![Sayli Udas Mankikar Article On Dharavi - Sakshi](/styles/webp/s3/article_images/2020/04/11/DHARAVI.jpg.webp?itok=aPhYCBJT)
ఆసియాలోనే అతిపెద్ద మురికివాడగా పేరొందిన ధారవి కోవిడ్–19 విషయంలో పేలనున్న టైమ్‌బాంబ్‌లా ఉంటోంది. దేశంలోనే అత్యంత ఇరుకైన, కిక్కిరిసిన జనాభాతో కూడిన ధారవి మురికివాడలో 10 లక్షల మంది జనాభా నమ్మశక్యం కానంత ఇరుకు గుడిసెల్లో ఉండటం వల్ల ముంబై నగరంలో వైరస్ ఉత్పత్తి కేంద్రంగా ఉంటూ భయాందోళనలు కలిగిస్తోంది. ప్రభుత్వం, ఆరోగ్య కార్యకర్తలు, పౌర సమాజం ఈ ప్రత్యేక భౌగోళిక పరిస్థితులు కలిగిన ప్రాంతంలో వైరస్ నియంత్రణతో ఎలా వ్యవహరించాలనే విషయమై మల్లగుల్లాలు పడుతున్నారు. ఇంతవరకు ఇక్కడ చేసిన కృషి ఏమాత్రం సరిపోదు. ఒక్క మాటలో చెప్పాలంటే ధారవిని య«థాతథ స్థితికి తీసుకురావడం ప్రభుత్వ యంత్రాంగానికి, పౌర సమాజానికి అతి పెద్ద సవాలుగా మారనుంది.
ఆసియాలోనే అతిపెద్ద మురికివాడగా పేరొం దిన ధారవిలో కరోనా వైరస్ వ్యాప్తిపై పోరాడేందుకు అతివేగంగా మాస్ పరీక్షలు చేయడం, భారీ మౌలిక వైద్య వ్యవస్థను ఏర్పర్చడం ఇప్పుడు మహారాష్ట్ర ముందున్న అతి పెద్ద సవాలు. ముంబై పురపాలక సంస్థ నుంచి 274 మంది కమ్యూనిటీ హెల్త్ కేర్ కార్మికులు, ఆరు వైద్య బృందాలు, శానిటరీ ఇన్‌స్పెక్టర్లు, మరో 200 మంది సిబ్బంది ధారవిలో కోవిడ్–19 కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఆ మురికివాడపై దృష్టి సారించారు. ఈ ప్రాంతంలో ఇప్పుడు తక్షణ సవాళ్లు ఏవంటే.. వివిధ సామాజిక బృందాలకు శరవేగంతో భారీ స్థాయిలో వైద్య పరీక్షలు నిర్వహించడం, కొత్త ఐసోలేషన్, వైద్య మౌలిక వ్యవస్థలను సిద్ధం చేసుకోవడమే. కరోనా వైరస్ రోగి మృతి చెందాక మహారాష్ట్ర ప్రభుత్వం వీటిని యుద్ధ్దప్రాతిపదికన ఏర్పర్చడానికి ప్రయత్నాలు చేస్తోంది. మెడికల్ స్టాండర్డ్స్ కౌన్సిల్ ఆమోదించిన వెంటనే ర్యాపిడ్ టెస్టింగ్ యూనిట్లను కూడా ధారవికి పంపుతామని రాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే చెప్పారు.
239 హెక్టార్ల విస్తీర్ణంలో దాదాపు పది లక్షలమంది జనాభాకు నెలవుగా ఉన్న ధారవిని కరోనా వైరస్ వ్యాప్తికి సంబంధించి హైరిస్క్ జోన్‌గా, ముంబై మహానగరానికే సాంక్రమిక వ్యాధికి చెందిన ఎపిసెంటర్‌గా ముంబై పురపాలక సంస్థ గుర్తించింది. ముంబై మహారాష్ట్ర రాజధాని. భారత్‌లోనే అత్యధిక సంఖ్యలో కోవిడ్–19 రోగులు నమోదైన రాష్ట్రమిది. వారం రోజుల క్రితమే అంటే ఏప్రిల్ 1న ధారవిలో తొలి కోవిడ్–19 మరణం నమోదైంది. మార్చి 23న జ్వరం రావడంతో రోగి సమీపంలోని సియోన్ ప్రభుత్వ ఆసుపత్రిలో చేరాడు. అప్పటినుంచి ధారవిలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఏప్రిల్ 8 నాటికి, ధారవిలో 9 కరోనా కేసులను నిర్ధారించారు. వీరిని ఈ ప్రాంతంలోనే ఉన్న రాజీవ్ గాంధీ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో రూపొందించిన ఐసోలేషన్ వార్డులకు తరలించారు. స్థానికుల వినోదానికి రూపొందించిన ఈ కాంప్లెక్స్‌ను రాత్రికి రాత్రే 300 పడకలతోకూడిన ఐసోలేషన్ కేంద్రంగా మార్చేశారు. ఇరుగుపొరుగున ఉన్న డాక్టర్ బలిగానగర్, వైభవ్ అపార్ట్‌మెంట్, ముకుంద్ నగర్, మదీనా నగర్, ధన్‌వాడ చావల్ ప్రాంతాల్లో ఇప్పటికే 5 వేలమందిని క్వారంటైన్ చేశారు. ధారవిలో 150 చదరపుటడుగుల నివాస ప్రాంతంలో వ్యాపార కార్యకలాపాలు సాగించే 85 క్లస్టర్లున్నాయి. ఈ ఇళ్లలో సగటున ఆరుమంది నివసిస్తుంటారు.
ఈ ప్రాంతంలో 25 శాతం మేరకు పక్కా నిర్మాణాలు ఉండి ఇక్కడ 20 వేల చిన్నతరహా వర్క్ యూనిట్లు పనిచేస్తున్నాయి. తోలు ఉత్పత్తుల ఎగుమతులు, జౌళి, జరీ పని, గ్లాస్ పని, కుండల తయారీ, రీసైకిలింగ్ వంటి వృత్తులు ధారవిలో వంద కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థకు దన్నుగా నిలుస్తున్నాయి. ఇక్కడి నివాస ప్రాంతాల్లో కమ్యూనిటీ టాయ్‌లెట్లు ఉన్నాయి. ఒక్కో టాయ్‌లెట్‌ని దాదాపు 1400 మంది ఉపయోగించుకుంటున్నారు. ఇక్కడ కరోనా రోగి 400 చదరపుటడుగుల విస్తీర్ణం గల ఇంటిలో 8 మంది కుటుంబ సభ్యులతో నివసించేవాడు. ఇటీవలే ఇక్కడ మసీదుని సందర్శించి పలువురు వ్యక్తులను కలిసి ప్రార్థనలు చేసిన 10 మంది తబ్లిగీ జమాత్ సభ్యులకు అతడు ఆశ్రయమిచ్చాడు.
ఆ తర్వాతే అతడికి కరోనా సోకింది. దాంతో అతడు సంబంధం పెట్టుకున్న 74 మందిని క్వారంటైన్ చేశారు. భౌతిక దూరం పాటించడానికి అతికష్టమైన భౌగోళిక పరిస్థితులు కలిగిన ఇరుకైన ప్రాంతమైన ధారవిలో వ్యక్తుల కాంటాక్టుల జాడ పట్టుకోవడం చాలా కష్టమైన పని. అందుకే పురపాలక సంస్థ వార్డు ఆఫీసర్ కిరణ్ దివాకర్ నేతృత్వంలోని టీమ్ కరోనా రోగివల్ల ప్రమాదంలో పడిన బాధితుల జాడ పట్టడానికి సులువైన వర్క్ నమూనాను రూపొందించుకుంది. ప్రాంతాలను ఐసోలేట్ చేయడం, వారికి అవసరమైన నిత్యావసర సరుకులను వారి ఇళ్లవద్దకే తెచ్చివ్వడం సాగించారు. అయితే భవనాల్లో నివసిస్తున్న వారికి ఈ మోడల్ కాస్త విభిన్నంగా ఉంటుంది.
