తలకెక్కని ‘వేదాంత’ సారం | Facts Behind Sterlite Protest Issue | Sakshi
Sakshi News home page

తలకెక్కని ‘వేదాంత’ సారం

Published Wed, May 30 2018 1:03 AM | Last Updated on Wed, May 30 2018 1:03 AM

Facts Behind Sterlite Protest Issue - Sakshi

స్టెరిలైట్‌ కాపర్‌ వెదజల్లే కాలుష్యానికి వ్యతిరేకంగా ఈ సంవత్సరమే అక్కడ ఉద్యమం ప్రారంభం కాలేదు. ఇది మరొక యూనియన్‌ కార్బయిడ్‌ విషభూతం, ఇది మా పెరట్లోనే ఉందని చెబుతూ గడచిన ఇరవై ఏళ్ల నుంచి కూడా స్థానికులు ఆందోళన చేస్తూనే ఉన్నారు. నిజానికి ఈ కర్మాగారాన్ని మొదట మహారాష్ట్ర, గోవా ప్రాంతాలలో నెలకొల్పాలని అనుకున్నారు. కానీ స్థానికులు, పర్యావరణ ఉద్యమకారులు తిరగబడడంతో, అంతిమంగా తమిళనాడుకు తరలించారు. 1994–96 మధ్య నాటి జయలలిత ప్రభుత్వం ఈ కర్మాగారాన్ని నెలకొల్పడానికి ఎందుకు అనుమతించిందో ఎవరికీ అంతుపట్టదు.

సాధారణ దుస్తులలో ఉన్న ఇద్దరు పోలీసులు గురి చూసి పెట్టిన అసాల్ట్‌ రైఫిళ్లతో ఒక పోలీసు వాహనం మీద కనిపించిన దృశ్యమే ట్యుటికోరన్‌ మరణాల సంగతేమిటో నిర్వచిస్తుంది. ఆ పోలీసుల గురి స్టెరిలైట్‌ కాపర్‌ వ్యతిరేక ఆందోళనకారులే. తూటాలు తమను తాకుతాయని వారెవరికీ తెలియదు. కాలుష్యాన్ని వెదజల్లుతున్న ఆ కర్మాగారానికి వ్యతిరేకంగా వారు జరుపుతున్న నిరసన కార్యక్రమం వందోరోజుకు చేరిన సందర్భంగా ఆ జనం ట్యుటికోరన్‌ కలెక్టర్‌ కార్యాలయం వద్దకు చేరారు. అప్పుడే కాల్పులు జరిగాయి. అయితే ఒక విషయం వినాలి. మే 22వ తేదీ రాత్రి ఏఎన్‌ఐ వార్తా సంస్థ విడుదల చేసిన ఆడియోలోని మాటలవి. అందులో ఉన్న మరొక గొంతు, బహుశా మరొక పోలీసు గొంతు కావచ్చు. అదే ఈ మొత్తం ఘట్టాన్ని ఒళ్లు గగుర్పొడిచేటట్టు చేసింది. ఈ హత్యలు ఒక ప్రణాళిక ప్రకారం జరిగినవని కూడా ఆ మాటల వల్ల రూఢి అవుతున్నది. ‘కనీసం ఒకడైనా చావాలి...’ అంటూ ఇచ్చిన సూచన అందులో వినపడుతుంది. ఇలాంటి పైశాచిక వాంఛ తమిళభాషలో ఒక కమాండో నోటి నుంచి వెలువడింది. ఆ ఆయుధం భగ్గుమంది. ఒక్కవారం లోపుననే ట్యుటికోరన్‌ ఆందోళనలలో 13 మంది చనిపోయారు. మృతుల శరీరాల మీద పొత్తికడుపు పై భాగంలోనే తూటాలు చేసిన గాయాలు కనిపించాయి.

ట్యుటికోరన్‌లోనే మరొకచోట, మరొక వీడియో కూడా వెలుగుచూసింది. ఇందులో దయాదాక్షిణ్యాలు లేని ప్రభుత్వ వైఖరి కళ్లకు కడుతోంది. తుపాకీ తూటా తగిలి ప్రాణాలు కోల్పోయిన 22 ఏళ్ల ఒక యువకుడు రోడ్డు మీద పడిపోయాడు. ఒక పోలీసు తన లాఠీతో ఆ శవాన్ని కదుపుతూ అన్నాడు, ‘‘నాటకాలు చాలు, ఇక్కడ నుంచి పో!’’

ఇలాంటి పైశాచికత్వాన్ని ‘సామూహిక హత్యాకాండ’, రాజ్యహింస’ వంటి మాటలతో కాకుండా మరే ఇతర మాటలతో వర్ణించగలం? ఈ రెండు పదబంధాలను ఇప్పటికే ప్రతిపక్షాలు ఉపయోగించాయి కూడా. తన ప్రజల మీదే ప్రభుత్వం తుపాకులు ఎక్కుపెట్టిన చోటు అది. స్త్రీలు పురుషులు పక్షుల్లా రాలిపోవడం మొదలైన చోట ప్రభుత్వాలు నిందారోపణల రాజకీయం ఆరంభించిన సందర్భమది. గడచిన వారం ట్వీటర్లు దీనిని ‘టీఎన్‌ జలియన్‌ వాలాబాగ్‌’అని పేర్కొన్నారు. 99 సంవత్సరాల క్రితం జరిగిన ఆ ఘోర రక్తకాండ మాటలకందని విషాదం. అది కూడా (ఆనాటి) ప్రభుత్వ వైఖరిని చాటుతుంది. 

ట్యుటికోరన్‌ ఆందోళన హింసాత్మకమైన మాట నిజమే. అయితే అది హింసాత్మకమవుతుందన్న సూచనలు ముందే అందాయి. ఇంకా చెప్పాలంటే కాల్పుల ఘటనకు ముందు 99 రోజుల పాటు శాంతియుతంగానే జరిగిన ఆందోళన తమిళనాడు అధికార కేంద్రం సెయింట్‌ జార్జి కోటలో ఒక్క ఆకును కూడా కదపలేకపోయింది. అందుకే పతాక సన్నివేశంలో ప్రజల ఆవేశం కట్టలు తెంచుకుంది. ఈ ఉత్పాతం గురించి మొదటే గుర్తించినవారిలో మద్రాస్‌ హైకోర్టు మదురై బెంచ్‌ న్యాయమూర్తి జస్టిస్‌ ఎంఎస్‌ రమేశ్‌ కూడా ఒకరు. వేదాంత గ్రూప్‌ దాఖలు చేసిన పిటిషన్‌ విచారణకు వచ్చినప్పుడు జస్టిస్‌ రమేశ్‌ మే 22వ తేదీన 144వ సెక్షన్‌ విధించి నిషేధాజ్ఞలు అమలు చేయవలసిందిగా పరిపాలనా యంత్రాంగాన్ని ఆదేశించారు.

ఆందోళనకారులు ఆరోజే ఊరేగింపు నిర్వహించారు. ప్రజలంతా ఈ ఆందోళనలో పాల్గొనవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ ప్రజలందరికీ పంచిన కరపత్రాలను కూడా ఆయన పరిశీలించారు. ‘‘ఆందోళనకారులు శాంతియుతంగా ఉద్యమించే ఆలోచనలో లేరని అందులోని మాట లను బట్టి తెలుస్తున్నది’’ అని కోర్టు తన ఆదేశాలలో పేర్కొన్నది కూడా. ఆందోళన శాంతిభద్రతల సమస్యకు దారి తీయవచ్చునని, అందుకే 144 సెక్షన్‌  విధించాలని ప్రజా ప్రయోజనాల దృష్ట్యా సూచించి నట్టు కూడా న్యాయస్థానం పేర్కొన్నది. జిల్లా యంత్రాంగానికి గూఢచారి నివేదికలు కూడా పోలీ సుల ద్వారా అందినట్టు సమాచారం ఉంది. ట్యుటికోరన్‌ కలెక్టర్‌ కార్యాలయం మీద విధ్వంసక దాడి జరగవచ్చునని ఆ సమాచారంలో తెలియచేశారు. అతి వాదశక్తులు స్టెరిలైట్‌ వ్యతిరేకోద్యమంలో చొరబడ్డాయని కూడా నిఘా వ్యవస్థల సమాచారం తెలిపింది. అయినప్పటికీ 20,000 మంది ఆందోళనకారులను అదుపు చేయడానికి కొన్ని వందల మంది పోలీసులను మాత్రమే నియోగించారు. 

ఆందోళనకారుల ధోరణి కూడా దురదృష్టకరం. అల్లరిమూకలు దాదాపు 30 ద్విచక్ర వాహనాలను దగ్ధం చేశాయి. కొన్ని కార్లను ధ్వంసం చేశాయి. ప్రభుత్వ కార్యాలయాలను కూడా ధ్వంసం చేసి, కిటికీల అద్దాలను పగులకొట్టాయి. అంతిమంగా కలెక్టర్‌ కార్యాలయంలోని దస్త్రాలకు అల్లరిమూకలు నిప్పు పెట్టడం ఆరంభించగానే పోలీసులు కాల్పులు జరి పారు. బాష్పవాయువు, వాటర్‌ కేనన్‌లను ఉపయోగించినా ఫలితం లేకపోయింది. అల్లరిమూకలను అదుపు చేయడానికీ, చెదరగొట్టడానికీ రబ్బర్‌ బులెట్లు ఎందుకు ఉపయోగించలేదో స్పష్టంగా తెలి యడం లేదు. చాలా టీవీ ఫుటేజ్‌లలో నమోదైనట్టు ట్యుటికోరన్‌ పోలీసులు తమ వద్ద ఉన్న అసాల్ట్‌ తుపాకులను కాల్చారు. అయితే ఇదంతా ప్రజలు ఉన్మాద స్థితికి చేరడం వల్లనే జరిగిందా? అన్ని ప్రభుత్వాల మాదిరిగానే తమిళనాడు ప్రభుత్వం కూడా ఉద్యమాన్ని సంఘ వ్యతిరేకశక్తులు చేతిలోకి తీసుకున్నాయని చెప్పింది. కానీ చూడబోతే తమిళనాడు ప్రభుత్వం ఈ పరిస్థితికి వచ్చే వరకు వేచి ఉన్నదనే అనిపిస్తున్నది. ఇలాంటి పరిస్థితి వస్తే అదుపు చేయడానికి తమ వద్ద ఆయుధాల ఉన్నాయన్న ధైర్యం సర్కారుకు ఉందని అనిపిస్తుంది. దీనితో పాటు చావులను చూడాలన్న కోరిక కూడా వారి పెదవుల మీద పలికింది– కనీసం ఒకరైనా చావాలి!

స్టెరిలైట్‌ కాపర్‌ వెదజల్లే కాలుష్యానికి వ్యతిరేకంగా ఈ సంవత్సరమే అక్కడ ఉద్యమం ప్రారంభం కాలేదు. ఇది మరొక యూనియన్‌ కార్బయిడ్‌ విషభూతం, ఇది మా పెరట్లోనే ఉందని చెబుతూ గడచిన ఇరవై ఏళ్ల నుంచి కూడా స్థానికులు ఆందోళన చేస్తూనే ఉన్నారు. నిజానికి ఈ కర్మాగారాన్ని మొదట మహారాష్ట్ర, గోవా ప్రాంతాలలో నెలకొల్పాలని అనుకున్నారు. కానీ స్థానికులు, పర్యావరణ ఉద్యమకారులు తిరగబడడంతో, అంతిమంగా తమిళనాడుకు తరలించారు. 1994–96 మధ్య నాటి జయలలిత ప్రభుత్వం ఈ కర్మాగారాన్ని నెలకొల్పడానికి ఎందుకు అనుమతించిందో ఎవరికీ అంతుపట్టదు. ఈ కర్మాగారం కారణంగా ఊపిరి తీసుకోవడం సమస్యగా మారిందనీ కళ్లు మండుతున్నాయనీ చర్మరోగాలు సోకుతున్నాయనీ క్యాన్సర్‌ బారిన పడడం పెరిగిందనీ ఆరోపిస్తూ చుట్టుపక్కల పది గ్రామాల వారు ఆక్రోశిస్తూ ఉంటారు. రాగిని పరిశుభ్రం చేయడం వల్ల వెలువడే పదార్థాలతో అక్కడి నీరు కలుషితమైందనీ రాగి నుంచి వచ్చిన వ్యర్ధాన్ని పడవేయడం వల్ల అక్కడి నదిలో ప్రవాహానికి ఆటంకంగా మారిందనీ వారి ఆరోపణ. ట్యుటికోరన్‌ కర్మాగారం సమస్యను రాష్ట్ర ప్రభుత్వాలు, పర్యావరణ అధికారులు కూడా మొదట పెద్దగా పట్టించుకోలేదు. అయితే తమిళనాడు కాలుష్య నివారణ బోర్డు విషవాయువు విడుదలైందన్న ఆరోపణతో 2013 మార్చిలో ఈ కర్మాగారాన్ని మూసివేయాలని ఆదేశించింది. కానీ జాతీయ గ్రీన్‌ ట్రిబ్యునల్‌ మూడు మాసాల తరువాత తిరిగి తెరవడానికి ఆమోదం తెలిపింది.

ఈ సంవత్సరం మార్చిలో కూడా తమిళనాడు కాలుష్య నివారణ బోర్డు కార్యకలాపాల నిర్వహణ అనుమతి పత్రం ఇవ్వడానికి నిరాకరించింది. దీనితో మరోసారి ఈ సంస్థ తాత్కాలికంగా మూతపడింది. కానీ స్థాని కులు ఈ కర్మాగారం శాశ్వతంగా మూత పడాలని కోరారు. ఇంతలోనే జరగవలసిన నష్టం జరిగింది. ఎట్టకేలకు తమిళనాడు ప్రభుత్వం ఈ కర్మాగారాన్ని శాశ్వతంగా మూసివేయాలని ఈ నెల 28న ఆదేశించింది. ఈ కర్మాగారం విస్తరణకు ఉద్దేశించిన భూకేటాయింపును కూడా రద్దు చేసింది. కానీ ఈ మూసివేత ఆదేశాలు ఇప్పుడే ఎందుకు; ఇంత ఆలస్యంగా ఎందుకు? ఇవే అసలు ప్రశ్నలు. సమస్యలకు ప్రజలే పరిష్కారం చూసుకోవాలని అన్నాడీఎంకే ప్రభుత్వం ఉద్దేశం కాబోలు. కాలుష్య నివారణ బోర్డు ఆదేశాలను రాష్ట్ర ప్రభుత్వం సకాలంలో అమలు చేసి ఉండవలసింది. ఆ కర్మాగారం మూసివేతకు మే 28 కాకుండా, ఒక్క రెండు వారాల ముందు నిర్ణయం తీసుకోవడానికి అడ్డు పెట్టినవారెవరు? అప్పుడు ఆ నిర్ణయం అమలు జరిగి ఉంటే ఆ కర్మాగారం మూసివేత కోసం 13 మంది ప్రాణాలు గాలిలో కలసి ఉండేవి కావు. స్వచ్ఛమైన గాలి, నీరు, భూమి కావాలంటూ ప్రజలు గాంధీ మార్గంలో ఆందోళన చేసినంత సేపు ప్రభుత్వాలు కదలవు. వారు ఆగ్రహించి ప్రతాపాన్ని చూపిస్తే డెత్‌ వారెంట్‌తో స్పందిస్తాయి. ఇది భారతదేశంలో పరిపాలన తీరు. కానీ ఇది సరి పోతుందా? కాకపోవచ్చు. ఏకపక్షంగా కర్మాగారాన్ని మూసివేయడం గురించి వేదాంత గ్రూప్‌ యాజమాన్యం కోర్టును ఆశ్రయిస్తే ప్రభుత్వాల నిర్ణయం వాదనకు నిలబడదు. కానీ క్షేత్రస్థాయిలో అదే ప్రాంతంలో మరోసారి కర్మాగారాన్ని ప్రారంభించడం మాత్రం వేదాంత గ్రూపునకు అసాధ్యం.

నిజానికి దేశంలో ఉత్పత్తి అయ్యే రాగిలో 40 శాతం ట్యుటికోరన్‌ కర్మాగారం ద్వారానే జరుగుతుంది. దాదాపు 800 మంది ఉద్యోగాలు కోల్పోతారు. ట్యుటికోరన్‌ కర్మాగారం ఏటా నాలుగు లక్షల మెట్రిక్‌ టన్నుల రాగిని తయారు చేస్తుంది. దేశంలో రాగి అవసరాల కోసం మరో రూ. 2,500 కోట్ల ఖర్చుతో మరో నాలుగు లక్షల మెట్రిక్‌ టన్నుల ఉత్పత్తికి కూడా ఆ సంస్థ విస్తరణ పథకాలు సిద్ధం చేసింది. దీనితో 2000 మందికి ఉద్యోగావకాశాలు వస్తాయని స్థానికులకు సంస్థ చెప్పింది. కర్మాగారం మూసివేతతో ఈ మేరకు ఆర్థిక పరమైన మూల్యం తప్పదు. కానీ ఈ కర్మాగారం నెమ్మదిగా ప్రజల ప్రాణాలను హరిస్తుంది. అలాగే పర్యావరణానికి కూడా ముప్పు. 


టీఎస్‌ సుధీర్‌, వ్యాసకర్త సీనియర్‌ జర్నలిస్టు, ఈ–మెయిల్‌ : tssmedia10@gmail.com
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement