సాక్షి, అమరావతి : గుంటూరు జిల్లా మంగళగిరి సమీపంలోని కూరగల్లులో అమృత విశ్వవిద్యాలయం నిర్మాణానికి ముఖ‍్యమంత్రి చంద్రబాబు నాయుడు బుధవారం భూమిపూజ చేశారు. 200 ఎకరాల్లో దశల వారీగా 2వేల కోట్లతో విద్యాసంస్థలు నిర్మాణం జరగనుంది. తొలుత ఇంజినీరింగ్ విభాగానికి ఇవాళ శంకుస్థాపన జరిగింది. ఈ కార్యక్రమానికి అమృత స్వరూపానంద పూరీ, మంత్రులు నారాయణ, కామినేని శ్రీనివాస్, గంటా శ్రీనివాసరావు తదితరులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ....‘ విలువలతో కూడిన అమృత విశ్వవిద్యాలయం అమరావతిలో ఏర్పాటు చేయడం అభినందనీయం. మాతా అమృతానందమయి ట్రస్ట్ సమాజం కోసం ఎనలేని సేవలు చేస్తోంది. సునామీ కబళించిన సందర్భంలో ఈ ట్రస్ట్ చేసిన సేవలు విలువ కట్టలేం. ప్రపంచంలో అమృత విశ్వవిద్యా పీఠం సేవలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు అమరావతిలో కూడా కొనసాగాలి. ఈ విశ్వవిద్యాలయం వల్ల అమరావతికి శోభ వస్తుంది. సైన్స్, ఇంజినీరింగ్, ఇన్నోవేషన్, సోషల్ సైన్స్, గ్లోబల్ పీస్ వంటి అనేక టెక్నాలజీలతో కూడిన శిక్షణ తరగతులు అందుబాటులోకి వస్తాయి.’ అని సీఎం పేర్కొన్నారు.
అలాగే రాజధానిలో తొమ్మిది నగరాలు వస్తున్నాయని, చరిత్రలో లేనివిధంగా రైతులు వేల ఎకరాలు ఇచ్చారన్నారు. రాబోయేవి ఆషామాషీ నగరాలు కావంటూ.. ప్రపంచస్థాయి నగరాలకు ధీటుగా అమరావతిని హబ్‌గా తీర్చిదిద్దుతామని తెలిపారు. ఎన్నిక కష్టాలు వచ్చినా సరే సంకల్పంతతో ముందుకు వెళుతున్నామన్నారు. ఇక కృష్ణానదిపై అయిదు రిజర్వాయర్లు రాబోతున్నాయని, విజయవాడ..గుంటూరు నగరాలను మెగా సిటీలుగా రూపురేఖలు మార్చుతామని తెలిపారు.
మోసం చేశారని మండిపడ్డ మహిళలు
అమృత యూనివర్సిటీ శంకుస్థాపన సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు సభకు డ్వాక్రా బృందాలతో భారీగా మహిళల్ని తరలించారు. అయితే సభకు వచ్చినవారికి చీరలు ఇస్తామని చెప్పి నిర్వాహకులు టోకెన్లు ఇచ్చి, చీరలు పంచకపోవడంపై మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. సభకు వస్తే చీరలు ఇచ్చి భోజనం పెడతామని తమను తీసుకు వచ్చి మోసం చేశారని మహిళలు మండిపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment