మాంద్యానికి ‘మౌలిక’మే విరుగుడు | Financial Crisis In India Ummareddy Venkateswarlu | Sakshi
Sakshi News home page

మాంద్యానికి ‘మౌలిక’మే విరుగుడు

Published Thu, Oct 10 2019 1:19 AM | Last Updated on Thu, Oct 10 2019 1:19 AM

Financial Crisis In India Ummareddy Venkateswarlu - Sakshi

దేశ ఆర్థిక రథం పరుగు మందగించి చాలా కాలం అయింది. ప్రపంచంలో 4వ అతిపెద్దదైన భారత్‌ ఆటోమొబైల్‌ రంగం చతికిల పడింది. వ్యవసాయం, రియల్‌ ఎస్టేట్, బ్యాంకింగ్, మౌలిక సదు పాయాలు, బొగ్గు, సహజవాయువు, ముడిచమురు ఇలా ఆర్థిక రంగానికి వెన్నెముకలా నిలిచే ఎనిమిది కీలక రంగాల్లో వృద్ధిరేటు ఆనూహ్యంగా 2.1%కి పడిపోయింది. మరికొన్ని రంగాల్లో నెగటివ్‌ వృద్ధిరేటు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. నిజానికి, భారత ఆర్థిక వ్యవస్థను ఆదుకొనేది దేశీయ వినియోగమే. కానీ,ప్రజలలో నెలకొన్న భయాందోళనలను పాలకులు తొలగించే ప్రయత్నం చేయకపోవడం వల్ల అధిక నష్టం వాటిల్లే ప్రమాదం ఆర్థిక రంగానికి పొంచి ఉంది. ప్రభుత్వ బ్యాంకులను విలీనం చేసే ప్రక్రియలతో ఆర్థిక మాంద్యాన్ని ఎదుర్కోవడం సాధ్యంకాదు. మొత్తంగా చూస్తే భారత ఆర్థిక రంగంలో నెలకొన్న ఈ సంక్షోభం తాత్కాలికమా? సుదీర్ఘ కాలమా? అనే అంశం కీలకంగా మారింది. సంక్షోభం తాత్కాలికమైతే తీసుకొనే చర్యలు ఒకలా ఉంటాయి. సుదీర్ఘకాలం కొనసాగే సూచనలు ఉంటే.. కఠోర నిర్ణయాలు తప్పవు.

1991లో, 2008లో ఆర్థిక సంక్షోభాలు అనేక సవాళ్లు విసిరాయి. 1991లో ఏర్పడిన ఆర్థిక సంక్షోభం మన దేశానికే పరిమితమైంది. అప్పటికి భారత ఆర్థిక వ్యవస్థ ప్రపంచ ఆర్థ్ధిక వ్యవస్థలతో అనుసంధానం కాలేదు. దాంతో, దశాబ్దాలపాటు భారత ఆర్థిక వ్యవస్థ స్వేచ్ఛగా విస్తరించకుండా పట్టి ఉంచిన ఆంక్షల సంకెళ్లను, తెంచుకోవడం వల్ల క్రమంగా సత్ఫలితాలు అంది వచ్చాయి. తొలి దశ ఆర్థిక సంస్కరణలతోపాటు వివిధ రాష్ట్రాలు 2000 సంవత్సరం తర్వాత మలి దశ సంస్కరణలను చేపట్టి అన్ని రంగాల్లో ప్రైవేటు పెట్టుబడులను ఆహ్వానించడం మొదలు పెట్టాయి. ప్రపంచ బ్యాంక్, ఐఎంఎఫ్, ఏడీబీ వంటి సంస్థలు, బ్యాంకులు పెద్ద ఎత్తున రుణవితరణ చేశాయి. ఆ నిధులతోనే దేశ వ్యాప్తంగా మౌలిక సదుపాయాల రంగాన్ని విస్తరించడం సాధ్య పడింది. నిధుల లభ్యతతో పారిశ్రామిక రంగం విస్తరించింది. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరిగాయి. పెట్టుబడుల కల్పనతో ఆర్థిక రంగం పుంజుకుంది.

2008లో అమెరికాలో ఆర్థిక సంక్షోభం తలెత్తింది. ఆ దేశంలో అతిపెద్ద బ్యాంకుల్లో ఒకటైన లీమన్‌ బ్యాంక్‌ దివాలా తీసింది. ఆ దశలో అమెరికాలో 87 లక్షల ఉద్యో గాలు పోయాయి. అమెరికా ఆర్థిక సంక్షోభం ప్రపంచవ్యాప్తంగా విస్తరించి ప్రతికూల ఫలితాలు చూపిన నేపథ్యంలో భారత్‌ తాత్కాలిక ఒడిదుడుకులు ఎదుర్కొన్నప్పటికీ గట్టిగానే నిలబడగలిగింది. అయితే, ప్రస్తుత పరిస్థితి మాత్రం అందుకు భిన్నంగా ఉంది. ప్రపంచవ్యాప్తంగా నెలకొంటున్న ఆర్థిక మందగమనం దుష్ఫలితాలు మన దేశాన్ని ప్రభావితం చేస్తున్నాయి. దేశంలో ఏర్పడిన ఆర్థిక మందగమనం కాస్తా మాంద్యంగా రూపుదిద్దుకుంటోంది.  2016లో ఎన్డీఏ ప్రభుత్వం ఏకపక్షంగా చేసిన పెద్ద నోట్ల రద్దు ఆర్థిక వ్యవస్థను కకావికలు చేసింది. అదే సమయంలో హేతుబద్ధత లోపించిన వస్తుసేవల పన్ను (జీఎస్టీ)ను అమలు చేయడం కూడా దేశ ఆర్థిక వ్యవస్థను దెబ్బ తీసింది. అసంఘటితరంగం కార్యకలాపాలు ఎక్కువగా నగదు లావాదేవీలతో ముడిపడి ఉంటాయి. దేశ స్థూల ఉత్పత్తి (జీడీపీ)లో 15% వాటా కలిగిన వ్యవసాయరంగంపై ఆధారపడిన రైతాంగం నగదు లభ్యత లేక పలు ఇబ్బందులు ఎదుర్కొంది. చిన్న, సన్నకారు రైతులకు బ్యాంకు రుణాలు అందలేదు, ప్రైవేటు రుణాలు పుట్టలేదు. అదేవిధంగా, వ్యవసాయ ఉత్పత్తుల్ని అమ్మగా వచ్చిన నగదును బ్యాంకుల్లో డిపాజిట్లు చేసిన రైతాంగానికి సకా లంలో నగదు తిరిగి తీసుకొనే అవకాశం లేక పోయింది.  పెద్దనోట్ల రద్దుతో 2017 జనవరి, ఏప్రిల్‌ మాసాల్లో అసంఘటిత రంగంలో 15 లక్షల  ఉద్యోగాలు ఆవిరైపోయాయి. గ్రామీణ ప్రజల కొనుగోలు శక్తి క్షీణించడంతో వినియోగ వస్తువుల రంగాల్లో అమ్మకాలు పడిపోయాయి.

ఆగస్టు 15న దేశ ప్రజలను ఉద్దేశిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన ప్రసంగంలో  వచ్చే ఐదేళ్లనాటికి భారత ఆర్థిక వ్యవస్థను 5 ట్రిలియన్ల డాలర్లకు చేర్చడం అన్నది ప్రధాన అంశంగా నిలిచింది. ప్రస్తుతం ఎగుమ తులు తగ్గాయి, దిగుమతులు పెరుగుతున్నాయి. జీఎస్టీ గరిష్టంగా 18%గా ఉన్న  స్థిరాస్తి, గృహ నిర్మాణరంగాల్లో స్తబ్దత ఏర్పడింది. ఫలితంగా వాటికి అనుబంధంగా ఉండే సిమెంట్, స్టీల్, ఇటుకలు, ఎలక్ట్రికల్‌ పరికరాలు.. ఈ విధంగా అనేక రంగాల్లో అమ్మకాలు క్షీణించాయి. జీఎస్టీ 28%గా ఉన్న ఆటోమొబైల్‌ రంగంలో అమ్మకాలు క్షీణించాయి. వాహనాల కొనుగోళ్లకు 55 నుండి 65 శాతం వరకు రుణాలు అందించే బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు (ఎన్‌బీఎఫ్‌సీ) నగదు కొరతతో కునారిల్లుతున్న కారణంగా ద్విచక్ర వాహనాలు, రవాణా వాహనాల అమ్మకాలు తగ్గాయి.  మోటారు వాహనాల ఉత్పత్తి ప్లాంట్‌లలో కొన్ని విభాగాలు మూసి వేశారు. దాంతో, ఆటో విడిభాగాల పరిశ్రమలు సైతం పాక్షికంగా మూతపడ్డాయి.  దేశంలో నెలసరి ఉపాధి కల్పన రేటు 26% క్షీణించిందని ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. దేశ ఆర్థ్ధికాభివృద్ధి రేటు 5% దాటే పరిస్థితి లేని నేపథ్యంలో కేంద్రం తక్షణ చర్యలకు ఉపక్రమించగలగాలి. ఆర్థిక వ్యవస్థ బలోపేతం కావాలంటే జీడీపీలో 7 నుండి 8 శాతం నిధుల్ని మౌలిక రంగాలకు కేటాయించాలి. అంటే ఏటా రూ.20 లక్షల కోట్ల చొప్పున రాబోయే ఐదేళ్లలో రూ.100 లక్షల కోట్లు మౌలిక సదుపాయాల రంగంలో వ్యయం చేయాల్సి ఉంది. అయితే, పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన ఈ ఏడాది ఆర్థిక సర్వే లెక్కల ప్రకారం ప్రస్తుతం మౌలికరంగాలలో చేస్తున్న వ్యయం రూ. 7 లక్షల కోట్లు మాత్రమే. అంటే, ప్రైవేటు పెట్టుబడులు ఈ రంగంలో బాగా పెరగాలి. 
రిజర్వ్‌ బ్యాంక్‌ నివేదిక ప్రకారం బ్యాంకులు తమ రుణ వితరణలో 17% మేర మౌలిక సదుపాయాల రంగానికి రుణాలుగా అందిస్తున్నప్పటికీ.. అందులో చాలావరకు మొండి బకాయిలుగా మారడం వల్ల.. ఈ రంగానికి రుణాలివ్వడానికి బ్యాంకులు ఆసక్తి చూపడం లేదు. ఈ పరిస్థితిని సరిదిద్దాలి.

మాంద్యంలో తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభం పొందే రంగాలవైపు దృష్టి పెట్టాలని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. ప్రైవేటురంగంలో ప్రయోజనం లేని ఆర్ధిక ఉద్దీపనలు అందించే బదులు ప్రభుత్వ యంత్రాంగాన్ని పటిష్టపర్చుకోవడం మేలన్న అభిప్రాయాలూ వ్యక్తం అవుతున్నాయి. కేంద్ర ప్రభుత్వంలో వివిధ స్థాయిలలో 6.8 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. లక్ష వరకు పారామిలటరీ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. వీటన్నింటినీ తక్షణమే భర్తీ చేయగలిగితే.. నిరుద్యోగ సమస్య తీవ్రత తగ్గుతుంది. ఆంధ్రప్రదేశ్‌లోని కొత్త ప్రభుత్వం 100 రోజుల్లోపే 4 లక్షలకు పైగా కొత్త ఉద్యోగాలను సృష్టించగలిగింది. మరిన్ని పెట్టుబడులు పెట్టి.. వ్యవసాయరంగం ఉత్పత్తుల్ని పెంచుకోవడం అనివార్యం. రాజకీయాలకు అతీతంగా ఆర్థిక రంగంలో అనుభవం ఉన్న వ్యక్తులతో ఓ టాస్క్‌ ఫోర్స్‌ను ఏర్పాటు చేసి సలహాలు, సూచనలు పొందాలి.
 
డా‘‘ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు
వ్యాసకర్త ఎమ్మెల్సీ, కేంద్ర మాజీ మంత్రి,
చీఫ్‌ విప్, ఏపీ శాసనమండలి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement