తెలుగు విప్లవ రచయితలు ఇద్దరు మహారాష్ట్ర జైళ్లలో బందీలయ్యారు. వీరిలో ప్రొ‘‘ సాయిబాబా నాగపూర్ జైల్లో యావజ్జీవ శిక్ష అనుభవిస్తూ తీవ్ర అనారోగ్యంతో మృత్యుముఖంలో ఉన్నారు. ఆయనకు వైద్యంకోసం వేసిన బెయిల్‌ను కూడా కోర్టు కొట్టేసింది. ఆధునిక తెలుగు సాహిత్యంలోనే పేరెన్నికగన్న విప్లవకవి వరవరరావు ఐదు నెలల నుంచి పూణేలోని ఎరవాడ జైల్లో బందీ అయ్యారు. 80 ఏళ్ల వయసులో కనీస సౌకర్యాలు లేని జైలు జీవితం అనుభవిస్తున్నారు. వీరేగాక దేశవ్యాప్తంగా సుప్రసిద్ధులైన సుధాభరద్వాజ్, సురేంద్ర గాడ్లింగ్, ప్రొ. షోమాసేన్, వెర్నన్ గొంజాల్వెజ్, అరుణ్ ఫెరేరా, రోనావిల్సన్, సుధీర్ ధావ్లే, మహేష్ రౌత్ కూడా ఎరవాడ జైల్లో చేయని నేరానికి శిక్ష అనుభవిస్తున్నారు. సాహిత్య, కళా, న్యాయ, మేధో రంగాల్లో దేశం గర్వించదగిన ఈ బుద్ధిజీవులను అక్రమ కేసుల కింద సంఘ్‌పరి వార్ ప్రభుత్వం నిర్బంధించింది.
వీళ్లంతా తమ మేధస్సుతో, సృజనాత్మకతతో సమాజ వికాసానికి దోహదం చేశారు. ప్రజాస్వామిక విలువలను, సంస్కృతిని స్థాపించడానికి కృషి చేశారు. ప్రజా పోరాటాలతో కలిసి నడవడమే బుద్ధిజీవుల కర్తవ్యమనే తరతరాల ఆదర్శాన్ని ఎత్తిపట్టారు. అట్టడుగు కులాల, వర్గాల, ఆదివాసుల, మత మైనారిటీల ఉనికినే రద్దు చేసే ప్రభుత్వ విధానాలను వీళ్లు ఎదిరించారు. దేశ సంపదను సామ్రాజ్యవాదానికి తాకట్టు పెట్టే కుట్రలను బహిర్గతం చేశారు. తమ శ్రమతో సమస్త సంపదలు సృష్టిస్తున్న కార్మికవర్గంపై జరుగుతున్న దోపిడీని ప్రశ్నించారు. పీడిత ప్రజలు చేస్తున్న పోరాటాల్లో భాగమయ్యారు. అంతిమంగా ప్రజాస్వామ్యం పేరుతో సాగుతున్న నియంతృత్వాన్ని ఖండించి, ఒక మానవీయమైన వ్యవస్థను స్థాపించుకోడానికి ప్రజలు చేస్తున్న ప్రయత్నాలకు బాసటగా నిలబడ్డారు. ప్రజల తరపున రాస్తూ, మాట్లాడుతూ, పోరాడుతున్నందుకే వీరి మీద తప్పుడు ఆరోపణలు చేశాయి. బెయిలు రాకుండా అడ్డుకుంటున్నాయి.
న్యాయ ప్రక్రియను తమ కనుసన్నల్లో నడుపుతున్నాయి. మన దేశంలో బ్రాహ్మణీయ హిందుత్వ ఫాసిజం వచ్చేసిందనడానికి వీళ్ల నిర్బంధమే ఒక ఉదాహరణ. ఈ పది మంది మేధావులేకాదు, దేశ వ్యాప్తంగా వేలాది మంది దళితులు, ఆదివాసులు, ముస్లింలు చేయని నేరానికి ఏండ్ల తరబడి జైళ్లలో మగ్గుతున్నారు. మనకు పేర్లు తెలిసిన ఈ పది మంది గురించేగాక జైళ్లలో అక్రమంగా బందీలైన వాళ్లందరి విడుదల కోసం ఆందోళన జరుగుతోంది. దేశంలో హక్కుల ఉల్లంఘన ప్రమాదకర స్థాయికి చేరుకున్నదని ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామికవాదులు, రచయితలు ఆందోళనపడుతున్నారు. ప్రజాస్వామ్యమంటే భిన్నాభిప్రాయ ప్రకటనలకు చోటు ఉండటం. వేర్వేరు ప్రత్యామ్నాయాలను విశ్వసించి, ఆచరించే అవకాశం ఉండటం. పాలకులు ఈ విలువను ధ్వంసం చేశారు. ఈ స్థితిపై రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే చాలా పోరాటాలు జరిగాయి. తెలుగు సాహిత్య, మేధో రంగాల నుంచి కూడా తీవ్ర నిరసన వచ్చింది. ఇందులో భాగంగా ఈ నెల 28, 29, 30 తేదీల్లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు హైదరాబాదు, వరం గల్, విజయవాడ, కర్నూలు నగరాల్లో విరసం ఆధ్వర్యంలో రచయితలు, మేధావులు, ప్రజాస్వామికవాదులతో ధర్నాలు నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అందరినీ కోరుతున్నాం.
విప్లవ రచయితల సంఘం
Comments
Please login to add a commentAdd a comment