగా దించారు. ఈ సమాధిలో పూలు, వాసంబు (ఔషధ మొక్క), చందనం చెక్కలతోపాటు పలు సుగంధ ద్రవ్యాలు, ఉప్పు, ఇసుక వంటి వాటితో నింపేశారు. ఆపైన రాహుకాలం ప్రవేశించే 10.30 గంటలకు ముందే అశేష భక్త జనావళి సమక్షంలో స్వామీజీ భౌతిక కాయాన్ని బృందావన ప్రవేశం చేశారు. ఈ ప్రక్రియకు ముందు స్వామీజీకి ప్రియ శిష్యుడిని ఎంపిక చేసి ఆయన చేతుల మీదుగా నారికేళంతో కపాలమోక్షం చేయించారు. కార్యక్రమానికి హాజరైన వందలాది మంది ప్రజలు -
కథ కంచి పీఠానిది...
కంచి కామకోటి పీఠాధిపతుల్లో అత్యంత వివాదాస్పదమైన ఆధ్యాత్మిక గురువుగా జయేంద్ర సరస్వతిని పరిగణిస్తే ఆయనకు ముందు 88వ పీఠాధిపతిగా దాదాపు 87 ఏళ్లు కొనసాగిన చంద్రశేఖరేంద్ర సరస్వతిని అత్యధిక గౌరవ ప్రతిపత్తులున్న ‘పరమాచార్య’గా గౌరవిస్తారు. అసలు కంచి పీఠం హోదాపైనే చాలా కాలం వివాదం సాగింది. హిందూ మత పునరుద్ధరణకు పునాదులు వేసిన ఆది శంకరాచార్య స్థాపించిన నాలుగు పీఠాల్లో కంచి లేదనీ, దీన్ని ఆయనే ఏర్పాటు చేశారనే మాటల్లో నిజం లేదని అనేక మంది వాదిస్తారు. ఎనిమిదో శతాబ్దంలో జీవించిన ధర్మసంస్కర్త శంకరాచార్య అద్వైత వేదాంత ప్రచారానికి తూర్పున పూరీ(ఒడిశా), పశ్చిమాన ద్వారక(గుజరాత్), ఉత్తరాన జ్యోతిర్మఠ్బదరీనాథ్(ఉత్తరాఖండ్), దక్షిణాన శృంగేరి(కర్ణాటక)లో నాలుగు మఠాలు స్థాపించారని, కంచి పీఠం వీటిలో లేదని కొందరు చెబుతారు. అయితే, కంచి కామకోటి పీఠాన్ని ఆది శంకరుడే (ఆది శంకర భగవత్పాద)స్థాపించారని, ఆయనే తొలి పీఠాధిపతి(కీస్తుపూర్వం 482477) అని కంచి పీఠం పేర్కొంది. ఈ పీఠం లెక్క ప్రకారం చూస్తే దాదాపు 2500 సంవత్సరాల చరిత్రలో జయేంద్ర సహా 69 మంది ఇప్పటీ వరకూ కంచి కామకోటి పీఠాధిపతులుగా ఉన్నారు. చెన్నైకి సమీపంలో ఉన్న కారణంగా కంచిపీఠం అత్యధిక హిందువులతోపాటు ఐరోపా దేశాలకు చెందిన పలువురిని ఆకట్టుకుంది. ‘పరమాచార్య’ హయాంలో పెరిగిన జనాదరణ 190794 మధ్య కంచి కామకోటి పీఠాధిపతిగా ఉన్న జగద్దురు చంద్రశేఖరేంద్ర సరస్వతి మిగిలిన అన్ని పీఠాలతో పోల్చితే తన పీఠానికి ఎప్పుడూ లేనంత జనాదరణ సంపాదించిపెట్టారు. ఈ కాలంలో బ్రిటిష్అధికారులు, స్వాతంత్య్ర సమరయోధులు, తర్వాత ప్రధానులు, ముఖ్యమంత్రులు, మంత్రులు సహా వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు కంచి పరమాచార్యను కలిసి ముచ్చటించడం ఆనవాయితీగా ఉండేది. 1947కు ముందు చంద్రశేఖరేంద్రతో ప్రఖ్యాత ఇంగ్లిష్రచయిత, జర్నలిస్ట్పాల్బ్రంటన్సమావేశం పరమాచార్యకు ప్రపంచవ్యాప్తంగా పేరు తెచ్చింది. స్వాతంత్య్ర పోరాట సమయంలో అప్పటి మద్రాసులో అంతర్భాగమైన పాలకాడ్లో పరమాచార్యను మహత్మా గాంధీ కలుసుకున్నారు. కుల వ్యవస్థ, స్త్రీ విద్య, బాల్య వివాహాలు, వితంతువుల హోదా వంటి విషయాల్లో చంద్రశేఖరేంద్ర సంప్రదాయవాది అయినా ఆయనకు ఎనలేని గౌరవం ఉండేది. జాతీయ నాయకులతోపాటు శాస్త్రవేత్తలు, రచయితలు అన్ని ఖండాల నుంచి వచ్చి ఆయనతో భేటీ అయ్యేవారు. ఆయన హయాంలో కంచి పీఠం పేరు బాగా విస్తరించింది. దేశంలో ఎమర్జెన్సీ విధించి అప్రదిష్ఠపాలైన ప్రధాని ఇందిరాగాంధీ క్రమం తప్పకుండా పరమాచార్యతో సమావేశం కావడం అందరికీ తెలిసిన విషయమే. ఎమర్జెన్సీ కాలంలో కంచి వచ్చిన ఇందిరను పరమాచార్య నిరాకరించడం వల్లే ఆమె ఆత్యయికస్థితిని తొలగించి ఎన్నికలు ప్రకటించారని కూడా కొందరు ప్రముఖులు చెబుతారు. వివాదాస్పద శంకరాచార్య జయేంద్ర! చంద్రశేఖరేంద్ర మతతత్వ పార్టీలకు దూరంగా ఉండడమేగాక ఏ ఒక్క రాజకీయపక్షానికి దగ్గరకాలేదు. కాని, 1996 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా అప్పటి ఏఐఏడీఎంకే ప్రధాన కార్యదర్శి జయలలిత తన పార్టీ అభ్యర్థుల జాబితా విడుదలకు ముందు జయేంద్ర సరస్వతి ఆశీర్వాదాల కోసం ఆయనతో భేటీ అయ్యారు. 2004 లోక్‌సభ ఎన్నికల్లో చెన్నై బీజేపీ ఎన్నికల కార్యాలయాన్ని జయేంద్ర ప్రారంభించారు. 1994లో చంద్రశేఖరేంద్ర కన్నుమూశాక కంచి పీఠం ఇలాంటి పరిణామాలకు అవకాశమిచ్చింది. అప్పటి నుంచి కంచి మఠం కార్యకలాపాలు కొత్త రంగాలకు విస్తరించాయి. రాజకీయాలకు దూరంగా ఉండాలనే సంప్రదాయానికి స్వస్తిపలికారు. ఏఐఏడీఎంకే(జయలలిత) తొలి పాలనాకాలంలో దేవాలయ ఆస్తుల పరిరక్షణ కమిటీ అధిపతిగా జయేంద్ర నియమితులయ్యారు. తిరుమల వెంకటేశ్వర ఆలయంలో జరిగే పూజా విధానంలో ఆయన కొన్ని మార్పులు సూచించి వివాదం సృష్టించారు. తిరుపతి గుడి వ్యవహారాల్లో కంచి పీఠాధిపతి జోక్యం తగదని త్రిదండి శ్రీమన్నారాయణ చిన జీయర్‌స్వామి వంటి వైష్టవ పీఠాధిపతులు అభ్యంతరం చెప్పారు. అయితే, 1990ల్లో దేశంలో దళితుల్లో చైతన్యం పెరగడంతో వారిని ‘హిందూ ప్రధాన జీవన స్రవంతి’లోకి తీసుకురావడానికి జయేంద్ర కృషిచేశారు. దళితుల సంక్షేమానికి అనేక కార్యక్రమాలు చేపట్టారు. మొత్తంమీద చంద్రశేఖరేంద్ర సనాతనవాదిగా ఉంటూనే కంచి పీఠానికి ప్రాచుర్యం తీసుకొస్తే, జయేంద్ర వివాస్పద పీఠాధిపతిగా కొన్నాళ్లు కొనసాగి చివరి రోజుల్లో ప్రశాంత జీవనం గడిపారు. (సాక్షి నాలెడ్జ్ సెంటర్) -
మోపిదేవిలో జయేంద్ర సరస్వతి
మోపిదేవి: ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన మోపిదేవి శ్రీసుబ్రహ్మణ్యేశ్వరస్వామివారిని శ్రీ కంచికామకోటి పీఠాధిపతి జగద్గురు జయేంద్ర సరస్వతి, విజయేంద్ర సరస్వతి సోమవారం దర్శించుకున్నారు. శాసనసభ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ దంపతులు, ఆలయ ఏసీ ఎం.శారదాకుమారి స్వాగతించగా ఆలయ ప్రధానార్చకులు బుద్దు పవన్‌కుమార్‌శర్మ పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. స్వామివారిని దర్శించుకున్న అనంతరం ఆలయ ప్రాంగణంలో భక్తులకు అనుగ్రహ భాషణచేసి, ఆశీర్వాదం అందచేశారు. అనంతరం దేవస్థానం తరపున ఆలయ ఏసీ స్వామివారి చిత్రపటం బహూకరించారు. టేకుపల్లిలో జయేంద్రసరస్వతి మండలంలోని టేకుపల్లిలో ఉన్న శ్రీ కంచికామకోటి పీఠపాలిత బాల పార్వతీ సమేత రామేశ్వరస్వామివారిని కంచికామకోటి పీఠాధిపతి జగద్గురు జయేంద్రసరస్వతి సోమవారం సాయంత్రం దర్శించుకున్నారు. ఆయన వెంట శిష్యుబృందం, ఆలయ ఘనాపాటి నౌడూరి సుబ్రహ్మణ్యశర్మ, ఆలయ అర్చకులు ఫణికుమార్‌శర్మ, వెంకటేశ్వరరావు, బాలకృష్ణశర్మ, టేకుపల్లి దేవస్థానం మేనేజింగ్ ట్రస్టీ యడవల్లి నీలిలోహిత శర్మ, వెంపటి కుటుంబశాస్త్రి, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. స్వామిని దర్శించుకున్న భువనచంద్ర స్వామివారిని సినీగేయ రచయిత భువన చంద్ర సోమవారం సాయంత్రం దర్శించుకున్నారు. ఆలయ ప్రధానార్చకులు బుద్దు పవన్‌కుమార్‌శర్మ ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. ఆలయ ప్రదక్షిణ చేసిన ఆయన స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ ఏసీ ఎం శారదాకుమారి స్వామివారి ప్రసాదం, చిత్రపటం అందచేశారు. ఆయన వెంట విద్యాసంస్థల అధినేత కె.ఈశ్వరరావు, గుడిశేవ విష్ణుప్రసాద్ ఉన్నారు. -
జయేంద్ర సరస్వతికి మళ్లీ అస్వస్థత
విజయవాడ : కంచి కామకోటి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి మళ్లీ అస్వస్థతకు గురయ్యారు. విజయవాడలో బుధవారం ఉదయం నిర్వహించిన చాతుర్మాస దీక్ష సమయంలో ఆయన శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఏర్పడింది. దీంతో ఆయన్ను హుటాహుటిన ఆంధ్రా ఆస్పత్రికి తరలించారు. డాక్టర్ టి.రవీంద్రనాథ్ నేతృత్వంలో ఆయనకు ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. ఊపిరితిత్తుల్లో నెమ్ము చేరి నిమోనియాగా మారిందన్నారు. ప్రస్తుతం జయేంద్ర సరస్వతి బాగానే ఉన్నారని, శ్వాస తీసుకోవడంలో మరింత ఇబ్బంది తలెత్తితే వెంటిలేటర్‌పై ఉంచాల్సివస్తుందని వైద్యులు తెలిపారు. జయేంద్ర సరస్వతి ఆరోగ్య పరిస్థితి, చికిత్స వివరాలను చెన్నైలో ఉన్న ఆయన వ్యక్తిగత వైద్యులకు విజయవాడ వైద్యులు ఎప్పటికప్పుడు వివరిస్తున్నారు. కాగా స్వామీజీ మళ్లీ అనారోగ్యానికి గురయ్యారని తెలియడంతో భక్తులు పెద్ద సంఖ్యలో ఆస్పత్రి వద్దకు చేరుకున్నారు. వారం రోజుల కిందట తీవ్ర అస్వస్థతకు గురైన స్వామి మూడు రోజుల పాటు ఆంధ్రా ఆస్పత్రిలో చికిత్స పొందిన విషయం తెలిసిందే. -
ఆస్పత్రి నుంచి జయేంద్ర సరస్వతి డిశ్చార్జి
విజయవాడ: అనారోగ్యంతో బాధపడుతూ ఆస్పత్రిలో చేరిన కంచి కామకోటి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి ఆరోగ్యం కుదుట పడింది. మూడు రోజుల క్రితం శ్వాస సంబంధిత సమస్యతో ఆస్పత్రిలో చేరిన ఆయన ఆరోగ్యం మెరుగుపడటంతో గురువారం ఉదయం ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. స్వామి ఆరోగ్య పరిస్థితి కుదుట పడడంతో ఆయన భక్తులు, అనుయాయులు సంతోషం వ్యక్తం చేశారు. -
జయేంద్ర సరస్వతికి అస్వస్థత.
-
జయేంద్ర సరస్వతికి అస్వస్థత
కంచి కామకోటి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి (82) అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం ఆయన విజయవాడలోని ఆంధ్రా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కంచి కామకోటి పీఠానికి 69వ పీఠాధిపతి అయిన జయేంద్ర సరస్వతి హైబీపీతో బాధపడుతూ, స్పృహలేని పరిస్థితిలో ఉండగా ఆయన భక్తులు, అనుయాయులు ఆయనను ఆస్పత్రికి తీసుకొచ్చారు. స్వామి ప్రస్తుతం స్పృహలోనే ఉన్నారని, ఆయనకు బ్లడ్ షుగర్, సోడియం లెవెల్స్ తక్కువగా ఉన్నాయని స్వామికి చికిత్స అందిస్తున్న డాక్టర్ రవిరాజు తెలిపారు. సాయంత్రం వరకు ఆయనను ఐసీయూలో ఉంచి చికిత్స చేయాల్సి ఉంటుందని వివరించారు. ఆస్పత్రికి తీసుకువచ్చిన వెంటనే స్వామిని వెంటిలేటర్ మీద ఉంచి చికిత్స ప్రారంభించారు. ఆయనకు సీటీ స్కాన్ తీయగా అంతా సాధారణంగానే ఉందని, వచ్చినప్పటి కంటే ఇప్పటికి పరిస్థితి కొంచెం మెరుగుపడిందని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. స్వామి ఆరోగ్య పరిస్థితి తెలియగానే పెద్ద సంఖ్యలో భక్తులు ఆంధ్రా ఆస్పత్రి వద్దకు చేరుకున్నారు. ఆయన ఆరోగ్యం కుదుటపడాలని ప్రార్థనలు చేస్తున్నారు. గత సంవత్సరం జరిగిన గోదావరి పుష్కరాలకు కూడా జయేంద్ర సరస్వతి హాజరయ్యారు. రాజమహేంద్రవరంలో 2015 జూలై 14వ తేదీన పుణ్యస్నానం చేసి, ఉదయం 6.26గంటలకు గోదావరి పుష్కరాలను ప్రారంభించారు. రెండేళ్ల క్రితం కూడా ఒకసారి స్వామి అస్వస్థతకు గురయ్యారు. అప్పట్లో నెల్లూరు జిల్లాలో విగ్రహ ప్రతిష్ఠ కోసం వచ్చిన ఆయనకు షుగర్ లెవెల్స్ తగ్గడంతో అక్కడి జయభారత్ ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందించారు.