
గోవుల్ని అక్రమ రవాణా చేస్తున్నారన్న కారణంతోనో, కిడ్నాప్ చేసేవారుగానో భావిస్తూ మూక హత్యలకు తెగబడడం దేశవ్యాప్తంగా ఈ మధ్య ఎక్కువైంది. పదినెలల్లో ఇలాంటి హత్యలు 30కి పైగా జరిగాయంటే ఇదెంతో తీవ్రంగా ఆలోచించాల్సిన విషయమే. ఇలాంటి దురంతాలు.ముఖ్యంగా సాటి మనిషిని, నిరాయుధుణ్ణి మూకుమ్మడిగా ఒక గుంపు చంపేటంతటి కసి పెరగడానికి, రాక్షసత్వం కలగడానికి దారితీస్తున్న పరిణామాలపై ఆలోచించాలి. తీవ్ర భయం ఒకవైపు, భయంలేనితనం మరోవైపు జనంలో ఒకే సమయంలో ఉండడం కారణం కావొచ్చు.
సామాజిక మాధ్యమాల ద్వారా, ముఖ్యంగా వాట్స్ అప్ ద్వారా వదంతులు వ్యాపించి భయాందోళనలు రేకెత్తిస్తున్నాయి. వాటినుండి రక్షించగలదన్న నమ్మకం వ్యవస్థ మీద పూర్తిగా లేక, విచక్షణ కోల్పోయి చట్టాన్ని చేతుల్లోకి తీసుకొనే మొండి తనం వస్తోంది. ఇది ఒక సమస్య అయితే వ్యవస్థ మీద, చట్టాల మీద భయం లేకపోవడం. తప్పు చేసినా తప్పించుకోగలం అన్న భావన రెండో సమస్య. రెండూ కలిసి మూకలో రాక్షసత్వాన్ని రేపుతున్నాయి.
ప్రభుత్వంవదంతుల్ని వ్యాప్తి చేసేవాళ్ళపై కఠినంగా వ్యవహరిస్తుందన్న సంకేతం పంపాలి. అమాయకుల్ని పొట్టన పెట్టుకునే మూకలో అసలు నిందితుల్ని, ప్రేరేపితుల్ని గుర్తించడం కష్టం. హింసలో పాల్గొన్న అందరినీ అదుపులో తీసుకొని నేరస్తుల్ని శిక్షించేలా చట్టాన్ని తీసుకురావాలి. ఆ తరహా నేరం చేసి తప్పించుకోవడం కుదరదని ప్రభుత్వం గట్టిగా చెప్పగలగాలి. ఈ తరహా పెడధోరణి సమాజాన్ని దిగజార్చక ముందే పౌర సమాజం మేల్కొనాలి. ప్రభుత్వాలు ఆ దిశగా కఠినంగా వ్యవహరించాలి.
-నర్సింగ్ యాదవ్, హైదరాబాద్.
Comments
Please login to add a commentAdd a comment