ఆదిమజాతులకు జరిగే అన్యాయాన్ని అందరి దృష్టికీ తీసుకొచ్చి, వారి జీవించే హక్కును రక్షించడం, వారికి అభివృద్ధి ఫలాలు దక్కేలా చూడటం అవసరమని సమస్త సమాజాలకూ గుర్తు చేయడం కోసం ఆగస్టు 9ని ప్రపంచ ఆదివాసీ దినోత్సవంగా మూడు దశాబ్దాలక్రితం ఐక్యరాజ్య సమితి ప్రకటించింది. మన దేశం ఆ తీర్మానంపై సంతకం చేసినా, దాన్ని మన పార్లమెంటు ఇంతవరకూ ధ్రువీకరించలేదు. ప్రపం చవ్యాప్తంగా సుమారు ఐదు వేల రకాల ఆదిమ తెగలున్నాయని ఒక అంచనా. వీరి భాషలు కూడా వేల సంఖ్యలో ఉన్నాయి. మన దేశంలో 700కు పైగా తెగలుండగా అందులో సుమారు 500 తెగలు మాత్రమే మిగిలాయి. వీరి భాషల్లో 197 కనుమరుగు కానున్నాయని ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ యునెస్కో ఆందోళన వ్యక్తం చేసింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో తోటి, చెంచు, కొండరెడ్డి, కులియ, దులియ తదితర తెగలతో పాటు, కొలాం, సవర వంటి భాషలు కూడా కనుమరుగుకాను న్నాయి.
అతిపెద్ద ప్రజాస్వామిక దేశంలోనే ఆదిమ తెగల పరిస్థితి ఇలా ఉంటే ప్రపంచవ్యాప్తంగా ఆదివాసీల దీనావస్థలు చెప్పనక్కరలేదు. మనుషులుగా ఆదిమ జాతులకే లేని భద్రత వారి భాషలకు, సంస్కృ తులకు ఎలా ఉంటుంది? వివిధ దేశాల్లో సాగిన వలస పాలన స్థానిక ఆదిమ జాతుల్ని అణచివేసి, వారి రాజ్యాలతోపాటు వారి భాషల్ని, సంస్కృతుల్ని ధ్వంసం చేసింది. దానివల్ల ఇంతవరకూ కలిగిన నష్టాన్ని గుర్తించబట్టే యునెస్కో ఈ ఏడాదిని ప్రపంచ ఆదివాసీ భాషా సంవ త్సరంగా ప్రకటించబోతున్నది. ఈ నెల 28న ఫ్రాన్స్ రాజధాని పారిస్ లోని యునెస్కో ప్రధాన కార్యాలయంలో జరిగే కార్యక్రమంలో దీనిపై ప్రకటన వెలువడుతుంది. ఆదిమజాతుల భాషా జ్ఞానాన్ని పరిరక్షించు కోవడం విశ్వమానవాళి బాధ్యత అని ఈ ప్రకటన గుర్తుచేస్తుంది. ఆదిమ జాతుల సంస్కృతి వర్ధిల్లితేనే మానవ వైవిధ్యత వర్ధిల్లుతుంది. ఆదిమ జాతుల, భాషా సంస్కృతుల పరిరక్షణ అంటే వారి భాషా సంస్కృతు లను, జీవన విధానాన్ని సజీవంగా కొనసాగేలా చూడటం. అది వీలై నంత తొందరగా జరగాలి. విశ్వవిద్యాలయాలు సైతం నిజాయితీగా వాస్తవ మూల భాషా జ్ఞాన అన్వేషణ మొదలుపెట్టాలి. చారిత్రక వాస్తవ నిర్ధారణలు జరగాలి. ఈ ఆదివాసీ భాషా సంవత్సరం పొడవునా వర్సిటీలు మూల భాషలపై అధ్యయనాలు, మేధోమథనాలు నిర్వహించాలి.
ఆదివాసీ భాషల పరిరక్షణకు యునెస్కో ప్రయత్నించడం ఇది మొదటిసారి కాదు. 2005లోనే యునెస్కో, మన జాతీయ విద్యా పరి శోధన, శిక్షణ మండలి(ఎన్‌సీఈఆర్‌టీ), కేంద్ర భారతీయ భాషల సంస్థ (సీఐఐఎల్)లు మైసూర్‌లో సెమినార్ నిర్వహించాయి. ఆదివాసీ భాషల పరిరక్షణతోపాటు ఆ తెగల్లో విద్యాపరంగా ఉన్న వెనకబాటును, వారి మాతృభాషల్లోనే ప్రాథమిక విద్యా బోధన జరిగితే అధిగమించవచ్చునని తేల్చారు. ఆవిధంగా 2006లో ఆదివాసీలు అధికంగా నివసించే రాష్ట్రా లను ఎన్నుకుని ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. కానీ ఇది మూన్నాళ్ల ముచ్చ టగా మిగిలిపోయింది. ఆదిమజాతుల పిల్లలకు వారి భాష, సంస్కృతు లపై పాఠ్యాంశాలు లేకపోవడం, తమది కాని భాష నేర్చుకోవాల్సి రావడంవంటి కారణాలతో మధ్యలోనే అనేకులు చదువు మానేస్తున్నారు. వారి పండుగలు, ఇతర సందర్భాల్లో ఆ పిల్లలు పాల్గొనేందుకు వీలు కల్పించకపోవడం వల్ల అటువంటివారు తమ భాషాసంస్కృతులకు దూరమవుతున్నారు. సామాజిక ఆదరణ, ఆచరణ ఉంటేనే ఏ భాషైనా సజీవంగా ఉంటుంది. ఆదివాసీ భాషలు అంతరించిపోవడానికి వాటికి లిపి లేకపోవడమే కారణమన్న వాదన సరికాదు.
మన దేశంలోని హిందీ, తెలుగు సహా అనేక భాషల్లో ఆదివాసీ భాషా పదాలు వచ్చిచేరాయి. తెలుగులో 20 శాతం, తమిళంలో 30 శాతం, కన్నడలో 80 శాతం కోయ భాషాపదాలున్నాయి. భర్త చనిపో యిన మహిళను తెలుగులో వితంతువు అంటారు. దీనికి సమానార్థక పదం దాదాపు అన్ని భాషల్లో ఉంది. కానీ అండమాన్ దీవుల్లో నివసించే ఒక ఆదిమ తెగ భాషలో చనిపోయిన వ్యక్తి రక్తసంబంధీకులందరినీ సంబోధించేందుకు వేర్వేరు పదాలున్నాయి. ఇలా సమృద్ధంగా పద జాలం ఉండటం ఆదిమ జాతుల భాషల ప్రత్యేకత. అందుకే ఆ భాషల్ని, వారి సంస్కృతులను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉంది. (ఈ ఏడాదిని ఆదివాసీ భాషా సంవత్సరంగా యునెస్కో రేపు ప్రకటించబోతున్న సందర్భంగా)
మడివి నెహ్రూ, ఆదివాసీ సంక్షేమ పరిషత్ సమన్వయకర్త, కోయభాష ప్రామాణీకరణ సభ్యులు
Comments
Please login to add a commentAdd a comment