ప్రపంచ మహమ్మారిగా మారి విస్తరిస్తున్న కరోనా వైరస్ వ్యాప్తి నిరోధానికి పరిష్కార మార్గంగా నేడు దేశవ్యాప్తంగా జనతా కర్ఫ్యూ పాటించాలని ప్రధాని నరేంద్రమోదీ పిలుపునిచ్చారు. ఆదివారం ఉదయం 7 గంటలనుంచి రాత్రి 9 వరకు దేశమంతటా ప్రజలు ఇళ్లలోంచి బయటకు రావద్దని, ఆ విధంగా కరోనా వైరస్‌పై అవిశ్రాంతంగా పోరాడుతున్న వైద్యులు, నర్సులు, ప్రయోగశాలలు, పారిశుధ్య సిబ్బంది తదితరులకు కృతజ్ఞత తెల్పుకోవడానికి ఇదే చక్కటి మార్గమని ప్రధాని భావోద్వేగంతో చేసిన ప్రసంగం దేశ ప్రజ లను కదిలించింది. సాధారణ ప్రజానీకం ప్రధాని మాటను నూటికి నూరుపాళ్లు స్వీకరించి స్వచ్ఛందంగా ఇళ్లలోనే క్వారంటైన్ కావాలని నిర్ణయించుకున్నారు కూడా.
కానీ మరోవైవు ముఖచిత్రం పూర్తి భిన్నంగా ఉంటోంది. కరోనా వైరస్ పాజిటివ్‌గా తేలిన వారి కంటే అనుమానితులుగా ఏకాంతవాసానికి పరి మితం కావల్సి వస్తున్న వారు భయాందోళనలకు గురవుతున్నారు. కరోనా వైరస్ సోకిందనే అనుమానంతో 14 రోజుల పాటు ఇళ్లలో, క్వారంటైన్ కేంద్రాల్లో ఏకాంతవాసంలో ఉండటం అంటేనే వీరు ఊహించలేకపోతున్నారు. కరోనా అనుమానితుల జాబితాకు ఎక్కిన వారు, అక్కడ పరీక్షలో ఏమీ లేదని తేలి ఇళ్లకు వచ్చిన తర్వాత కరోనా వైరస్ లక్షణాలు సోకినవారు కూడా ఈ స్వయం ఏకాంతవాసం పట్ల బెంబేలెత్తిపోతున్నారు.
కొన్ని ఉదాహరణలు చూద్దాం. కరోనా వైరస్ సోకిందనే అనుమానంతో ఐసోలేషన్ కేంద్రాల్లో పెట్టిన వారిలో కొందరు చెప్పాపెట్టకుండా పారిపోయారు. కుమారుడికి వైరస్ సోకిన విషయం తెలిసి కూడా ఇంటిలో క్వారంటైన్ చేయకుండా రైల్వే గెస్ట్ హౌస్‌లో ఉంచి మొత్తం సిబ్బందికి ప్రమాదాన్ని కలిగించిన రైల్వే అధికారిణి గురించి కూడా ఇటీవలే చదువుకున్నాం. ఢిల్లీలో ఐసోలేషన్ కేంద్రంలో చేరిన కరోనా వైరస్ పీడితుడు తన ఒంటరితనాన్ని భరించలేకో, అవమానంగా భావించో తాను ఉంటున్న భవంతి పైనుంచి దుమికి చనిపోయాడు. ఇక విదేశాలనుంచి అడుగుపెట్టి ఏమాత్రం జంకూ గొంకూ లేకుండా స్వేచ్ఛగా సంచరిస్తున్నవారు కరీం నగర్ జిల్లాకేంద్రంలో అప్రకటిత కర్ఫ్యూ విధించటానికి కారణమయ్యారు.
ఈ నేపథ్యంలో నిర్బంధ ఏకాంతవాసం వల్ల మనుషుల్లో కలుగుతున్న మానసిక ప్రభావాలను సరిగా అంచనా వేయాల్సి ఉంటోంది. సమాజంతో బలీయమైన సంబంధాలు కలిగినవారు, నిత్యం సామాజిక సంబంధాల్లో ఉంటున్న వారు కరోనా నేపథ్యంలో తప్పనిసరై ఒంటరిగా ఉండాల్సి రావడం అనే భావననే తట్టుకోలేకపోతున్నారు. ఇది స్పష్టంగా గృహనిర్బంధమే. లేక ఐసోలేషన్ కేంద్రాల్లో తప్పనిసరి నిర్బంధమే. తాము నేరస్తులం కాకపోయినా, ఏ తప్పూ చేయకపోయినా ఈ కృత్రిమ జైలు జీవితం ఏమిటన్నది ఐసోలేషన్ కేంద్రాల్లో ఉంటున్నవారిని కుంగదీస్తోంది.
కరోనా వైరస్ సోకినట్లు అనుమానిస్తున్న వారి మానసిక ఆందోళనలు, ప్రతిఫలనాలను సానుభూతితో అర్థం చేసుకోవలసిందే. ఎందుకంటే మనిషి ప్రాథమికంగా సంఘజీవి. సోషల్‌గా ఉండటం, అందరితో కలివిడిగా ఉండటం తెలీకపోతే సమాజంలోనే జీవించడం రాదు. తనకు ఎవరూ లేరనుకోవడం ఒంటరితనం అయితే అందరూ ఉన్నా, తాత్కాలికంగా వారందరికీ దూరంగా పెట్టడం నిర్బంధ ఒంటరితనం. అందరూ ఉన్నా ఈ క్షణం నాకెవ్వరూ లేరు అనే నిరాశతోకూడిన ఒంటరితనం మరీ ప్రమాదకరం. ఒక మనిషిని ఒంటరిగా ఉంచ డం అంటే అతని స్వేచ్ఛను హరించడమే. అది మానసిక ఒత్తిడి కూడా. జైళ్లలో ఖైదీలు ఆచరించే కారాగార శిక్ష ఈ కోవకు చెందిందే. జైల్లో అయితే తప్పు చేసిన మని షికి ఏకాంతం కల్పించి, అతడి మానసిక పరివర్తనకు చేయూతనివ్వడం ద్వారా ప్రవర్తనలో మార్పు తీసుకురాగలమన్న విశ్వాసం ఉంటుంది. ఈ ప్రవర్తనలో మార్పు వారు భావి జీవి తంలో మరింత ఎదగడానికి ఉపయోగపడుతుంది
కానీ ఆ ఒంటరితనం అనుభవించే వ్యక్తి తానెందుకు ఇలా ఉండవలసి వస్తోంది అన్న ఆలోచనలోనే ఉంటారు. ముఖ్యంగా జీవితంపై ఆసక్తి తగ్గి, మెల్లిగా స్తబ్దత వైపు జరిగి నిర్మానుష్యమైపోతారు. కరోనా వైరస్ బాధితులనే తీసుకుందాం. విదేశాల నుంచి వచ్చినవారికి మొదటిరోజు జెట్ లాగ్ ఉంటుంది కాబట్టి, పూర్తిగా విశ్రాంతి అవసరం కాబట్టి క్వారంటైన్ చేసినా ఏమీ అనిపించదు. కానీ మర్నాటి నుంచి ఎలా అన్నదే సమస్య.
స్వదేశంలో స్వజనానికి చేరువలో ఉండీ, కలవకుండా ఉండటం ఒక రకమైన ఒత్తిడి. పైగా కరోనా నుంచి తప్పించుకుని దేశాలు దాటి సొంత ఊరికి వస్తే అక్కడ వారిని గృహనిర్బంధంలో ఉంచడం, ఆ ఏకాంతవాస కేంద్రాల్లో వారిని మనుషులుగా గుర్తించకుండా వివక్ష ప్రదర్శించడం, కనీస సౌకర్యాలను కూడా అందించకపోవడం, సరైన వేళకు తిండి, నీరు కూడా అందించకపోవడం.. ఇవన్నీ జైల్లో ఖైదీలకంటే తమ పరిస్థితి ఘోరంగా ఉంది అనే మానసిక కుంగుబాటుకు దారితీస్తుంది.
రోజువారీ జీవితంలో 24 గంటలూ నాలుగు గోడలకే పరిమితమై ఉండటమనే ఆలోచనే మని షికి సరిపడదు. అందుకే ఒక ఆరోగ్యసమస్య తగ్గాలని ప్రయత్నించడంలో మొట్టమొదట చేపట్టాల్సిన ప్రక్రియ ఏమిటంటే ఆ అనారోగ్యం లేక వైరస్ పెరగకుండా జాగ్రత్త తీసుకోవడం, ఇతరులకు తమ నుంచి అనారోగ్యం సోకకుండా నివారించడమే. కరోనా కారణంగా తప్పనిసరిగా ఇప్పుడు అమలవుతున్న ఒంటరితనానికి గురవుతున్నవారు ఇంట్లో ఉన్న అందరితో మాట్లాడాలి. బయటకు వెళ్లే పరిస్థితి ఉండదు కనుక ప్రశాంతంగా కూర్చోవడం, బ్రీతింగ్ ఎక్సర్‌సైజుతో గాలి గట్టిగా పీల్చి కాసేపు అలాగే ఉంచుకుని వదలడం ద్వారా ఒత్తిడి నుంచి ఉపశమనం కలుగుతుంది. ఇష్టమైన సంగీతం వింటే ట్రాయిటోఫన్ రసాయనం ప్రేరేపితమై రక్తపోటును తగ్గిస్తుంది. ఇప్పుడు ఎదుర్కొంటున్న ఒంటరితనం తాత్కాలిక సమస్య మాత్రమే. దీంతో పోలిస్తే మీ జీవితం శాశ్వతం కాబట్టి ప్రస్తుత సమస్యను, మీకు కలిగిన వ్యక్తిగత సంక్షోభాన్ని తట్టుకోగలమని విశ్వసించండి. చివరగా ఇతరులకు మేలు చేయడం ఒక కళ, అది సంతోషం కూడా. అదే వ్యక్తి ఆరోగ్యం. సమాజ ఆరోగ్యం కూడా.
వ్యాసకర్త : జవహర్‌లాల్ నెహ్రూ . పి
క్లినికల్ సైకాలజిస్టు
మొబైల్ : 98480 36040
Comments
Please login to add a commentAdd a comment