
సమాచార హక్కు చట్టాన్ని అమలు చేసేది ప్రభుత్వ విభాగాలే అయినా, వాటిని అమలు చేయించుకోవలసింది చైతన్యం ఉన్న పౌరులే. ఈ చట్టం నిర్మించిన మరొక వ్యవస్థ సమాచార కమిషన్. ఇది న్యాయస్థానాలతో సమం కాకపోయినా న్యాయమూర్తుల వలె నిష్పాక్షికంగా, న్యాయంగా, స్వతంత్రంగా వ్యవహరించవలసిన ఉన్నత వ్యక్తులను నియమించవలసిన సంస్థ. ఇది కేంద్ర ప్రభుత్వ సంస్థ కాదు. యూనియన్ ఆఫ్ ఇండియాకు చెందిన స్వతంత్ర వ్యవస్థ. హోంశాఖ విస్తృత పరిధిలోకి వచ్చినా ఇది ప్రభుత్వ విభాగం కాదు. ఉద్యోగులు శిక్షణ విభాగం (డిఓపిటి) సమాచార హక్కు అమలు బాధ్యత కలిగిన శాఖ. సీఐసీ దాని అనుబంధ కార్యాలయం కాదు. చట్టం సమాచార కమిషనర్‌కు ఉన్నత హోదా ఇచ్చింది. కేంద్ర ఎన్నికల కమిషన్‌తో సమానమైన స్థాయినిచ్చింది.
వీరు స్వతంత్రంగా ఆర్టీఐ చట్టాన్ని అమలు చేస్తేచాలు. ఆర్టీఐ చట్టం కూడా పేద్ద అధికారాలేమీ ఇవ్వలేదు. సమాచారం ఇవ్వండి అని ఆదేశించడమే ఈ కమిషన్ ఇవ్వగలిగిన ప్రభుత్వ వ్యతిరేక ఉత్తర్వు. సమాచారం ఇవ్వకపోయినా, నిరోధించినా గరిష్టం పాతికవేల రూపాయల జరిమానా చెల్లించాలని ఆదేశించవచ్చు. కేవలం సమాచారం ఇవ్వాలని ఉత్తర్వులు ఇచ్చినందుకే ప్రభుత్వాలు, నాయకులు, అధికారులు భయపడుతున్నారే? అయినా ఇవ్వతగిన సమాచారాన్ని ప్రభుత్వ శాఖలు తమంత తామే ఎందుకు ఇవ్వవు? వారిపై అధికారి తొలి అప్పీలు స్వీకరించి ఎందుకు ఇప్పించరు? ఇవి సామాన్యుడి ప్రశ్నలు. కొందరు వేధించే వారు ఉన్నారు. అనవసరంగా వందలాది ప్రశ్నలు గుప్పించేవారూ ఉన్నారు. అడిగిందే అడిగి ఎవరి మీదో పగతీర్చుకునే పనిచేసేవారూ ఉన్నారు. కేసును బట్టి నిజానిజాలను బట్టి వ్యవహరించవచ్చు. పిటిషన్ తిరస్కరించవచ్చు. కొన్ని వేధింపు అప్పీళ్లు ఉన్నంత మాత్రాన మొత్తం చట్టాన్ని చట్టుబండలు చేసే అధికారం, అవకాశం ఎవరికీ లేదు. చాలామంది సమాచారం ఇవ్వాలని ఉత్తర్వు వేస్తే ఏం కొంప మునిగిపోతుందో అన్నట్టు భయపడుతూ ఉంటారు. అదే అసలు సమస్య.
సమాచారం వెల్లడిస్తే ఏవో సమస్యలువస్తాయని ఊహించి భయపడి, సమాచారం ఇవ్వద్దనడంలో ఎంత న్యాయం ఉంది? చట్టం చేసే ముందు ఇటువంటి అధికారులు, సెక్రటరీలు, మంత్రులు ప్రధాన మంత్రి, పార్లమెంటు సభ్యులు ప్రతిపదాన్ని పరీక్షించి చర్చించి మినహాయింపు సెక్షన్లు రచించి, అన్ని సమస్యలను ఆ మినహాయింపుల పరిధిలో నిరాకరించడం ద్వారా తీరుతాయని నిర్ధారించుకున్న తరువాత ఇంకా అనూహ్యమయిన సమస్యలు ఉంటాయంటే ఆ మాటకు అర్థంపర్థం ఉందా? ఈ విధంగా ఊహాత్మక భయాలతో సమాచారం దాచి పెట్టాలని ప్రయత్నించే మాజీ అధికారులు ఈ చట్టం కింద కమిషనర్లుగా నియమితులు కావడం కరెక్టేనా అని అనుమానం. ప్రభుత్వ ఫైళ్లలో దాగిన సమాచారాన్ని వెల్లడిస్తే నేరుగా అధికారులు, మంత్రులు జైళ్లకి వెళ్లిపోతారా? సమాచారం అటువంటిదే అయితే దాన్ని దాచడం నేరం కాదా?
ఈ విధంగా వెల్లడిచేయడానికి భయపడే కమిషనర్లు మనకు అవసరమా? వారినెందుకు నియమిస్తున్నారు? వారినే ఎందుకు నియమిస్తున్నారు? అని అడిగే అధికారం ధైర్యం హక్కు ప్రజలకు ఉందా? లేకపోతే అవన్నీ తెచ్చుకోవాలి. అడగాలి. మాజీ అధికారులను మాత్రమే కమిషన్‌లో నియమించాలని ఆర్టీఐ చట్టం చెప్పలేదు. పార్లమెంటరీ కమిటీలో కూడా చెప్పలేదు. ప్రతి పదంపైన, ప్రతి అక్షరం గురించి జరిగిన చర్చోపచర్చల్లో ఈ హక్కు కోసం పోరాడిన వారు కూడా కమిషన్లు మాజీ అధికారుల భోజ్యభోగ్య పదార్థాలుగా మారతాయని ఊహించలేదు. మాజీ రాజకీయ నాయకులు, మాజీ జడ్జిలకు వృద్ధాశ్రమాలుగా కమిషన్లు మారకుండా చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. కానీ ఈ పదవులను ఎక్కువగా మాజీ అధికారులే ఎగరేసుకు పోతారని, తమ అనుంగు సహచరులుగా మెలగి, అనుయాయులుగా> ఉంటారని, వెన్నెముకను మేధస్సును తమ ప్రయోజనాలకు వ్యతిరేకంగా వాడబోరని పూర్తి నమ్మకం కుదిరిన తరువాత అటువంటి వారినే ఎంపిక చేయాలని ప్రభుత్వాలు నిర్ణయిస్తాయని కూడా ఆర్టీఐ చట్టాన్ని కోరుకున్న వారు అనుకోలేదు. ఎవరికోసం అనుకున్న ఈ కమిషన్లు ఎవరికి దక్కాయి? మాజీ బ్యూరోక్రాట్లు హైజాక్ చేయడానికా ఈ చట్టం వచ్చింది? బడాబాబుల డాబుసరి బడాయికోసమా? కానే కాదు.
వ్యాసకర్త : మాడభూషి శ్రీధర్, కేంద్ర సమాచార కమిషనర్
professorsridhar@gmail.com
Comments
Please login to add a commentAdd a comment