కంటికి కనిపించని శత్రువు మనకి సవాల్ విసిరి ఏడాదైంది. కేరళలో తొలి కరోనా కేసు వెలుగులోకి వచ్చి ఇవాళ్టికి సరిగ్గా ఏడాదైంది. జనాభాతో కిటకిటలాడే భారత్‌లో కరోనా బాంబు విధ్వంసం సృష్టిస్తుందని అందరూ అంచనా వేశారు. ఆసియాలో అతి పెద్ద మురికివాడ ముంబైలోని ధారావిలో తొలికేసు నమోదు కాగానే భారత్ పనైపోయిందని భావించారు. కానీ అందరి అంచనాలు తలకిందులయ్యాయి. అగ్రరాజ్యాలే ఇంకా కరోనా పడగ నీడలో భయం భయంగా బతుకు వెళ్లదీస్తూ ఉంటే, మనం అన్నీ తట్టుకొని ఇప్పుడిప్పుడే నిలబడుతున్నాం. కరోనా మానవాళికి ఎన్నో పాఠాలు నేర్పింది. ఆ పాఠాలే గుణపాఠాలుగా మార్చుకొని పడిలేచిన కడలితరంగంలా పైకి లేస్తున్నాం. కరోనాతో కలిసి చేసిన ఈఏడాది ప్రయాణాన్ని ఒక్కసారి చూద్దాం..
కంటికి కనిపించని సూక్ష్మక్రిమి ఏడాదిలో మన జీవన చిత్రాన్ని మార్చేసింది. ఎంతలా అంటే కరోనాకి ముందు కరోనా తర్వాత అని నిర్వచించుకునేలా మారి పోయింది. అమెరికా, యూరప్ వంటి దేశాలు సెకండ్ వేవ్, థర్డ్ వేవ్‌తో చిగురుటాకులా వణికిపోతూ ఇంకా ఇళ్లలోనే మగ్గిపోతూ ఉంటే మనం మాత్రం ఆర్థికంగా బలోపేతం కావడానికి అవసరమయ్యే వ్యూహరచనలో మునిగి ఉన్నాం. కరోనాపై పోరాటం తుది దశకు వచ్చేసింది. ఏడాదిలోనే దాని కొమ్ములు విరిచేసి ప్రపంచ దేశాల్లో రొమ్ము విరుచుకొని భారత్ ఠీవిగా నిలబడింది. రోజుకి దాదాపుగా లక్ష వరకు కేసులు చూసిన భారత్‌లో ఇప్పుడు రోజుకి 10 నుంచి 20 వేలు వరకు మాత్రమే కేసులు నమోదవుతున్నాయి.
చైనా నుంచి కేరళకి
చైనాలోని వూహాన్‌లో 2019 డిసెంబర్ 27న తొలిసారిగా కరోనా కేసు బట్టబయలైతే ఆ తర్వాత నెల రోజులకే అంటే జనవరి 30న చైనా నుంచి భారత్‌కి వచ్చిన కేరళ విద్యార్థినికి కరోనా సోకినట్టు వెల్లడైంది. ఆ విద్యార్థినిని క్వారంటైన్‌కి తరలించడంతో భారత్ ఒక్కసారి ఉలిక్కిపడింది. కానీ మన ఉష్ణోగ్రతలకి వైరస్ బతకదన్న ధీమాతోనే మార్చి వరకు గడిపేశాం. అంతకంతకూ కేసులు పెరుగుతూ ఉండడంతో వైరస్ ముప్పుని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం మార్చి 24న హఠాత్తుగా లాక్‌డౌన్ ప్రకటించడంతో అందరూ మేల్కొన్నారు. మాస్క్‌లు, శానిటైజర్లు, భౌతికదూరం వంటి మాటలే కొత్తగా విన్న ప్రజలకు ఈ వైరస్‌పై అవగాహన పెంచుకోవడానికి సమయం పట్టింది.
ఆ కొద్దిపాటి సమయంలోనే కరోనా మన దేశాన్ని అతలాకుతలం చేసేసింది. ప్రపంచ దేశాల పట్టికలో అమెరికా తర్వాత కోటి కేసులు దాటిన దేశంగా భారత్ నిలిచినప్పటికీ, జనసాంద్రత పరంగా చూస్తే కరోనా విసిరిన సవాళ్లను పకడ్బందీగా ఎదుర్కొన్నామనే చెప్పాలి. కరోనా విస్తరించిన తొలిరోజుల్లో ముంబై కరోనాకి రాజధానిగా మారింది. ఇప్పటికి కూడా మహారాష్ట్ర కోవిడ్–19 కేసుల్లో ముందు వరసలో ఉంది. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ వంటి దక్షిణాది రాష్ట్రాల్లో కరోనా కేసులు అత్యధికంగా నమోదయ్యాయి. యాక్టివ్ కేసుల్లో కేరళ, మహారాష్ట్ర నుంచే 65శాతం నమోదవుతున్నాయి. మొత్తం కేసుల్లో ఇది 1.6శాతం మాత్రమే. సరైన సమయంలో లాక్‌డౌన్ వల్ల కోటి వరకు కేసులు, లక్ష వరకు మరణాలను నిరోధించగలిగామన్న అంచనాలున్నాయి.
హెర్డ్ ఇమ్యూనిటీ సాధించామా..?
పశ్చిమ దేశాలు కరోనా వైరస్‌తో ఇంకా కష్టాలు పడుతూ ఉంటే మన దేశంలో అక్టోబర్ నుంచి కేసులు తగ్గుముఖం పట్టడం అందరినీ ఆశ్చర్యంలోకి నెట్టేస్తోంది. భారతీయుల్లో రోగనిరోధకత ఎక్కువగా ఉండడం, యువతరం ఎక్కువగా ఉండడం, చాలా మందిలోయాంటీ బాడీలు ఏర్పడడం వంటివి ఇందుకు కారణమని నిపుణుల అంచనా. భారత్‌లో ఎంత మందికి కరోనా వచ్చి తగ్గిందన్న దానిపై భిన్నాభిప్రాయాలున్నాయి. పట్టణాల్లో థైరోకేర్ కంపెనీ నిర్వహించిన సర్వేలో 30 నుంచి 40 కోట్ల మందికి కరోనా వచ్చినట్టు తేలగా, 3నెలల క్రితం ఐసీఎంఆర్ సర్వేలో 10 కోట్ల మందికి సోకినట్టు తేలింది. దీంతో భారత్ హెర్డ్ ఇమ్యూనిటీ సాధించి ఉంటుందని అంతర్జాతీయ నిపుణుల అభిప్రాయం.
మరణాలు తక్కువే.!
రికవరీలో భారత్ అద్భుతమైన ఫలితాలను సాధించింది. మొత్తం కేసులు కోటీ 7 లక్షలు దాటితే మృతుల సంఖ్య లక్షా 50 వేలు దాటింది. రికవరీ అంశం భారత్‌కు మొదట్నుంచీ అతి పెద్ద రిలీఫ్. తాజాగా జాతీయ రికవరీ రేటు 96శాతంగా ఉండడం ఒక రికార్డు. ఇతర దేశాలతో పోల్చి చూస్తే మరణాల రేటు భారత్‌లో చాలా తక్కువ.
12 నెలల ప్రయాణం
2020 జనవరి 18: చైనా, హాంకాంగ్ నుంచి వచ్చే ప్రయాణికులకి విమానాశ్రయాల్లోనే థర్మల్ స్క్రీనింగ్
30: కేరళలో తొలి కేసు నమోదు
ఫిబ్రవరి 3,4: మరో రెండు కేసులువెల్లడి, వీరు కూడా చైనా నుంచి వచ్చిన విద్యార్థులే
మార్చి 10: కరోనాతో తొలి మరణం
11: ప్రపంచ ఆరోగ్య సంస్థ కోవిడ్–19న మహమ్మారిగా ప్రకటించింది.
24: భారత్‌లో 21 రోజుల లాక్‌డౌన్ విధింపు
ఏప్రిల్ 14: లాక్‌డౌన్ మే 3వరకు పొడిగింపు
మే1: మరో 2 వారాలు లాక్‌డౌన్ పొడిగింపు
7: 50 వేలు దాటిన కరోనా కేసులు
జూన్ 1: అన్‌లాక్ ప్రక్రియ ప్రారంభం
27: భారత్‌లో 5 లక్షలు దాటిన కేసులు
జూలై 1 : అన్‌లాక్ 2 ప్రారంభం
17: భారత్‌లో 10 లక్షలు దాటిన కేసులు
ఆగస్టు 3: ఆక్స్‌ఫర్డ్ వ్యాక్సిన్ రెండు, మూడో దశ ప్రయోగాలకు డీసీజీఐ అనుమతి
7:20 లక్షలు దాటిన కేసులు వ్యాక్సిన్ పంపిణీ కోసం ప్రణాళికలు సిద్ధం చేయడానికి జాతీయ నిపుణుల కమిటీ ఏర్పాటు
సెప్టెంబర్ 5: కరోనా కేసుల్లో బ్రెజిల్‌ని దాటేసి రెండోస్థానంలోకి చేరుకున్న భారత్
16 : 50 లక్షలు దాటిన కేసులు
అక్టోబర్ 11: 80 లక్షలు దాటిన కేసులు
నవంబర్16: భారత్ బయోటెక్ కొవాగ్జిన్ మూడో దశ ప్రయోగాలు ప్రారంభం
డిసెంబర్ 8: ఆక్స్‌ఫర్డ్, భారత్ బయోటెక్ వ్యాక్సిన్ అనుమతుల్ని పరిశీలిస్తున్నట్టుగా కేంద్రం వెల్లడి
డిసెంబర్ 10 : కోటి దాటిన కేసులు
2021 జనవరి 2 : భారత్‌లో కరోనా వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి డీసీజీఐ అనుమతి
16: కరోనా వ్యాక్సినేషన్ ప్రారంభం.
కరోనాతో ఏడాది సావాసాన్ని చూస్తే...
Published Sat, Jan 30 2021 4:22 AM | Last Updated on Sat, Jan 30 2021 3:34 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment