పదవుల పంట | Gollapudi Comments On Karnataka Political Drama | Sakshi
Sakshi News home page

పదవుల పంట

Published Thu, May 31 2018 1:33 AM | Last Updated on Thu, May 31 2018 1:33 AM

Gollapudi Comments On Karnataka Political Drama - Sakshi

నాకెప్పుడూ ఓడిపోయే పార్టీలో ఉండాలని కోరిక. అందువల్ల చాలా లాభాలున్నాయి. కాంగ్రెస్‌వారు హైదరాబాద్‌కి – చక్కటి ఎయిర్‌ కండీషన్‌ బస్సుల్లో తీసుకెళ్తారు. కుమారస్వామిగారు శ్రావణ బెళగొళ, నంది హిల్స్‌ బందిపూర్‌ వంటి స్థలాలకు తీసుకెళ్తారు. కొంచెం వయస్సు మళ్లినవారికి స్లీపర్‌ బెర్త్‌లు కూడా ఇస్తారు. ఇష్టమైన విందులూ, ఫలహారాలూ, మధ్య మధ్య సరదాగా పిక్నిక్‌లూ ఉంటాయి. నాకు చాలా ఇష్టమైన కర్ణాటక వంటలు– బిసిబెళబాత్, మద్దూర్‌ వడ, పులియోగరె, పడ్డు, దేవనగిరె బెన్నె దోశె, రాగి బాల్స్, నీర్‌ దోశె, అక్కి రోటి వంటివి తినిపిస్తారు. మళ్లీ పువ్వులాగా శాసనసభకి తీసుకువస్తారు.

నాకు– ముఖ్యంగా దేవెగౌడ, కుమారస్వామి పార్టీలలో చేరాలంటే చాలా ఇష్టం. ప్రచారం గొడవలు ఎక్కువ ఉండవు. ‘కావేరీ నుంచి నీళ్లు తెస్తాను, తిరుపతి లడ్డూలు పంచుతాను, టిప్పుసుల్తాన్‌ కత్తిని ఫూల్‌బాగ్‌ మధ్యలో నిలబెడతాను’ వంటి హామీలు ఇవ్వనక్కరలేదు. పెద్ద పెద్ద ఎన్నికల సభలుండవు. కానీ అందరికీ ఆ పార్టీ గెలుస్తుందని, తప్పక పదవిలోకి వస్తుందని ఒక గౌరవం ఉంటుంది. ఎలా? అది చరిత్ర చెప్పిన పాఠం. 1996లో జనతాదళ్‌కి కేవలం 46 సీట్లు వచ్చాయి. కానీ దేవగౌడ ఈ దేశపు ప్రధాని అయి– హాయిగా పార్లమెంటులో అప్పుడప్పుడూ నిద్రకు విశ్రమించేవారు. 2006లో 58 సీట్లు మాత్రమే వచ్చాయి. 

అయినా బీజేపీతో పొత్తు పెట్టుకుని రొటేషన్‌మీద కుమారస్వామిగారు 20 నెలలు ముఖ్యమంత్రి అయి, తర్వాత బీజేపీని ‘మీ దిక్కున్నవాడితో చెప్పుకోండి’ అన్నారు. అలా అనగలిగే మగాడు కుమారస్వామి ఒక్కరే. ఇప్పుడు కేవలం– 38 సీట్లతో– 18 శాతం ఓటర్ల మద్దతుతో ముఖ్యమంత్రి అయ్యారు. వారు హడావుడి చెయ్యరు. రాజకీయాల్లోకి పోరు. అవినీతి, లంచాలు వంటి బూతు మాటలు మాట్లాడరు. అయితే అలనాడు రెండు పిల్లుల తగాదా ఒక కోతి తీర్చినట్టు వారు ముఖ్యమంత్రి అవుతారు. నన్ను ‘తినుబండారాలశా ఖ’కు మంత్రిని చేశారనుకోండి. రాష్ట్రమంతా రాగి బాల్స్, నీర్‌ దోశె, అక్కి రోటి ఉచితంగా పంచుతానని ఇప్పుడే హామీ ఇస్తున్నాను. అయితే కుమారస్వామిలాగా ముఖ్యమంత్రి కావాలి. బీజేపీ మీద కసితో కాంగ్రెస్‌ ‘బేషరతు’గా జనతాదళ్‌కి మద్దతు ఇచ్చింది. అంటే ఎవరినీ మంత్రిమండలిలోకి తీసుకోవాలన్న షరతు లేదు. చక్కగా ఐదేళ్ల పాలనకు ఇది రాచబాట.

ఈ కేసుని విచారించిన న్యాయమూర్తుల్లో కనీసం ఒక్కరికయినా ‘హాస్య ధోరణి’ ఉన్నందుకు నేను చాలా ఆనందిస్తున్నాను. జస్టిస్‌ సిక్రీగారు సరదాగా అన్నారు: ‘నన్ను, ఎమ్మెల్యేలున్న హోటల్‌ ప్రొప్రయిటర్‌ అడిగాడు: అయ్యా– నా దగ్గర 116 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. నన్ను సీఎంని చేస్తారా? అని’ అంటూ.

ముందు ముందు– పాలిస్తున్న బీజేపీని ఓడించటానికి సంకీర్ణ ప్రభుత్వాలకు ఎక్కువ అవకాశం ఉంటుందని నేను నమ్ముతున్నాను. రేపు రాబోయే 2019 ఎన్నికలలో అసలు ఆఫీసుకూడా లేని, కేవలం చొక్కా, ప్యాంటుగల కొత్త పార్టీలు చాలా మొలకెత్తవచ్చు. వాటిలో చేరాలని నా తలంపు. ‘నన్ను ఎవరు ఉజ్జయినికి తీసుకెళ్తారు? రాజస్తాన్‌ ‘చిమ్‌ చిమ్‌ పరోటా’, బజ్రే కే రోటీ, లాషూంకి చెట్నీని ఎవరు తినిపిస్తారు? హరిద్వార్‌లో పవిత్ర గంగా స్నానం చేయించి వేడి వేడి హల్వా, జిలేబీ తినిపిస్తారు? – వంటి కోర్కెలు కోరవచ్చు.

అయితే ఇక మీదట కొన్ని సమస్యలు జనతాదళ్‌కి రావచ్చు. తమని సమర్థించిన పార్టీకి 78 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వీరిమీద ప్రేమతో వారు జనతాదళ్‌లో చేరలేదు. పక్కవాడిని చెప్పు తీసి కొట్టాలంటే తన కొత్త చెప్పు ఎందుకని పొరుగువాడి ‘చెప్పు’ అయితే లాయకీ– అని వారు నమ్మారు. మరి ఇప్పుడు– లోగడ సంప్రదాయం ప్రకారం కుమారస్వామి ఏ రెండేళ్లో పాలన చేసి కాంగ్రెస్‌కి అప్పగిస్తారా? గొప్ప గొప్ప పదవులన్నీ కాంగ్రెస్‌కి ఇస్తారా? ఇందులో మళ్లీ ఆర్థిక మంత్రి ఎవరు? గనుల మంత్రి (మరచిపోవద్దు– గాలి జనార్దన రెడ్డి ఉన్న రాష్ట్రమది. మంత్రి ఎవరున్నా వారిని ‘మచ్చిక’ చేసుకోవడం రెడ్డిగారికి వెన్నతో పెట్టిన విద్య). అందువల్ల కర్ణాటకలో గనుల శాఖకు చెప్పలేని ప్రాధాన్యం ఉంది. ఇవన్నీ ఎన్నికయ్యాక వచ్చే సమస్యలు.

అలాగే బేషరతుగా తమని సమర్థించిన కాంగ్రెస్‌కి (78) ఎన్ని మంత్రి పదవులివ్వాలి? మరి మాలాంటి వాళ్లకి కేవలం మద్దూర్‌ వడ, అవిరిక్కే పాల్యాతో కుమారస్వామి సరిపెట్టేస్తారా?– అన్న విషయం గమనించాల్సి ఉంది.

వ్యాసకర్త గొల్లపూడి మారుతీరావు

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement