మంత్రి లోకేష్‌తో ఎమ్మెల్యే శ్రావణ్‌కుమార్ (ఫైల్)
తాడికొండ నియోజకవర్గంలో రగిలిన అసమ్మతిని చల్లార్చేందుకు నేరుగా చిన్నబాబు లోకేష్ రంగంలోకి దిగారు. వారిని ఎలాగైనా ఒప్పించి ఎమ్మెల్యే శ్రావణ్‌కే మళ్లీ టిక్కెట్ ఇచ్చేందుకు సీఎం క్యాంపు కార్యాలయంలో సోమవారం జరిగిన రహస్య సమావేశం ఆలస్యంగా వెలుగు చూసింది. శ్రావణ్‌కు మళ్లీ సీటు ఇవ్వొద్దని, ఒకవేళ సీటు ఇస్తే అందరం మనస్ఫూర్తిగా సహకరించడం కష్టమని తేల్చిచెప్పారని సమాచారం. ముఖ్యమంత్రి దృష్టికి అన్ని సమస్యలను తీసుకెళ్దామని, ఆయన సూచనను అందరం గౌరవిద్దామని లోకేష్ సర్దిచెప్పారని తెలిసింది.
సాక్షి,గుంటూరు: రాజధాని నియెజకవర్గంగా ప్రాముఖ్యత చెందిన తాడికొండ నియెజకవర్గం ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్‌కుమార్‌కు మళ్లీ అవకాశం ఇవ్వాలా? వద్దా? అనే విషయంపై టీడీపీ అధినేత చంద్రబాబునాయుడికి తలనొప్పిగా మారింది. ఇప్పటికే పలుమార్లు అసమ్మతి నేతలతో విజయవాడలో మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, నక్కా ఆనందబాబులు సమావేశం నిర్వహించి తుది నివేదికను చంద్రబాబుకు అందజేశారు. అససమ్మతి నేతలను ఎలాగైనా బుజ్జగించి మళ్లీ శ్రావణ్‌కే టికెట్ ఇవ్వాలనే విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నారు.
ఎస్సీ సామాజిక వర్గానికి రిజర్వేషన్ టికెట్ కావడం కూడా వారికి సవాల్‌గా మారింది. ఇప్పటికే అభ్యర్థులను మార్చాలని ఓ నేత తన అభిప్రాయాన్ని అధిష్టానం దృష్టికి తీసుకు వెళ్లిన విషయం తెలిసిందే. జిల్లాలో ఎక్కడా లేని విధంగా తాడికొండ ఎమ్మెల్యేపై పలుమార్లు అసమ్మతి నేతలు సమావేశాలు నిర్వహించి మళ్లీ ఆయనకే టికెట్ కేటాయిస్తే ఎవరూ సహకరించేది లేదంటూ తీర్మానాలు చేసిన నేపథ్యంలో నేరుగా చినబాబు(లోకేష్) రంగంలోకి దిగారు. ఈ క్రమంలో సోమవారం సీఎం క్యాంపు కార్యాలయంలో రహస్య సమావేశం నిర్వహించిన విషయం ఆలస్యంగా వెలుగు చూసింది. విశ్వసనీయ సమాచారం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి.
అసమ్మతి నేతలతో భేటీ
రానున్న ఎన్నికల నేపథ్యంలో ఎలాగైనా అసమ్మతి నేతలను బుజ్జగించి పార్టీ ఫిరాయింపులు జరగకుండా చూసేందుకు హడావుడిగా అసమ్మతి నేతలను సోమవారం క్యాంపు కార్యాలయానికి పిలిపించారు. వారిలో అధికంగా ఎమ్మెల్యే సామాజిక వర్గానికి చెందిన నాయకులు ఉండటం గమనార్హం. అసమ్మతిని తెలియజేసేందుకు ఎమ్మెల్యేపై తిరుగుబావుటా ఎగురవేసిన 500 మంది వెళ్లారు. అయితే అందరితో మాట్లాడడం సాధ్యం కాదంటూ 150 మంది ముఖ్య నాయకులు, క్రియాశీల కార్యకర్తలను మాత్రమే లోపలకు అనుమతించారు. లోపలకు వెళ్లే సమయంలో వారి వద్ద ఉన్న సెల్‌ఫోన్‌లను సెక్యూరిటీ సమస్య అంటూ విధుల్లో ఉన్న సిబ్బంది స్వాధీనం చేసుకొని అనుమతించారని తెలిసింది.
సంజాయిషీ ఇవ్వాలని చినబాబు ఆదేశం
పార్టీ అనుమతి లేకుండా, ఇష్టానుసారంగా అసమ్మతి నేతలు రహస్య సమావేశాలు నిర్వహించడాన్ని చిన్నబాబు తప్పుబట్టారు. అందుకు బాధ్యలైన వారందరి నుంచి ఇకపై అలాంటి సమావేశాలు నిర్వహించకుండా అధిష్టానం దృష్టికి తీసుకువస్తామని తెలియజేస్తూ సంజాయిషీ రాయించుకున్నట్లు సమాచారం. అనంతరం ఒక్కొక్కరూ వారు ఎమ్మెల్యే కారణంగా ఎదుర్కొన సమస్యలు, పార్టీ నాయకులను దూరంగా ఉంచిన సంఘటనలను వివరించారు. గతంలో పదేళ్ల పాటు పార్టీ అభ్యున్నతి కృషి చేయడంతో పాటు శ్రావణ్‌కుమార్‌కు అప్పట్లో టికెట్ ఇవ్వవద్దని విభేదించిన నేతలను పక్కనపెట్టి ఆయన్ని గెలిపిస్తే.. గెలిచిన నెల వ్యవధిలోనే వారిని అక్కున చేర్చుకొని మమ్మల్ని దూరంగా పెట్టాడని పలువురు ధ్వజమెత్తారు.
అలాంటి నాయకుడు కోసం మీరు మళ్లీ అవకాశం ఇచ్చినా పనిచేయాలంటూ బాధగా ఉందనీ, మనోభావాలను చంపుకొని కొందరం పనిచేసినా మిగిలిన వారంతా సహకరిస్తారనే నమ్మకం లేదని తేల్చి చెప్పారు. నాయకులు, కార్యకర్తలు చెప్పిన విషయాలన్నీ పరిశీలిస్తామనీ విషయాలను చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లి ఆయన తీసుకునే నిర్ణయాన్ని అందరూ గౌరవించాలని చినబాబు స్పష్టం చేశారు. మరో రెండు రోజుల్లో అవసరమైతే మళ్లీ సమావేశం నిర్వహించి తుది నిర్ణయం తీసుకుంటారని వివరించినట్లు సమాచారం.
నోటాకైనా వెనుకాడం
సమావేశం వివరాలు గ్రామాల్లో తెలియడంతో నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారింది. స్థానికంగా ఉన్న నాయకులు, కార్యకర్తలు సమాలోచనలో పడ్డారు. మనోభావాలకు ప్రాధాన్యత ఇవ్వకుండా మళ్లీ శ్రావణ్ కుమార్‌కు అధిస్టానం సీటు కేటాయిస్తే..పార్టీ ఫిరాయింపునకు అవకాశం ఉన్న వారు ఎవరి దారి వారు చూసుకుందామనే నిర్ణయానికి కొందరు వచ్చారు. అతనికి ఓటు వేయలేకపోతే నోటాకు ఓటు వేస్తామనే నిర్ణయానికి వచ్చారు. ఏదిఏమైనా ఎమ్మెల్యే శ్రావణ్‌కుమార్‌కు టికెట్ కేటాయిస్తే వచ్చే నష్టాన్ని నేతలు ఇప్పటికే అంచనా వేసిన నేపథ్యంలో ఏం జరుగుతుందో వేచి చూడాలి.
Comments
Please login to add a commentAdd a comment