మార్కెట్లోంచి చైనాను తొలగించాలంటే... | Laxman Venkata Kuchi Guest Column On China Market | Sakshi
Sakshi News home page

మార్కెట్లోంచి చైనాను తొలగించాలంటే...

Published Wed, Jun 24 2020 12:37 AM | Last Updated on Wed, Jun 24 2020 12:38 AM

Laxman Venkata Kuchi Guest Column On China Market - Sakshi

భారత్‌–చైనా సరిహద్దులో 20 మంది ఇండియా సైనికుల్ని చైనా క్రూరంగా చంపేసిన ఘటనతో, భారతీయుల్లో జాతీయవాద ఉద్వేగాన్ని రెచ్చగొట్టినట్ట యింది. సరైన కారణంతో పెల్లుబికిన ఈ సహేతుకమైన ఆగ్రహజ్వాలలు చైనా వస్తువుల మీద వ్యతిరేకతకు దారి తీశాయి. అయితే, ఈ ఉద్వేగాగ్నికి ప్రయోజనం చేకూరాలంటే, చైనీయుల ఆయువు పట్టుపై దెబ్బ కొట్టాలి. దీనికి ఆలోచనాపూరితమైన వ్యూహం కావాలి. అప్పుడే ఆర్థికంగా చైనాను దెబ్బ తీయగలం. దీనికిగానూ మన వస్తూత్పత్తి శక్తి సామర్థ్యాలను గణనీయంగా పెంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

అయితే ఇది, గత రెండు దశాబ్దాల్లో మన దేశీయ మార్కెట్లో చైనా వస్తూత్పత్తి ప్రాభవానికి భారతీయ పరిశ్రమ ఎంతగా తలొగ్గిందనే కీలకమైన ప్రశ్నను ముందుకు తెస్తుంది. భారత స్వాతంత్య్ర పోరాటంలో బ్రిటిష్‌ ఆర్థిక సామర్థ్యాన్ని బలహీనపరిచినట్టుగా, ప్రస్తుతం నొక్కి చెబుతున్న ఆత్మనిర్భ రత ఇప్పుడు మరింత అత్యావశ్యం. లేదంటే టీవీ కెమెరాల ముందు చైనా తయారీ టీవీలు, ఫోన్లను ధ్వంసం చేయడం ప్రజల కోపాగ్నిని చూపే ఒక మనోరంజకమైన దృశ్యం కాగలదంతే.

గత రెండు దశాబ్దాల్లో భారతీయ మార్కెట్లో అత్యధిక భాగాన్ని వశం చేసుకున్న చైనా, దాన్ని  విçస్తృతమైన వస్తుశ్రేణి వరదలో ముంచెత్తింది. ఏ వినియోగదారుడికైనా ధర అనేది కీలకాంశం. 2000 సంవత్సర ప్రాంతంలో చైనా తన డ్రై పెన్సిల్‌ బ్యాటరీలను ఒక్కోదాన్ని 50 పైసల చొప్పున అమ్మకానికి దింపినప్పుడే ధరలో ఉన్న బలం ఏమిటో భారతీయ పరి శ్రమకు తెలిసొచ్చింది. అప్పుడు ఇండియన్‌ బ్రాండ్లు ఒక్కో దాన్ని రూ.8 నుంచి 10 వరకు అమ్ముతున్నాయి. చైనా వస్తువుల నాణ్యత నాసిరకందని భారతీయ పరిశ్రమ ఎంత ప్రచారం చేసినా అది వినియోగదారులకు ఏమాత్రం పట్టలేదు. పైగా భారతీయ పరిశ్రమ ఇన్నాళ్లుగా తమను అధిక ధరతో మోసం చేసిందన్న భావనకు అత్యధికులు లోనవడం భారత దేశీయ మార్కెట్‌ను మరింత దెబ్బతీసింది. దాంతో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు మార్కెట్‌ను చైనాకు కోల్పోవడంతో అవి నిలదొక్కుకోవడం కష్టమైపోయింది. అయితే కొద్దిపాటి పరిశ్రమలు మాత్రం దేశీయంగానే కాదు, అంతర్జాతీయ విపణి లోనూ చైనాను ఎదుర్కొని నిలబడ్డాయి.

అగ్రశ్రేణి మోటార్‌సైకిల్‌ తయారీదారైన బజాజ్‌ కంపెనీ దీనికి ఒక ఉదాహరణ. వీళ్లు మేధోకార్మికులకు అత్యధిక వేత నాలు చెల్లించారు; పరిశోధన–అభివృద్ధి(ఆర్‌ అండ్‌ డీ), డిజైన్, మార్కెటింగ్‌ కోసం అధికంగా ఖర్చు చేశారు. చైనా మీద పైచేయి సాధించారు. కానీ రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌లో ఉమ్మడిగా ఘోరంగా విఫలమై, సప్లై చైన్ల, టెక్నాలజీల దిగుమ తుల మీద ఆధారపడిన దేశీయ పరిశ్రమ చైనాను ఎదుర్కో గలదా? కనీసం దేశీయ మార్కెట్‌లోనైనా? బహువిధమైన వాణిజ్య ఒప్పందాల యుగంలో చైనా ఉత్పత్తులను నిషేధిం చడం ప్రభుత్వానికి సాధ్యం కాకపోవచ్చు. వివిధ రంగాల్లో చైనా మీద మనం ఎలా ఆధారపడివున్నామో చూడండి: స్మార్ట్‌ ఫోన్‌ మార్కెట్లో చైనా 72 శాతం వాటా కలిగివుంది, టెలికం పరి కరాల్లో 25 శాతం, స్మార్ట్‌ టీవీల్లో 45 శాతం, ఇంటర్నెట్‌ యాప్స్‌లో 66 శాతం, సౌర విద్యుత్‌లో 90 శాతం, స్టీలులో 18–20 శాతం, ఔషధరంగంలో 60 శాతం మార్కెట్‌ చైనా సొంతం. ఈ విభాగాల్లో ఆదరాబాదరగా చైనా స్థానంలోకి మరోదాన్ని భర్తీచేయడం చాలా కష్టం.

ఇలాంటి కీలక సమయంలో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు వాటి పూర్తిస్థాయి సామర్థ్యంతో పనిచేయలేకపోవడం బాధాకరం. అప్పటికే అంతంతమాత్రంగా ఉన్నవి 2016 నుంచీ వరుసగా తగులుతున్న దెబ్బలతో కోలుకోవడానికి పోరాడుతూవున్నాయి. ఇంతలో తలెత్తిన కోవిడ్‌–19 ఉపద్ర వమూ, తదనంతరం ప్రభుత్వం విధించిన కఠిన లాక్‌డౌన్‌తో లేవలేని ఆ తుదిదెబ్బ కూడా పడింది. ఈ తరహా పరిశ్రమలు మన దగ్గర 6.34 కోట్ల యూనిట్లు ఉండి, జీడీపీలో 30 శాతం మేరకు తోడ్పడుతున్నాయి. అలాగే ఉత్పత్తిలో 33 శాతం వాటా కలిగి వున్నాయి. కాబట్టి వీటిని బలోపేతం చేయడంలో సాయ పడటం ద్వారా దేశీయ మార్కెట్లో చైనాను ఎదుర్కొనేటట్టు చేయాలి. దేశ ఎగుమతుల్లో 45 శాతం వాటా కలిగివున్న ఈ రంగ ప్రాధాన్యత దేశ ఆర్థికవ్యవస్థ దృష్ట్యా విస్మరించలేనిది.

మోదీ ప్రభుత్వం ఈ రంగానికి కూడా ప్యాకేజీ ప్రకటించిన మాట వాస్తవమే గానీ, క్షేత్రస్థాయిలో ఈ కర్మాగారాలు నడిపే వారి అనుభవం పూర్తి నిరాశగా ఉంది. ఎంత సదుద్దేశంతో ఎన్ని ప్రభుత్వ పథకాలు ప్రారంభించినా, వాటి అమలుతీరు అంత కంటే కీలకం అవుతుంది. అధికారంలో ఎవరు ఉన్నారన్న దానితో నిమిత్తం లేకుండా, ప్రభుత్వ సేవలు లబ్ధిదారులకు అందడంలో నిరాశ కొనసాగుతూనేవుంది. ఇంకా ముఖ్యంగా, ఈ లోపభూయిష్టమైన బట్వాడా విధానం ప్రపంచానికే వస్తూ త్పత్తి కేంద్రం కావాలన్న భారత ప్రభుత్వ స్వప్నాలను పట్టాలు తప్పించవచ్చు. కానీ ప్రపంచంలోని అన్ని చోట్లకూ నౌకాయాన వసతి కలిగివున్న ఇండియాకు ద్వీపకల్పం పొడవునా ప్రపంచ వస్తూ త్పత్తి కేంద్రం కావడానికి దోహదపడే సానుకూల అంశాలెన్నో ఉన్నాయి.

లక్ష్మణ వెంకట్‌ కూచి
వ్యాసకర్త, సీనియర్‌ పాత్రికేయుడు

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement