జయేంద్ర సరస్వతికి మళ్లీ అస్వస్థత
విజయవాడ : కంచి కామకోటి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి మళ్లీ అస్వస్థతకు గురయ్యారు. విజయవాడలో బుధవారం ఉదయం నిర్వహించిన చాతుర్మాస దీక్ష సమయంలో ఆయన శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఏర్పడింది. దీంతో ఆయన్ను హుటాహుటిన ఆంధ్రా ఆస్పత్రికి తరలించారు.
డాక్టర్ టి.రవీంద్రనాథ్ నేతృత్వంలో ఆయనకు ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. ఊపిరితిత్తుల్లో నెమ్ము చేరి నిమోనియాగా మారిందన్నారు. ప్రస్తుతం జయేంద్ర సరస్వతి బాగానే ఉన్నారని, శ్వాస తీసుకోవడంలో మరింత ఇబ్బంది తలెత్తితే వెంటిలేటర్‌పై ఉంచాల్సివస్తుందని వైద్యులు తెలిపారు. జయేంద్ర సరస్వతి ఆరోగ్య పరిస్థితి, చికిత్స వివరాలను చెన్నైలో ఉన్న ఆయన వ్యక్తిగత వైద్యులకు విజయవాడ వైద్యులు ఎప్పటికప్పుడు వివరిస్తున్నారు.
కాగా స్వామీజీ మళ్లీ అనారోగ్యానికి గురయ్యారని తెలియడంతో భక్తులు పెద్ద సంఖ్యలో ఆస్పత్రి వద్దకు చేరుకున్నారు. వారం రోజుల కిందట తీవ్ర అస్వస్థతకు గురైన స్వామి మూడు రోజుల పాటు ఆంధ్రా ఆస్పత్రిలో చికిత్స పొందిన విషయం తెలిసిందే.