ప్రత్యక్ష పన్నులపైనే ప్రత్యేక శ్రద్ధ | Nation Waiting For First Budget From Nirmala Sitharaman | Sakshi
Sakshi News home page

ప్రత్యక్ష పన్నులపైనే ప్రత్యేక శ్రద్ధ

Published Fri, Jul 5 2019 3:42 AM | Last Updated on Fri, Jul 5 2019 3:42 AM

Nation Waiting For First Budget From Nirmala Sitharaman - Sakshi

దేశచరిత్రలో తొలిసారిగా పూర్తిస్థాయి కేబినెట్‌ మంత్రిగా ఆర్థిక శాఖను నిర్వహిస్తున్న మహిళగా నిర్మలా సీతారామన్‌ సమర్పిస్తున్న తొలి బడ్జెట్‌ కావడంతో అటు అభివృద్ధి, ఇటు సంక్షేమం ప్రాతిపదికన దేశ గతిని ఆమె ఎలా నిర్వచించబోతున్నారనేది అందరికీ ఆసక్తి కలిగిస్తోంది. మోదీ తొలిదశ పాలనలో పెద్దనోట్లరద్దు, జీఎస్టీ వంటి భారీ సంస్కరణలకు బడ్జెట్లు ప్రాధాన్యం ఇవ్వగా, మలిదశ పాలనలో ప్రత్యక్ష పన్నుల కోడ్‌ అతి పెద్ద సంస్కరణగా అమలు కానుంది. ఈ మూడు సంస్కరణల లక్ష్యం దేశ ఆర్థిక వ్యవస్థను మరింత సంఘటితం చేయడమే. డిజిటల్‌ ఎకానమీ ఈ పయనంలో మరో ముందడుగు. యావద్దేశం నేడు నిర్మలా సీతారామన్‌ ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌పైనే దృష్టి నిలిపింది. ఆర్థికమంత్రిగా తన తొలి బడ్జెట్‌ ప్రసంగంలో ఆమె ప్రత్యక్ష పన్నుల కోడ్‌ని ప్రకటిస్తారా లేదా అనేదే అసలు ప్రశ్న. బడ్జెట్‌ సన్నాహకాల్లో భాగంగా స్వయంగా హల్వా వండి సిబ్బందికి రుచిచూపిన ఆర్థికమంత్రి దేశప్రజలకు కూడా ఆ తీపిలో కొంత రుచి చూపాలని అందరి ఆశ.

కేంద్ర బడ్జెట్‌ను లోక్‌సభలో ప్రవేశపెడుతున్నారని తెలియగానే దేశప్రజలందరికీ ఏదో తెలియని గుబులు, ఆందోళన కలగడం ప్రతి సంవత్సరం రివాజు. ఒక ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వ ప్రాథమ్యాలు ఏమిటో స్పష్టం చేసే బడ్జెట్‌ తమ జీవితాలపై చూపబోయే ప్రభావం గురించిన కొత్త ఆశలు, కొత్త భయాలు, సరికొత్త అంచనాలు ప్రతిసారీ దేశప్రజలకు అనుభవం అవుతూనే ఉంటాయి. అందులోనూ దేశచరిత్రలో తొలిసారిగా పూర్తిస్థాయి కేబినెట్‌ మంత్రిగా ఆర్థిక శాఖను నిర్వహిస్తున్న మహిళగా నిర్మలా సీతారామన్‌ సమర్పిస్తున్న తొలి బడ్జెట్‌ కావడంతో అటు అభివృద్ధి, ఇటు సంక్షేమం ప్రాతిపదికన దేశ గతిని ఆమె ఎలా నిర్వచించబోతున్నారనేది ఆసక్తి కలిగిస్తోంది. అందుకే ఒక సంవత్సర కాలంలో కేంద్ర ప్రభుత్వం సాధించే ఆదాయం, ఖర్చుల వివరణతోకూడిన బడ్జెట్‌కు తెరవెనుక జరిగే ప్రక్రియను తెలుసుకోవడం చాలా ఆసక్తిని కలిగిస్తుంది. మనదేశంలో బడ్జెట్‌ సమర్పణ ప్రక్రియ మొత్తం బ్రిటిష్‌ సాంప్రదాయాలకు అనుగుణంగానే సాగుతోంది. ఈ ప్రక్రియలో మారుతున్న కాలానికి అనుగుణంగా బ్రిటన్‌ ప్రభుత్వాలు బడ్జెట్‌ సంప్రదాయాలను కొన్నింటిని మార్చుకుంటున్నప్పటికీ భారత్‌లో మాత్రం 1860ల నాటి బ్రిటిష్‌ సాంప్రదాయం చెక్కుచెదరకుండా కొనసాగడం విశేషం. బ్రీఫ్‌కేస్‌లో బడ్జెట్‌ ప్రసంగపత్రాన్ని తీసుకురావడం అనేది బ్రిటిష్‌ సంప్రదాయ చరిత్రకు కొనసాగింపుగానే ఉంటోంది.

బడ్జెట్‌ సమర్పణకు ముందుగా ఆర్థికమంత్రి చేతిలో బ్రీఫ్‌కేస్‌తో ఫోటో దిగడం ఆనవాయితీగా వస్తోంది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన నరేంద్రమోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం నేడు కేంద్రబడ్జెట్‌ను లోక్‌సభలో ప్రవేశపెడుతోంది. దీనికి ముందుగా గురువారం పార్లమెంట్‌ వెలుపల ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ బడ్జెట్‌ బ్రీఫ్‌కేస్‌తో ప్రత్యక్షమవడం ఒక ప్రత్యేక సంప్రదాయాన్ని సూచి స్తోంది. ఈ ఫిబ్రవరి మొదట్లో గత ప్రభుత్వం తాత్కాలిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టినప్పుడు నాటి ఆర్థిక మంత్రి బడ్జెట్‌ బ్రీఫ్‌కేస్‌తో పార్లమెంటు వెలుపల దర్శనమిచ్చారు. ఈ లెక్కన చూస్తే నిర్మలా సీతారామన్‌ రెండోసారి బడ్జెట్‌ బ్రీఫ్‌కేస్‌తో ప్రత్యక్షమయ్యారు.

బ్రీఫ్‌కేస్‌ కథా కమామిషూ!
బడ్జెట్‌ బ్రీఫ్‌కేస్‌ అనే పేరులోనే అది బడ్జెట్‌తో ముడిపడి ఉన్న పదబంధమని తెలుస్తోంది. ఇది ఫ్రెంచ్‌ పదం బౌగెట్టీ నుంచి పుట్టింది. అంటే లెదర్‌ బ్యాగ్‌ అని అర్థం. ఈ బడ్జెట్‌ బ్రీఫ్‌కేస్‌లో ముద్రించిన బడ్జెట్‌ ప్రసంగ పత్రం ఉంటుంది. బడ్జెట్‌ ప్రసంగపత్రాన్ని లెదర్‌ బ్రీఫ్‌కేస్‌లో తీసుకురావడం అనే సంప్రదాయం 18వ శతాబ్దంలో మొదలైంది. నాటి బ్రిటన్‌ బడ్జెట్‌ చీఫ్‌ లేక ఆర్థిక మంత్రిని పార్లమెంటులో బడ్జెట్‌ను ప్రవేశపెట్టవలసిందిగా కోరడంతో ఈ సంప్రదాయం మొదలైంది. 1860లో నాటి బ్రిటన్‌ బడ్జెట్‌ చీఫ్‌ విలియన్‌ ఇ గ్లాడ్‌స్టోన్‌ తాను రూపొందించిన బడ్జెట్‌ ప్రసంగ పత్రాలను తీసుకురావడానికి ఎరుపురంగు బ్రీఫ్‌కేస్‌ను ఉపయోగించారు. గ్లాడ్‌ స్టోన్‌ తొలిసారిగా దీనిని ఉపయోగించారు కాబట్టి దానికి గ్లాడ్‌స్టోన్‌ రెడ్‌ బాక్స్‌ అని ముద్రపడిపోయింది. 2010 నాటికి గ్లాడ్‌స్టోన్‌ రెడ్‌ బాక్స్‌ రంగు వెలసిపోయింది. దీంతో అధికారికంగానే దానికి వీడ్కోలు పలికారు. కానీ భారత్‌లో మాత్రం ఈ సంప్రదాయాన్ని నేటికీ కొనసాగిస్తున్నారు. అయితే భారత బడ్జెట్‌ బ్యాగ్‌ రంగు ప్రతి సంవత్సరం మారుతున్నప్పటికీ అది 1860 నుంచి బ్రిటిష్‌ బడ్జెట్‌ సందర్భంగా ఉపయోగిస్తూ వస్తున్న రెడ్‌ గ్లాడ్‌ స్టోన్‌ బాక్స్‌కు నకలుగానే ఉంటూ వస్తోంది. అయితే భారత్‌లో ఈ సంప్రదాయం స్వాతంత్య్రానంతరం మొదలైంది. దేశ ప్రథమ ఆర్థిక మంత్రి ఆర్‌కే షణ్ముఖం చెట్టి 1947 నవంబర్‌ 26న స్వతంత్ర భారత ప్రథమ బడ్జెట్‌ను ప్రవేశపెట్టినప్పుడు ఈ బ్రీఫ్‌కేస్‌ సంప్రదాయం ప్రారంభమైంది. తర్వాత 1958లో నాటి ప్రధాని జవహర్‌ లాల్‌ నెహ్రూ బడ్జెట్‌ ప్రవేశపెట్టినప్పుడు తన ప్రసంగపాఠాన్ని నలుపురంగు బ్రీఫ్‌కేస్‌లో తీసుకొచ్చారు. 1991లో నాటి ఆర్థికమంత్రి మన్మోహన్‌ సింగ్‌ చారిత్రాత్మక బడ్జెట్‌ను సమర్పిం చినప్పుడు కూడా నల్ల బ్రీఫ్‌కేస్‌నే ఉపయోగించారు.

కానీ మన్మోహన్‌ సింగ్‌ ప్రధాని అయ్యాక ఆయన కేబినెట్‌లో ఆర్థిక మంత్రిగా వ్యవహరించిన ప్రణబ్‌ ముఖర్జీ మాత్రం బడ్జెట్‌ సమర్పణ సందర్భంలో ఎర్ర బ్రీఫ్‌కేస్‌ను తీసుకొచ్చారు. 2019లో తాత్కాలిక బడ్జెట్‌ను సమర్పించిన పీయూష్‌ గోయల్‌ కూడా ఎర్ర బ్రీఫ్‌కేస్‌ సంప్రదాయాన్నే కొనసాగించారు. అయితే భారతీయ ప్రభుత్వాలు బడ్జెట్‌ బ్రీఫ్‌కేస్‌ విషయంలో వలసపాలన వారసత్వాన్ని కొనసాగించినప్పటికీ ఈ చిన్న లెదర్‌ బ్యాగ్‌లో పొందుపర్చిన బడ్జెట్‌ ప్రసంగపత్రాలు మాత్రం దేశ ఆర్థిక వ్యవస్థ, అభివృద్ధి భవిష్యత్తును నిర్దేశించాయి. ఎన్డీఏ తొలిదఫా పాలనలో పెద్దనోట్ల రద్దు, జీఎస్టీ రూపంలో వచ్చిన ఆర్థిక సంస్కరణలు ఎంత సంచలనం కలిగించాయో తెలిసిందే. ఈ రెండింటి తర్వాత మోదీ ప్రభుత్వం తదుపరి భారీ సంస్కరణను ప్రత్యక్ష పన్నుల కోడ్‌ రూపంలో తీసుకురానుంది. ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ నేడు సమర్పించనున్న తొలి బడ్జెట్‌లో ప్రత్యక్ష పన్నుల కోడ్‌ గురించి ప్రస్తావించే అవకాశం ఉంది. ప్రత్యక్ష పన్నుల కోడ్‌ని తొలిసారిగా 2010లోనే పార్లమెంటులో ప్రవేశపెట్టారు కానీ 2014లో 15వ లోక్‌సభ రద్దు కాగానే ఈ బిల్లుకు కూడా కాలం చెల్లిపోయింది. కానీ 2017లో దీనిపై కొత్త టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పరిచారు. జూలై చివరినాటికి ప్రత్యక్ష పన్నుల కోడ్‌పై ముసాయిదా సిద్ధం కావచ్చని అంచనా వేశారు. గత తొమ్మిదేళ్లుగా వాయిదాపడుతూ వస్తున్న ప్రత్యక్ష పన్నుల కోడ్‌ మోదీ ప్రభుత్వం తీసుకురానున్న అతి పెద్ద పన్నుల సంస్కరణగా నిలువనుంది. ఈ ప్రత్యక్ష పన్నుల కోడ్‌తో ఇన్‌కమ్‌ టాక్స్‌ యాక్ట్‌–1969, వెల్త్‌ టాక్స్‌ యాక్ట్‌–1957 రెండూ కనుమరుగయ్యే అవకాశముంది.

2017 నవంబర్‌లో నాటి కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ ప్రత్యక్ష పన్నుల చట్టం రూపకల్పనకోసం ఆరుగురు సభ్యుల టాస్క్‌ఫోర్స్‌ని ఏర్పర్చారు. భారత ఆర్థిక వ్యవస్థ ప్రస్తుత వాస్తవికతకు అనుగుణంగా ఈ చట్టం ఉంటుందని భావిస్తున్నారు. మోదీ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత టాస్క్‌ ఫోర్స్‌ వ్యవధిని జూలై 31వరకు పొడిగించారు. ప్రస్తుతం అమలులో ఉన్న ప్రత్యక్ష పన్నుల చట్టం వ్యక్తిగత ఆదాయ పన్ను, కార్పొరేట్‌ పన్నుతోపాటు కేపిటల్‌ గెయిన్స్‌ టాక్స్‌ వంటి ఇతర ప్రత్యక్ష లెవీలతో వ్యవహరిస్తోంది. ఇక పరోక్ష పన్నులలో చాలావరకు 2017 జూలైలో అమల్లోకి వచ్చిన జీఎస్టీ (గూడ్స్‌ అండ్‌ సర్వీసెస్‌ టాక్స్‌)లో భాగమై ఉంటున్నాయి. కేంద్రప్రభుత్వం తాజాగా తీసుకొస్తున్న నూతన ప్రత్యక్ష పన్నుల చట్టం మరింతమంది పన్ను చెల్లింపుదారులను తన పరిధిలోకి తీసుకురావడం ద్వారా ప్రత్యక్ష పన్నుల యంత్రాగాన్ని విస్తృతం చేస్తుందని అంచనా వేస్తున్నారు. కార్పొరేట్‌ పన్నును 25 శాతానికి తగ్గించనున్నట్లు సమాచారం. ఇదే జరిగితే వాణిజ్యరంగం కొత్తపుంతలు తొక్కుతుందని అంతర్జాతీయ అనుభవం సూచిస్తోంది కూడా.

వాస్తవానికి ఈ ప్రత్యక్ష పన్నుల చట్టం మన్మోహన్‌ సింగ్‌ ప్రభుత్వ మానసపుత్రికగా చెప్పాలి. ఏడాదికి 2 లక్షల రూపాయల ఆదాయం ఉన్నవారికి పన్ను మినహాయింపును కల్పించాలని, రూ.5 లక్షల లోపు ఆదాయం ఉన్న వారిపై 10 శాతం పన్ను విధించాలని అప్పట్లో ప్రత్యక్ష పన్నుల కోడ్‌ బిల్‌ ప్రతిపాదించింది. ప్రస్తుతం దీనికి మోదీ ప్రభుత్వం పలు ప్రతిపాదనలను జతచేసింది కూడా. దీంట్లో భాగంగా సంవత్సరానికి రూ. 2.5 లక్షల లోపు ఆదాయం ఉన్న వారికి పన్ను మినహాయింపు కల్పించనున్నారు. గత ఫిబ్రవరిలో ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్‌లో రూ.5 లక్షల లోపు ఆదాయం ఉన్నవారికి పన్ను మినహాయించనున్నట్లు ప్రతిపాదించారు. అంటే ఏడాదికి 5 లక్షల రూపాయల లోపు ఆదాయం ఉన్నవారు ఎలాంటి ఆదాయ పన్నును చెల్లించనవసరం లేదన్నమాట. ప్రత్యక్ష పన్నుల కోడ్‌ టాస్క్‌ఫోర్స్‌ ప్రధాన కర్తవ్యం ఏమిటంటే పన్ను చెల్లింపును మెరుగుపర్చడమే. ఇప్పటికే మోదీ ప్రభుత్వం డిజిటల్‌ ఆర్థిక వ్యవస్థపై దృష్టి పెడుతున్నందున, ప్రత్యక్ష పన్నుల కోడ్‌ మరిన్ని ప్రోత్సాహకాలను ప్రతిపాదించనుందనే చెప్పాలి. పైగా జీడీపీలో పన్నుల వాటా అధిక స్థాయికి చేరుకోవడం అనేది ఆర్థికవ్యవస్థ పురోగతికి చిహ్నం. స్వీడన్‌లో జీడీపీలో పన్నుల వాటా 27.9 శాతంగా ఉండగా  న్యూజిలాండ్‌లో 27.8 శాతం, లగ్జెంబర్గ్‌లో 26 శాతం, నార్వేలో 22.5 శాతం నిష్పత్తి నమోదైంది. ఇక భారత్‌ వంటి ట్రిలియన్‌ డాలర్‌ ఆర్థికవ్యవస్థల్లో పన్నుల వాటా 11 శాతం మాత్రమే ఉంది.

కానీ, నిజమైన వ్య్తత్యాసం ప్రత్యక్ష పన్నుల నిష్పత్తిలోనే ఉంటోంది. ఉదాహరణకు, అమెరికాలో ప్రత్యక్ష పన్నులు మొత్తం పన్నుల వసూళ్లలో 80 శాతంగా ఉంటూండగా, గత సంవత్సరం పార్లమెంట్‌ శీతాకాలం సెషన్‌లో కేంద్ర ప్రభుత్వం స్వయంగా ప్రకటించినట్లుగా భారత్‌లో ప్రత్యక్ష పన్నుల వసూళ్లు 51 శాతం మాత్రమే. సంఘటిత ఆర్థిక వ్యవస్థ స్థితి విషయంలో కూడా దీన్ని జత చేయవచ్చు. భారత్‌లో సంఘటిత రంగంలో కేవలం 20 శాతం మంది మాత్రమే పనిచేస్తుండగా అమెరికాలో 93 శాతం మంది సంఘటిత రంగంలో ఉంటున్నారు. పెద్దనోట్ల రద్దు, జీఎస్టీ వంటి మోదీ ప్రభుత్వాన్ని తీవ్ర విమర్శల పాలు చేసిన రెండు అతిపెద్ద సంస్కరణల ఉద్దేశం కూడా దేశ ఆర్థిక వ్యవస్థను మరింత సంఘటితం చేయడమే. డిజిటల్‌ ఎకానమీ ఈ పయనంలో మరో ముందడుగు. ఇప్పుడు యావద్దేశం నేడు నిర్మలా సీతారామన్‌ ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌పైనే దృష్టి నిలిపింది. ఆర్థికమంత్రిగా తన తొలి బడ్జెట్‌ ప్రసంగంలో ఆమె ప్రత్యక్ష పన్నుల కోడ్‌ని ప్రకటిస్తారా లేదా అనేదే అసలు ప్రశ్న.

సుబ్రతో మహాపాత్ర, సీనియర్‌ జర్నలిస్టు
 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement