విధాన నిర్ణయాలపై అనవసర గోప్యత పాటించటం, నిజాలు రాబట్టే ప్రయత్నాలకు పాతరేయటం ప్రజాస్వామ్యానికి చేటు తెస్తుంది. సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) పుట్టి దాదాపు రెండు దశాబ్దాలు గడిచింది. లోటుపాట్లు సరిదిద్దుకుంటూ మరింత పదునెక్కాల్సిన ఆ చట్టం కాస్తా ప్రభుత్వాల పుణ్యమా అని నానాటికీ నీరుగారుతోంది. తాజాగా ఆ చట్టం తమకు వర్తించదంటూ జవాబిచ్చి మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఆ జాబితాలో చేరింది. షోపూర్ జిల్లా కునోలో ఉన్న వన్యప్రాణి సంరక్షణకేంద్రం, మాందసార్ జిల్లాలో నెలకొల్పబోయే మరో వన్యప్రాణి సంరక్షణ కేంద్రాల గురించి, ముఖ్యంగా చిరుతల సంరక్షణకు తీసుకుంటున్న చర్యల గురించి సమాచారం కావాలంటూ అడిగిన సమాచార హక్కు కార్యకర్త అజయ్ దూబేకు కళ్లు తిరిగి కింద పడేలా ప్రభుత్వ అటవీ విభాగం సమాధానమిచ్చింది.
అలాంటి సమాచారం వెల్లడిస్తే దేశ భద్రతకూ, సార్వభౌమత్వానికీ ముప్పు ఏర్పడుతుందట. దేశ సమగ్రత, వ్యూహాత్మక, ఆర్థిక ప్రయోజనాలు దెబ్బతింటాయట. వేరే దేశంతో సంబంధాలు కూడా దెబ్బతినవచ్చట. కాబట్టి చట్టంలోని సెక్షన్ 8(1)(ఏ) ప్రకారం ఇవ్వడం కుదర దట. ఒక చిరుత కూన కాలికి కట్టు కట్టినట్టున్న ఫొటో చూసి మొన్న ఫిబ్రవరిలో పులుల జాతీయ సంరక్షణ ప్రాధికార సంస్థకు దూబే ఫిర్యాదు చేశాడు. ఎట్టకేలకు అటవీశాఖ స్పందించింది. కానీ ఆ సమాచారం వెల్లడిస్తే మిన్ను విరిగి మీదపడుతుందన్న స్థాయిలో సమాధానమిచ్చింది.
ప్రభుత్వాల పనితీరుపై అవధుల్లేని సమాచారం పౌరులకు లభ్యమైనప్పుడే ప్రజాస్వామ్యానికి పునాదిగా భావించే స్వేచ్ఛ, సమానత్వాలు సాధించుకోవటం, వాటిని కాపాడుకోవటం సాధ్యమవు తుందని జగజ్జేత అలెగ్జాండర్‌కు గురువైన గ్రీకు తత్వవేత్త అరిస్టాటిల్ చెబుతాడు. అరిస్టాటిల్ క్రీస్తు పూర్వం రెండో శతాబ్దినాటివాడు. సమాచారం ఇవ్వటానికి ససేమిరా అంటున్న మన ప్రభుత్వాలు మానసికంగా తాము ఏకాలంలో ఉండిపోయామో తెలుసుకోవటం ఉత్తమం. ఇప్పుడే కాదు... 2005లో ఆర్టీఐ చట్టాన్ని తీసుకొచ్చినప్పుడే దేశభద్రత పేరు చెప్పి 22 సంస్థలకు మినహాయింపు ఇచ్చి దాని స్ఫూర్తిని దెబ్బతీశారు.
తర్వాత కాలంలో ఆ జాబితా పెరుగుతూ పోయింది. ఆర్టీఐ పరిధి లోకి రాబోమని వాదించే వ్యవస్థలు, విభాగాలు ఎక్కువవుతున్నాయి. రాజకీయ పార్టీలు మొదలు కొని న్యాయవ్యవస్థ వరకూ ఇందులో ఎవరూ తక్కువ తినలేదు. పారదర్శకత తమవల్ల కాదని అందరికందరూ నిర్మొహమాటంగా చెబుతున్నారు. అసలు ఏ సమాచారమైనా కోరితే 30 రోజుల్లో దాన్ని అందజేయాలని ఆర్టీఐ నిబంధనలు నిర్దేశిస్తున్నాయి. అది ఎక్కడా అమలవుతున్న దాఖలా లేదు.
అప్పీల్ కోసం వెళ్తే అక్కడ మరో కథ. చాలా రాష్ట్రాల్లో సమాచార కమిషనర్లు, ఇతర సిబ్బంది తగినంతమంది ఉండటం లేదు. కొన్నిచోట్ల ప్రధాన కమిషనర్ల జాడలేదు. అయిదేళ్ల క్రితం కేంద్ర ప్రభుత్వం కేంద్ర రాష్ట్ర ప్రధాన సమాచార కమిషనర్ల, కమిషనర్ల పదవీకాలం, వారి జీతభత్యాలు, సర్వీసు నిబంధనలు రూపొందించే నిర్ణయాధికారాన్ని తన చేతుల్లోకి తీసుకుంటూ ఆర్టీఐకి సవర ణలు తెచ్చింది. ఈ సవరణలు సహజంగానే సమాచార కమిషన్ వ్యవస్థల స్వయంప్రతిపత్తిని దెబ్బ తీశాయి. పార్లమెంటులో తగిన సంఖ్యాబలం ఉన్నది కనుక చట్ట సవరణలకు సులభంగానే ఆమోదం లభించింది. కానీ సంబంధిత వర్గాలతో మాట్లాడాకే ఆ సవరణలు తీసుకురావాలన్న కనీస సంప్రదాయాన్ని పాలకులు విస్మరించారు. పౌరులు ప్రధానంగా ప్రభుత్వాల నుంచే సమాచారం రాబట్టాలని కోరుకుంటారు.
ఆ ప్రభుత్వమే రకరకాల ప్రయత్నాలతో దానికి అడ్డుపుల్లలు వేయ దల్చుకుంటే ఇక ఆ చట్టం ఉండి ప్రయోజనమేమిటి? ఆర్టీఐ తీసుకొచ్చిన ఆనాటి ప్రధాని మన్మోహన్ సింగే తర్వాత కాలంలో దాన్ని ‘మితిమీరి’ వినియోగిస్తున్నారంటూ మండిపడ్డారు. పార్టీలకు అతీతంగా పాలకులందరిదీ ఇదే బాణీ. పాలనలో పారదర్శకత కోసం, ప్రభుత్వాలకు జవాబుదారీతనం పెంచటం కోసం వచ్చిన చట్టం హద్దులు దాటుతున్నదని పాలకులతోపాటు ఉన్నతాధికార గణం కూడా విశ్వసిస్తోంది. ఆర్టీఐని వమ్ము చేయటానికి ప్రయత్నిస్తూనే ఉన్నారు. కనుకనే సమాచారం కోరినవారి ఆనుపానులు క్షణాల్లో అవతలివారికి వెళ్తున్నాయి. సమాచార హక్కు ఉద్యమకారుల ప్రాణాలు గాల్లో దీపాలవుతున్నాయి. ఇప్పటివరకూ వందమందికి పైగా కార్యకర్తలను దుండగులు హత్యచేశారు.
ఈ ఏడాది మొదట్లో ఎలక్టోరల్ బాండ్స్ కేసులో సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పు పౌరుల సమాచార హక్కు ప్రాధాన్యతనూ, ప్రజాస్వామ్యంలో అది పోషించే కీలకపాత్రనూ తెలియజెప్పింది. రాజ్యాంగదత్తమైన ప్రాథమిక హక్కుల్లో దాన్నొకటిగా గుర్తించింది. ఏదైనా చట్టం వచ్చిన ప్పుడు దాన్ని సద్వినియోగం చేసుకునే వారున్నట్టే దుర్వినియోగం చేద్దామనీ, స్వప్రయోజనాలు సాధించు కుందామనీ ప్రయత్నించేవారు ఉంటారు. అంతమాత్రంచేత ఆ చట్టాన్ని నీరుగార్చ కూడదు. కార్గిల్ అమర జవాన్ల కుటుంబాలకు ఉద్దేశించిన ఆదర్శ్ హౌసింగ్ సొసైటీలోకి రాజకీయ నేతలు, ఉన్నతాధికారులు చొరబడి ఫ్లాట్లు కొట్టేసిన వైనం ఆర్టీఐ చట్టం లేకపోయివుంటే బయటి కొచ్చేదే కాదు.
అలాగే మధ్యప్రదేశ్‌లో వ్యాపమ్ కుంభకోణం, పశ్చిమ బెంగాల్‌లో టీచర్ రిక్రూట్ మెంట్ల అక్రమాలు ఎప్పటికీ వెలుగుచూసేవి కాదు. వ్యక్తులుగా ఎవరైనా దుర్వినియోగానికి పాల్పడితే శిక్షించే విధంగా నిబంధనలు తెస్తే తప్పులేదు. కానీ ఆ సాకుతో మొత్తం చట్టాన్నే నీరుగార్చాలని చూడటం, దేశ భద్రత పేరు చెప్పి అందరినీ బెదరగొట్టడం ప్రమాదకరమైన పోకడ. ఇలాంటి చర్యలు ప్రజాస్వామ్యాన్నీ, జవాబుదారీతనాన్నీ దెబ్బతీస్తాయి. నిరంకుశత్వానికి బాటలు పరుస్తాయి.
Comments
Please login to add a commentAdd a comment