ఒకే పథమై.. ఒకే స్వరమై...! | Guest Column About Lockdown Issue In Country | Sakshi
Sakshi News home page

ఒకే పథమై.. ఒకే స్వరమై...!

Published Sun, Mar 29 2020 12:31 AM | Last Updated on Sun, Mar 29 2020 12:34 AM

Guest Column About Lockdown Issue In Country - Sakshi

దృఢచిత్తంతో వున్నవారిని సంక్షోభాలు ఏమీ చేయ లేవు. సరిగదా వారి సంకల్పాన్ని మరిన్ని రెట్లు పెంచుతాయి. లక్ష్య సాధనకు వారిని పురిగొల్పు తాయి. ఇంతగా, ఈ స్థాయిలో ఒక్కటై నిలిచామా అని మనమే ఆశ్చర్యపోయేలా చేస్తాయి. ఈ ప్రాణాం తక మహమ్మారి పరారయ్యాక ఈ స్ఫూర్తిని మనం కొనసాగించాలి.

పెద్దా చిన్నా తేడా లేదు... ఆడ మగ భేదం లేదు... జాతి, కులం, మతం, ప్రాంతం వ్యత్యాసం లేదు. అగ్ర రాజ్యమైనా, అట్టడుగున పడివున్న దేశమైనా లెక్కలేదు. అది ప్రజాస్వామ్య వ్యవస్థా, నియంతృత్వ రాజ్యమా అనే లెక్కలేదు. అందరినీ ఒకే రకంగా కరోనా వైరస్‌ పీడిస్తోంది. అన్ని ఆర్థిక వ్యవస్థల్ని కబళించడానికి సిద్ధపడు తోంది. యధేచ్ఛగా తన ధ్వంసరచన సాగిస్తోంది. దీన్ని కట్టడి చేయడానికి ఒక్కో దేశం ఒక్కో వ్యూహాన్ని అనుసరిస్తోంది. మన దేశం బహు విధాలుగా ఈ మహమ్మారిపై పోరాటం మొదలుపెట్టింది. 21 రోజుల లాక్‌డౌన్‌ ద్వారా పౌరుల్ని బయటకు రానీయకుండా చూడటం, ఈ బహుముఖ పోరాటంలో మొదటిది. దీంతో పాటు రాజకీయ విభేదాలు మరిచి, ఏ రాష్ట్రంలో ఏ పార్టీ ప్రభుత్వమున్నా లాక్‌డౌన్‌కు సహకరిం చడం రెండోది. ఇది మెచ్చదగిన పరిణామం.

సంక్షోభ సమ యాల్లో మన నేతలంతా ఒక్కటిగా ఉంటారనేందుకు ఇది ఉదాహరణ. అసలే ఆరోగ్య వ్యవస్థ అంతంతమాత్రంగా వున్న మన దేశంలో ఇలా సమష్టిగా కదలకపోతే ఈ మహమ్మారితో పోరా డటం అసాధ్యం. ఖజానా నుంచి భారీ మొత్తంలో నిధుల విడుదల మూడో చర్య. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్‌ రూ. 1.7 లక్షల కోట్ల ప్యాకేజీని ప్రకటించడం, వివిధ వర్గాల వారికి ఈ కష్టకాలంలో అవ సరమైన మొత్తాన్ని అందజేస్తా మని చెప్పడం, ఉచితంగా తిండిగింజలివ్వడం, రైతులు, కార్మి కులు, కూలీలు, మహిళలు తదితర వర్గాలకు అందించబోయే సాయమేమిటో ప్రకటించడం, మధ్యతరగతికి కొన్ని వెసులుబాట్లు ఇవ్వడం వంటివి ఇందులో భాగమే. నాలుగోది ద్రవ్యసంబంధమైనది.

రెపో రేటు, రివర్స్‌ రెపో రేట్లను సవరించి బ్యాంకులు ఉదారంగా రుణాలు మంజూరు చేయడానికి మార్గం సుగమం చేయడం, ఉత్పా దక రంగానికి జవసత్వాలివ్వడం నాలుగోది. 1.37 లక్షల కోట్ల రూపాయలు లభ్యమయ్యేలా చర్యలు తీసు కోవడం మెచ్చదగ్గది. అయితే ఆర్థిక సంబంధ కార్యకలాపాలు స్తంభించిపోయిన వర్త మాన స్థితిలో ఇది ఏమేరకు వాణిజ్య లావాదే వీలు పెర గడానికి దోహదపడుతుందో ఇంకా చూడాల్సి ఉంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో మార్కెట్లు యథావిధిగా వ్యవహారాలు కొన సాగించడానికి, ఆర్థిక సుస్థిరత సాధిం చడానికి ఈ చర్యలు తోడ్పడాలన్నది రిజర్వ్‌బ్యాంకు ఆలోచన. ఈ మహమ్మారి కొట్టిన దెబ్బ సామాన్యమైనది కాదు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మాంద్యంలోకి జారు కుంటున్న ప్రస్తుత స్థితిలో ఈ చర్యలన్నీ గొప్ప ఫలితాలిస్తాయని ఆశిం చలేం.

రిజర్వ్‌ బ్యాంక్‌ చర్యలు మరింత వాస్తవికంగా ఉండాలన్నది కొందరు నిపుణుల సూచన. ఒకపక్క ముడి చమురు ధరలు పడి పోయినందువల్ల ద్రవ్యోల్బణం తగ్గొచ్చునని, పర్యవసానంగా కొన్ని ఆహార వస్తువుల ధరలు కూడా కిందికి దిగొచ్చే అవకాశం వుందని వారు చెబుతున్నారు. పార్లమెంటు, అసెంబ్లీల కార్య కలాపాలు ఆగి పోయాయి. కార్యనిర్వాహక వ్యవస్థ పూర్తి స్థాయిలో పనిచేస్తుండటం, ఆఖరికి న్యాయ వ్యవస్థ సైతం అత్యవసర స్వభావమున్న కేసుల్ని తప్ప మరేమీ విచారించబోవటం లేదని చెప్పడం ఈ బహుముఖ పోరులో భాగమే. కంపెనీలు, ఉత్పత్తిదారులు, పంపిణీదారులు, బ్యాంకింగ్‌ రంగాలు, స్వచ్ఛంద సంస్థలు, మీడియా ఒక్కటై పనిచేస్తున్నాయి. వేల కోట్లకు పడగలెత్తిన కుబేరులు ఆలస్యంగానైనా తమ బాధ్యత గుర్తించి ఉదారంగా విరాళాలివ్వడం మొదలుపెట్టారు. కొందరు తమ ఉత్పాదక సంస్థల్లో వైద్యపరమైన ఉపకరణాల తయారీకి సిద్ధపడుతున్నారు. మేధోపరమైన అధ్యయ నాలు చేసే సంస్థలు ఈ మహమ్మారిని పోరా డటంలో ఏ ఏ వ్యూహాలు అనుసరించాలో, ఎక్క డెక్కడ లోటుపాట్లున్నాయో, వాటిని సరిచేయడా నికి చేయాల్సిందేమిటో చెబుతున్నాయి.

మొత్తానికి దేశంలోని వ్యవస్థలు, సంస్థలు, వ్యక్తులు అందరూ ఒక్కటై చేతులు కలి పారు. వైద్యరంగ సిబ్బంది, పారిశుద్ధ్య సిబ్బంది, ఇతర అత్య వసర సర్వీసుల్లోని సిబ్బంది నిరంతరం పనిచేస్తున్నారు. ఇలాంటి ధోరణులు ఇంతక్రితం మన దగ్గర ఈ స్థాయిలో కనబడలేదు. ఎంత సేపూ ఆధిపత్య రాజకీయాలు తప్ప మన పార్టీలకు మరేమీ పట్టేవి కాదు. ఈ మహమ్మారి పుణ్యమా అని మొత్తానికి అందరిలో జడత్వం వదిలిన జాడలు కనబడుతున్నాయి. ఈ సంక్షో భాన్ని మనమంతా అధిగమించాక ఈ సమైక్యత మన మధ్య ఇంతగా ఎలా సాధ్య మైందో, దీన్ని మరింత మెరుగైన పాలనకు ఎలా విని యోగించవచ్చునో, మనమంతా క్రమశిక్షణా యుత పౌరులుగా రూపొందడానికి ఇదెలా దోహ దపడుతుందో, ఆర్థికరంగంలో మనం మరింతగా పుంజుకుని మెరుగైన వృద్ధి రేటును సొంతం చేసుకోవడానికి ఈ అనుభవాలన్నీ ఎలా దోహ దపడతాయో అధ్యయనం చేద్దాం. పటిష్టమైన, సమున్నతమైన భారతాన్ని ఆవిష్కరించుకోవ డానికి కృషి చేద్దాం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement