కరోనా వైరస్ మనందరినీ ఇళ్లలోనే నిర్బంధించడానికి ముందు, మార్చి నెల చివరలో భారతదేశవ్యాప్తంగా కొంతమంది ప్రజలు ఇతర ముఖ్యమైన క్యాంపెయిన్‌లలో నిమగ్నమై ఉండిపోయారు. పౌరులంటే ఎవరు, ఆధునిక ప్రజాతంత్ర సమాజంలో విశ్వవిద్యాలయం పాత్ర ఏమిటి? వంటి అంశాలపై జరిగిన క్యాంపెయిన్ ఇది. ఈ చర్చకు సంబంధించి కొత్త పదం కనిపెట్టడానికి నేను పౌరసత్వం, విద్యార్థి జీవితానికి మధ్య ఏదైనా సంబంధం ఉందా అని ప్రశ్నించాలనుకున్నాను. కానీ కరోనా లాక్‌డౌన్ మాలో చాలామంది కదలికలను నియంత్రించింది. ఇలా నిర్బంధంగా మేం వెనక్కు తగ్గాల్సి రావడం వల్ల మన కాలం సమస్యలపై అనేక ప్రశ్నలను సంధించడానికి మాకు మంచి అవకాశం ఇచ్చింది.
గతంలో ఉపాధ్యాయురాలిగా పనిచేసిన మా బంధువుతో కొద్ది కాలంక్రితం నేను సంభాషణ జరిపాను. ఆమె జేఎన్‌యూ, జామియా మిలియా ఇస్లామియా, అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీల తీరును, పౌరసత్వ సవరణ చట్టంపై విద్యార్థుల నిరసనలను వ్యతిరేకిస్తూ మాట్లాడారు. విద్యార్థులు రాజకీయాలను పక్కనపెట్టి తమ చదువులపై ఎందుకు దృష్టి పెట్టరు అని ఆమె ప్రశ్నించారు. విద్యార్థి అంటే కేవలం పాఠాలను గ్రహించడం మాత్రమే కాదని, సమాచార జ్ఞానాన్ని వారు పొందాలని, తదనుగుణంగా పరీక్షల్లో తమ పోటీతత్వాన్ని ప్రదర్శించాలని నేను ఆమెకు చెప్పాను. కేవలం సమాచారాన్ని నిల్వచేసుకోవడం, సమాచార జ్ఞానాన్ని నిర్వహించడం, తిరిగి పొందడం కంటే విద్యలో మరెన్నో అంశాలు దాగి ఉన్నాయి.
ప్రధానమంత్రి నరేంద్రమోదీ అభిప్రాయం ప్రకారం మనం ఆత్మనిర్భర్ లేక స్వావలంబన కలిగిన జాతిగా మారాలంటే, విద్యాబోధన నుంచి మనం పొందిన విజ్ఞానాన్ని ఒక సమాజంగా మనం మదింపు చేయకూడదా? మనం పంపిణీ చేస్తున్న జ్ఞానాన్ని పెంపొందించే జ్ఞాన మీమాంస మూలాలను మనం అంచనా వేయడం ఎలా? అంతర్జాతీయ నేపథ్యంలో జ్ఞాన సామర్థ్యతను, కార్యసాధకతను ముందుకు తీసుకుపోవడం ఎలా? దీన్ని స్వదేశీ, ఖాదీ అనే గాంధీ భావనల నేపథ్యంలో పరిశీలిస్తే, మన ఆర్థిక, రాజకీయ, తక్షణ నైతిక ఎంపికలను కూడా తాజాగా, స్వచ్ఛంగా ఉంచుకోవడానికి సాహసించాల్సిన సమయం ఇది.
ప్రస్తుత కేంద్ర ప్రభుత్వ హిందుత్వ జాతీయ ఎజెండా.. భారతదేశాన్ని దాని పురాతన పౌరాణిక గతంలోకి తీసుకుపోవాలని చూస్తున్న నేపథ్యంలో.. మన ఆధునికతకు సంబంధించిన సమున్నత ఆకృతిని నిర్ణయించడంలో మన దేశీయతను గురించి నొక్కి చెప్పాల్సిన అవసరముంది. ఒకవైపు స్థానికంగా తయారయ్యే స్వదేశీ నూలుకు మరోవైపు అంతర్జాతీయ సాంకేతిక యవనిక, సమాచారం, కరెన్సీల మధ్య స్పష్టమైన రేఖను మనం ఎలా సమతుల్యం చేయాలనేది కీలకమైన అంశం. కోవిడ్–19 సాంక్రమిక వ్యాధి ప్రభావంతో జాతీయ ఆర్థిక వ్యవస్థ స్పష్టంగానే మునిగిపోతున్నట్లు కనిపిస్తుండగా, స్థానిక, అంతర్జాతీయ ఉద్రిక్తతల నేపథ్యంలో జాతిని ముందుకు నడిపించే సామర్థ్యం ఉన్న డైనమిక్ తరాన్ని రూపొందించేలా ప్రభుత్వం విద్యారంగానికి ఎలాంటి ఉద్దీపనను అందించబోతోంది?
ఈ విషయంలో ఒక స్పష్టమైన ఉదాహరణ ఉంది. ప్రస్తుత విద్యాసంవత్సరాన్ని పూర్తి చేయడానికి విద్యాపరమైన సామగ్రిని ఆన్‌లైన్లో డెలివరీ చేయడానికి పలు ఉన్నత విద్యాసంస్థలు ఇప్పుడు త్వరత్వరగా ఇంటర్నెట్ అప్లికేషన్ అయిన జూమ్‌ను ఉపయోగించుకుంటున్నాయి. బహుళ జాతి సంస్థల క్లయింట్లను పొందే సాఫ్ట్‌వేర్‌గా జూమ్ అవతరించింది. ఏకకాలంలోనే ఆన్‌లైన్‌లో భేటీ అయి కార్యకలాపాలు నడపడానికి ప్రపంచ వ్యాప్తంగా ఉద్యోగులను ఒక చోటికి చేర్చాలని కార్పొరేషన్లు చూస్తున్నాయి. సంపన్నులైన పిల్లలకే కాకుండా కార్పొరేట్ సంస్థల ఆచరణ మన క్లాస్ రూమ్‌లలోకి వచ్చేసిన వాస్తవం విద్యారంగంలో జూమ్‌ను అధికారికంగానే ఉపయోగించడాన్ని సాధ్యం చేసింది. నిస్సందేహంగా ఖర్చు తగ్గింపు అనేదే ఇక్కడ నిర్ణయాత్మక అంశం. దేశ మంతటా పిల్లల ఎదురుగా నిలబడి విద్యను బోధిస్తున్న పద్ధతే అమలులో ఉంటున్న నేపథ్యంలో విభిన్నతరహాలో పిల్లల బోధన జరపడంలో ఉపయోగపడుతున్న అనేక ఇతర యాప్‌లు కూడా ఇప్పుడు రంగంలోకి వచ్చేశాయి.
సులభంగా విద్యను అందిస్తున్నప్పటికీ ఆన్‌లైన్ విద్యాబోధనలో మరొక చిక్కు ఉంది. 2007లో కరేన్ మోస్‌బెర్గర్ రాసిన ‘డిజిటల్ పౌరసత్వం, ఇంటర్నెట్, సొసైటీ, భాగస్వామ్యం’ అనే రచనలో.. డిజిటల్ యాక్సెస్, డిజిటల్ స్కిల్, డిజిటల్ అక్షరాస్యత, డిజిటల్ పౌరసత్వం అనేవి ప్రపంచ వ్యాప్తంగా ఆధునిక సమాజాలకు అసలైన చిహ్నాలుగా ఉంటున్నాయని రాశారు. మరో నాలుగైదు వారాలపాటు సాంక్రమిక వ్యాధి మనల్ని లాక్‌డౌన్‌లో ఉంచుతున్నందున మనం విద్యకు సంబంధించి డిజిటల్ రంగానికి తరలేందుకు మంచి అవకాశాలు ఉంటున్నాయి. పౌరసత్వ భావనను తాజాగా పరిచయం చేసేందుకు మనం విద్యాపరమైన లక్ష్యాలను కూడా మెరుగుపర్చుకోగలిగాం. పౌరసత్వ సవరణ చట్టం 2019 గురించి ప్రజలతో సంభాషించడంలో పరిమితుల రీత్యా, దేశవ్యాప్తంగా విద్యార్థులు, కార్యకర్తలు, రాజకీయనేతలు దానిపై తీవ్ర విమర్శలు చేస్తూ వ్యతిరేకిస్తున్నారు. దీంతో ఈ చట్టం అమలు కాస్త ప్రతిష్టంభనకు గురైనప్పటికీ సరిగ్గా సాంక్రమిక వ్యాధి విస్తరించడానికి ముందు దేశంలో, కేంద్రంలో, రాష్ట్రాల పరిధిలోని అధికార, ప్రతిపక్ష పార్టీల నాయకత్వం ఈ చట్టంపై కాస్త సానుకూలతను ప్రదర్శించడం జరిగింది.
విద్య అంటే సమాచారాన్ని నిల్వ చేయడం, నిర్వహించడం, తిరిగి పొందడం మాత్రమే కాదని ముందే చెప్పాను. కాబట్టి కరోనా అనంతరం ప్రపంచ డిజిటల్ అక్షరాస్యత వైపు విద్యార్థులను సన్నద్ధం చేయడానికి మన విద్యావ్యవస్థలోకి వేటిని చొప్పించాలన్నది ప్రశ్న. ఇది మన సోషల్ మీడియా ఖాతాలను నిర్వహించుకోవడం కంటే ప్రాధాన్యత కలిగిన విషయం. ముందుగా మనం పౌరసత్వాన్ని, విద్యార్థితత్వాన్ని అనుసంధించాల్సి ఉంది. మన విద్యార్థులకే కాకుండా విద్యావంతులం అని ప్రకటించుకుంటున్న వారికి కూడా పౌరవిధులకు సంబంధించి మంచి అలవాట్లును పెంపొందించాల్సి ఉంది. ఒక సంస్థ ద్వారా గుర్తింపు పొంది వృత్తి నైపుణ్యాలను పెంపొందించుకుని, ప్రయోజనకరమైన ఉద్యోగం సంపాందించడంతో సరిపెట్టుకోకుండా విద్యావంత పౌరుల్లా మన సామాజిక బాధ్యతలలో కొన్నింటినైనా నెరవేర్చడం మన ఆచరణలో భాగం కావాలి. ఉన్నత విద్య ప్రయోజనాలు ఏమీ పొందనప్పటికీ ఢిల్లీలోని షహీన్ బాగ్‌లో నెలల తరబడి ఉద్యమించిన మహిళలు ఈ బాధ్యతను చాలాచక్కగా అర్థం చేసుకున్నారు. మరి పౌర చైతన్యం కల ఇతరులు దీన్ని ఎందుకు పాటించరు?
ప్రముఖ సామాజిక శాస్త్రజ్ఞుడు టి.హెచ్ మార్షల్ 1987లోనే డిటిజల్ పౌరసత్వం అంటే ఏమిటని ప్రశ్నిస్తూ, సమాజంలోని సభ్యులందరూ రాజకీయాల్లో భాగస్వామ్యాన్ని పెంచుకుంటూనే సమానమైన ఆర్థిక కార్యకలాపాలను నిర్వహించడం అని నిర్వచనమిచ్చారు. ఆయన చెప్పిన పౌరుల అలవాట్లకు నేను మరొకటి చేర్చాలనుకుంటున్నాను. ఎన్నికలు జరుగుతాయా లేదా అనే దాంతో పనిలేకుండా మన ప్రజాప్రతినిధులు పాలనా వ్యవహారాలను ఎలా నిర్వహిస్తున్నారనే అంశంపై పౌరులందరూ శ్రద్ధపెట్టి పరిశీలించాలి. భూగర్భ జల మట్టాలపై ఆధారపడి తమ పంటలకు ఎంత నీరు కావాలి, ఎప్పుడు అవసరం ఉంటుంది అనే అంశాలపై మన రైతులు వృత్తిపరమైన సలహాల కోసం ఇప్పుడు సోషల్ మీడియాను ఉపయోగించుకుని భూగర్భ శాస్త్రజ్ఞులు, వాతావరణ శాస్త్రజ్ఞుల నుంచి సలహాలు పొందగలుగుతున్నారు. ఆన్‌లైన్ సామాజిక బృందాలను ఏర్పర్చుకోవడానికి డిజిటల్ మీడియా మనకు మంచి వనరులను అందిస్తోంది. ఈ అవకాశాలను వెతికి పట్టుకోవడానికి లాక్ డౌన్ మనకు తగినంత సమయాన్ని అందించింది.
ఆధునిక భారతదేశం ఇప్పుడు డిజిటల్ పౌరసత్వం, డిజిటల్ స్టూడెంట్ షిప్ అనే కొత్త శకంలోకి ప్రవేశించింది. ఈ పరిస్థితుల్లో మన క్లాస్ రూమ్‌లను కేవలం సమాచారాన్ని పంపిణీ చేసే స్తబ్ద రంగంగా ఇకెంతమాత్రం కొనసాగించలేం. మన తరగతిగదులను, చాట్ రూమ్‌లను, ట్విట్టర్ ఫీడ్ బ్యాక్‌లను పరిశోధన, విశ్లేషణ, సంక్లిష్ట అంశాలను పోల్చడం వంటి సాధానాలతో కూడిన సరికొత్త ప్రజాస్వామిక రంగస్థలాలుగా పరివర్తన చెందించాల్సి ఉంది. ఆన్ లైన్ లెర్నింగ్ అనేది ఫ్యాకల్టీ నుంచి విద్యార్థికి కోర్స్ కంటెంట్‌ని డెలివరీ చేయడానికి మాత్రమే పరిమితం కాకూడదు. ఇది విద్యార్థుల మధ్య భావవ్యక్తీకరణ వాహకంగా ఉంటూ ఇతర డిజిటల్ పౌరులకు కూడా అందుబాటులో ఉండాలి. ఇతర పౌర సంస్థలతోబాటు కాలేజీలు, విశ్వవిద్యాలయాలు కూడా పురోగామి సమాజాన్ని రూపొందించే ప్రయోగశాలలుగా ఉండాలి.
ఈసారి కూడా ఎవరైనా ప్రశ్నించవచ్చు. ఈ జేఎన్‌యూ తరహా విద్యాసంస్థలు ప్రతి విషయాన్ని రాజకీయంగా ఎందుకు మారుస్తున్నారని వారు అనవచ్చు. చరిత్ర, రాజనీతి శాస్త్రం, సోషియాలజీ, ఆంత్రోపాలజీ, న్యాయ శాస్త్రం, ప్రపంచ భాషలు సంస్కృతుల గురించి చదువుకునేవారు దేశాన్ని పట్టి పీడిస్తున్న సమస్యలను పట్టించుకోకూడదా అన్నదే నా ఎదురు ప్రశ్న. డిజిటల్ పౌరసత్వంలో రాజకీయ భాగస్వామ్యం కూడా ముఖ్యమైనదని గ్రహించాలి. స్వావలంబన కలిగిన పౌరులుగా మనం పరిణితి చెందిన ప్రపంచ శక్తిగా మారాలంటే పౌరుల రాజకీయ ఆకాంక్షలు ఫలించి ప్రజాస్వామ్య సంస్థల నిర్మాణంలో వారి భాగస్వామ్యం కూడా ఉండాలని డిమాండ్ చేయాలి. ఈ లాక్ డౌన్‌ను మనం నివసిస్తున్న స్థలం, జన్మదినంపై చర్చల నుండి పౌరసత్వం భావనవైవు సంభాషణను మరల్చుదాం. డిజిటల్ పౌరసత్వానికి మనముందున్న అవకాశాల్లో పౌరసత్వంపై చర్చ కూడా కీలకమైన అంశంగా ఉండాలి.
(ది వైర్ సౌజన్యంతో)
పూనమ్ ఆరోరా, ప్రొఫెసర్, హ్యుమానిటీస్, ఫ్రీలాన్స్ రైటర్
Comments
Please login to add a commentAdd a comment