విశాఖ రైల్వే జోన్.. ఆంధ్ర ప్రదేశ్ అభివృద్ధికి ఒక ముఖద్వారం.. ఉత్తరాంధ్రుల ఐదు దశాబ్దాల పోరాటాల కల.. రాష్ట్ర విభజన హామీల నుంచి విశాఖకు దక్కిన హక్కు.. ఆంధ్రప్రదేశ్‌కు కాబోయే కొత్త రాజధానికి స్వర్ణాభరణం. అయితే విశాఖ రైల్వే జోన్ ప్రకటన జరిగి ఏడాది గడిచినా ఎందుకో పట్టాలు ఎక్కలేదు. 2019 ఫిబ్రవరి 27న అప్పటి రైల్వే మంత్రి పియూష్ గోయల్ ఏపీలోని గుంతకల్లు, గుంటూరు డివిజన్లు పూర్తిగా, విజయవాడ, వాల్తేర్ డివిజన్లలో కొంత భాగం కలిపి విశాఖ కేంద్రంగా కొత్తగా సౌత్ కోస్ట్ రైల్వే జోన్‌ను ప్రకటించారు. అంతేకాకుండా జోన్ ప్రక్రియను 11 నెలల్లో పూర్తి చేస్తామంటూ మార్చి 8న ఢిల్లీలో మంత్రి మరోసారి స్పష్టం చేశారు. కొత్త జోన్ ప్రక్రియ కోసం ఓఎస్డీగా ధనంజయులుని నియమించి, దానికి సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు నివేదికను రూపొందించాలని ఆయన్ని ఆదేశించడం జరిగింది.
ఆయన ఆధ్వర్యంలో కొత్త జోన్ పరిధిలోకి ఏమేమి వస్తాయనేది నివేదిక తయారు చేశారు. డివిజన్లు, కొత్త జోన్ సరిహద్దులు, ఆస్తులు, రైళ్ల వివరాలు, కొత్త కార్యాలయాల ఏర్పాటు, అవసరమైన అధికారులు, సిబ్బంది, మౌలిక వసతులు తదితర వివరాలన్నింటితో నివేదికను గత ఆగస్టులో రైల్వే బోర్డుకు ఓఎస్డీ సమర్పించడం జరిగింది. మొత్తం 3,496 కి.మీ. మేర రైల్వే మార్గాలు, 5,437 కి. మీ. మేర రైల్వే లైన్లు దీని పరిధిలోకి తీసుకొస్తున్నారు. అయితే వాస్తవానికి జోన్ ప్రకటన వెలువడినప్పుడే నెలల వ్యవధిలో విభజన ప్రక్రియ మొదలవుతుం దని అందరూ భావించారు.
కానీ ఏడాది కాలం ముగిసినా.. ఉత్తరాంధ్రుల కల ఇంకా నిజం కాలేదు. మరో వైపు అధికాదాయం వచ్చే వాల్తేర్ డివిజన్‌ను రెండుగా చీల్చి వాల్తేర్ రైల్వే జంక్షన్‌ను విజయవాడ డివిజన్లలో చేర్చాలని, పుష్కలమైన మైనింగ్ వనరులద్వారా అధిక ఆదాయాన్ని ఇస్తున్న కొత్తవలస– కిరండల్ లైన్‌ను ఒడిశాలో ఉన్న రాయగడ జంక్షన్‌తో కలిపి, దాన్ని రాయగడ డివిజన్‌గా చేయటానికి, రైల్వే శాఖ తీసుకున్న నిర్ణయాన్ని ఉత్తరాంధ్ర ఉద్యమ కారులు, వాల్తేర్ రైల్వే ఉద్యోగులు ఇంకా ఆందోళన చేస్తూనే ఉన్నారు.
ఈ మధ్యకాలంలో విశాఖ వాసి ఒకాయన విశాఖ రైల్వే జోన్ వివరాలు కోరుతూ రైల్వే బోర్డుకు ఆర్టీఐ కింద సమాచారం కోరారు. ప్రస్తుతం డీపీఆర్ ఇంకా పరిశీలనలో ఉందని బోర్డు నుంచి వచ్చిన సమాధానం. వాస్తవానికి డీపీఆర్ పరిశీలనలో.. రైల్వే బోర్డుకు పంపిన నివేదికను అందులోని డైరెక్టర్లు పరిశీలించి అభ్యంతరాలు, సూచనలు ఉంటే తెలియజేస్తారు. ఇదంతా పూర్తయ్యాక బోర్డు నుంచి రైల్వే మంత్రికి పంపిస్తారు. ఆయన ఆమోదించిన తర్వాత, ఏ తేదీ నుంచి కొత్త జోన్ అమల్లోకి వస్తుందనేది అధికారికంగా ప్రకటించాల్సి ఉంటుంది.
ఆ తేదీ నుంచి దక్షిణ కోస్తా జోన్ కార్యకలాపాలు మొదలవుతాయి. కొత్త జోన్ అమల్లోకి వచ్చిన తర్వాత జనరల్ మేనేజర్ సహా, ఇతర ఉన్నతాధికారులు, వివిధ విభాగాలకు అవసరమైన కార్యాలయాల నిర్మాణం, క్వార్టర్ల నిర్మాణం తదితరాలు అన్నీ పూర్తి చేసేందుకు కనీసం రెండు, మూడేళ్లు పడుతుందని చెబుతున్నారు. అందుకు దాదాపు రూ. 200 కోట్లకు పైగా నిధులు అవసరమవుతాయని రైల్వే అధికారుల అంచనా. కానీ 2020–21 కేంద్ర బడ్జెట్లో మాత్రం దక్షిణ కోస్తా జోన్‌తో పాటు, రాయగడ కేంద్రంగా ఏర్పాటయ్యే కొత్త డివిజన్‌కు కలిపి కేవలం రూ. 3 కోట్లు మాత్రమే కేటాయించడంలో పలు అనుమానాలకు తావిస్తోంది.
దేశంలో రైల్వేల పరంగా ఎంతో ప్రాధాన్యత కలిగిన ఏపీకి ఆ స్థాయికి తగ్గట్టుగా కేంద్ర బడ్జెట్ నిధుల కేటాయింపులో ప్రాధాన్యం ఇవ్వడం లేదు. దేశంలో అత్యధిక ఆదాయం తెచ్చి పెట్టే వాల్తేర్ డివిజన్ కేంద్రం కూడా ఏపీ లోనే ఉంది. దీనికి తోడు ఏపీలో సహజసిద్ధమైన వనరులు, సౌకర్యాలు ఉన్న నేపథ్యంలో.. రాష్ట్రంలో కొత్త రైళ్ల కూత ఎందుకు వినిపించడం లేదని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
యాతం వీరాస్వామి
వ్యాసకర్త రచయిత, విశ్లేషకులు
మొబైల్ : 95816 76918
Comments
Please login to add a commentAdd a comment