భవనాల్లో ఉంటున్నవారు ఒక మోస్తరు వ్యాధి లక్షణాలను కలి గివుంటే అలాంటివారిని తమ ఇళ్లలోనే ఉంచేస్తున్నారు. అయితే మొత్తం భవనాలను మాత్రం సీల్ చేస్తున్నారు. ఇక మురికివాడలో గుడిసెల్లో ఉంటున్నవారిని ఐసోలేట్ చేయడం అసంభవం. ఎందుకంటే ఇరుకైన ప్రాంతంలో ఇక్కడ జనాభా కిక్కిరిసిపోయి ఉంటుంది. పైగా అనేకమంది ప్రజలు తమ ఇళ్ల బయట నిద్రపోతుంటారు. పైగా ఉమ్మడిగా పారిశుద్ధ్య వసతులను ఉపయోగించుకోవడం అనేది వైరస్ వ్యాప్తికి అతిపెద్ద కేంద్రంగా ఉంటోంది. ఇక్కడ వ్యాధి సోకినవారిని వెంటనే ఐసోలేషన్‌కు పంపించాల్సి ఉంది. అందుకే ధారవిలోని అయిదు ఐసోలేటెడ్ ఏరియాల్లో ఫీవర్ క్లినిక్‌లను లేదా హెల్త్ క్యాంపులను నగరపాలక సంస్థ ఏర్పర్చింది. అనుమానిత కేసులన్నింటినీ ఇక్కడికే తీసుకువస్తున్నారు. కోవిడ్–19 కేసుల్లో పాజిటివ్‌గా తేలినవారితో సంబంధంలోకి వచ్చిన వారిని కూడా ఇక్కడికే తీసుకొస్తున్నారు. ఈ క్యాంపులకు రోజుకు సగటున 50 మంది అనుమానితులను తీసుకొస్తున్నారు.
ప్రతి అనుమానిత రోగిని డాక్టరు, పురపాలక అధికారి ఇంటర్వూ్య చేస్తారు. డాక్టరేమో పరీక్షలతో వైద్య ప్రక్రియను ప్రారంభిస్తారు. ఇక పురపాలక అధికారి ఆ రోగితో సంబంధం ఉన్న వారి జాడను కనుగొనడానికి ప్రయత్నిస్తారు. ఆరోగ్య కార్యకర్తలను స్థానిక ఎన్జీవోలు ఆ రోగితో కాంటాక్టులోకి వచ్చిన వారికోసం ఇల్లిల్లూ తిరిగి సమాచారం సేకరిస్తారు. వీళ్లందరికీ పరీక్షలు జరిపాక వారిలోని వ్యాధి లక్షణాల తీవ్రతను బట్టి వారిని ఇళ్లలోనే ఉండమని చెబుతారు. ఒక మోస్తరు లక్షణాలున్నవారిని రాజీవ్ గాంధీ కాంప్లెక్స్‌కు పంపుతారు. లేదా కొత్తగా నిర్మించిన సాయి హాస్పిటల్‌కు తీవ్రస్థాయిలో ఉన్న కేసులను పంపుతున్నారు. దాదాపు 51 పడకలు ఉన్న ఈ ప్రైవేట్ హాస్పిటల్‌లో 8 ఐసీయూ బెడ్లు, డాక్టర్లతో కూడి ఉంది. దీన్ని నెలకు 30 లక్షల రూపాయలకు ముంబై పురపాలక సంస్థ లీజుకు తీసుకుంది. సీరియస్ కేసులను ఇక్కడికే పంపుతున్నారు.
ప్రజలను తమ ఇళ్లలోనే ఉండేలా క్వారంటైన్ చేయడం, వారి రోజువారీ రేషన్ సరుకులను ఉచితంగా అందించడం అనేది ఏకకాలంలోనే కొనసాగిస్తున్నారు. నగరంలోని వ్యాపార వర్గాలు, వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన విరాళాల ద్వారా మునిసిపల్ కార్పొరేషన్ దీన్ని నిర్వహిస్తోంది. ఐసోలేట్ చేసిన అన్ని ఇళ్లకూ బియ్యం బస్తాలు, ఉల్లిపాయలు, టమాటాలు, ఆయిల్ ప్యాకెట్లు పంపిణీ చేస్తున్నారు. పలువురు ఎన్జీవోలకు చెందిన వారు కూడా ప్రజలకు ఆహారం అందిస్తున్నారు. 150 మంది కార్మికులతో కూడిన శానిటరీ ఇన్‌స్పెక్టర్లు రోజూ చెత్త ఏరివేయడం, ఇళ్లలో, రూముల్లో, భవనాల్లో ఇన్ఫెక్షన్లు రాకుండా క్రిమిసంహారక మందులను స్ప్రే చేయడం, మురికికాలువలను క్లీన్‌గా ఉంచడం వంటి విధులను నిర్వహిస్తున్నారు.
కరోనా వైరస్ నివారణకు సంబంధించిన అన్ని ప్రొటోకాల్స్‌ని అమలు చేస్తూ బాధ్యతగా వ్యవహరిస్తున్నప్పటికీ ఈ క్లినిక్కులలో పనిచేస్తున్న వారు తమ ఆందోళనలను వ్యక్తపరుస్తున్నారు. ర్యాపిడ్ టెస్టులను భారీ స్థాయిలో చేయడం అనేదే ఇప్పుడు ఏకైక కార్యక్రమంగా ఉంటున్నప్పటికీ గుడిసెల్లో ఉంటున్న వారు కరోనా వైరస్‌కు కేంద్రాలుగా ఉంటున్నందున ధారవి వంటి మురికివాడల్లో ప్రత్యేకించి మాస్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లను ఏర్పర్చాల్సిన అవసరం ఉందని వీరు చెబుతున్నారు. పోలీసు బలగాలు కూడా భారీ స్థాయిలో ధారవిలో మోహరించారు కానీ చిన్న చిన్నగదుల్లో నివసిస్తున్న ప్రజలను నిర్బంధంలో ఉంచటం చాలా కష్టంగా ఉంటోంది.
ప్రత్యేకించి టాయ్‌లెట్స్ ఉమ్మడిగా ఉపయోగించుకోవడం, ఇళ్లకు బయట ఉంటున్నందున ఇక్కడి ప్రజలను అటూ ఇటూ తిరగకుండా నియంత్రించడం చాలా కష్టమైన పని అని పోలీసు అధికారులు చెబుతున్నారు. అందుకే ధారవి మురికివాడ కోవిడ్–19 విసురుతున్న పెను సవాలుకు సంబంధించి టైమ్ బాంబులాగా ఉంటోందని వర్ణిస్తే ఏమాత్రం అతిశయోక్తి లేదు. ఇంతవరకు ఇక్కడ చేసిన కృషి ఏమాత్రం సరిపోదు. ప్రభుత్వం, ఆరోగ్య కార్యకర్తలు, పౌర సమాజం ఈ ప్రత్యేక భౌగోళిక పరిస్థితులు కలిగిన ప్రాంతంలో వైరస్ నియంత్రణతో ఎలా వ్యవహరించాలనే విషయమై మల్లగుల్లాలు పడుతున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే ధారవిని యథాతథ స్థితికి తీసుకురావడం ప్రభుత్వ యంత్రాంగానికి, పౌర సమాజానికి అతి పెద్ద సవాలుగా మారనుంది.
సాయ్లి ఉదాస్ మన్కికర్
వ్యాసకర్త సీనియర్ జర్నలిస్టు
Comments
Please login to add a commentAdd a comment