బెల్ట్‌ షాపుల నియంత్రణలో విఫలం | TDP government Failure liquor shops ban | Sakshi
Sakshi News home page

బెల్ట్‌ షాపుల నియంత్రణలో విఫలం

Published Mon, Jan 1 2018 12:34 PM | Last Updated on Mon, Jan 1 2018 12:34 PM

TDP government Failure liquor shops ban - Sakshi

పొన్నూరు (చేబ్రోలు) : పచ్చని సంసారాల్లో చిచ్చు రేపుతున్న మద్యం బెల్టు షాపులను నియంత్రించటంలో టీడీపీ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని వైఎస్సార్‌ సీపీ గుంటూరు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు, పొన్నూరు నియోజకవర్గ పార్టీ సమన్వయకర్త రావి వెంకటరమణ విమర్శించారు. విచ్చలవిడిగా పెరిగిపోతున్న మద్యం బెల్టు షాపులను నియంత్రించాలని కోరుతూ పొన్నూరు పట్టణంలోని ఆచార్య ఎన్జీ రంగా విగ్రహం వద్ద ఆదివారం అఖిలపక్షం, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకటరమణ మాట్లాడుతూ ఎన్నికల్లో ప్రజలకిచ్చిన వాగ్దానాలను నెరవేర్చని టీడీపీ ప్రభుత్వాన్ని గద్దె దించాల్సిన అవసరం ఉందన్నారు.

 బెల్టు షాపుల రద్దుకు సీఎం చంద్రబాబు తొలి సంతకం చేశారని, అయితే ఎక్కడా బెల్టుషాపుల నియంత్రణ జరగలేదన్నారు. మద్యం మహమ్మారికి ఎందరి జీవితాలో గాలిలో కలిసిపోవటమే కాకుండా కుటుంబాలు వీధిన పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో 600కు పైగా హమీలిచ్చిన బాబు ఏ ఒక్కదాన్నీ పూర్తిస్థాయిలో అమలు చేయలేదని విమర్శించారు. రాబోయే రోజుల్లో అన్ని పార్టీలు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఉద్యమిస్తామన్నారు. మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు మల్లెల వెంకట్రావు మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వం రాజ్యాంగ స్ఫూర్తికి విఘాతం కలిగించే విధంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. మంత్రులు, ఎమ్మెల్యేలు రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తున్నారని విమర్శించారు.

 గుంటూరు తూర్పు ఎమ్మెల్యే షేక్‌ ముస్తఫా మాట్లాడుతూ రాష్ట్రంలో అధికార టీడీపీ మద్యం తాగండి, తాగి ఊగండి అన్న నినాదంతో విచ్చలవిడిగా బెల్టు షాపులను నడుపుతోందన్నారు. టార్గెట్లు ఇచ్చి మద్యం విక్రయాలు సాగిస్తున్నారని విమర్శించారు. మాజీ ఎమ్మెల్యే మేకతోటి సుచరిత మాట్లాడుతూ నవ్యాంధ్రను మద్యాంధ్రగా మార్చిన ఘనత చంద్రబాబుకు దక్కుతుందన్నారు. పొన్నూరు జెడ్పీటీసీ, కాపు సంఘం నాయకుడు కోట శ్రీనివాసరావు మాట్లాడుతూ మంచినీరు దొరకని ఊరు ఉందేమో కాని మద్యం దొరకని గ్రామమే లేదని ఎద్దేవా చేశారు. బెల్టు షాపుల వల్ల యువత పెడదోవ పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 

బీజేపీ నాయకుడు కేవీ తిరుపతిరావు మాట్లాడుతూ ప్రధాని మోదీ జాతీయ రహదారులపై మద్యం షాపులకు అనుమతి ఇవ్వవద్దని జీవో జారీ చేస్తే, రాష్ట్ర ప్రభుత్వం అందుకు భిన్నంగా వాటిని రాష్ట్ర రహదారులుగా మార్చి విచ్చలవిడిగా మద్యం దుకాణాలను ఏర్పాటు చేయటం హేయమైన చర్య అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకుడు తన్నీరు కిషోర్, సీపీఐ ఎంఎల్‌ నాయకుడు పరశురామయ్య, ఆమ్‌ఆద్మీ నాయకులు గాజుల నాగభూషణం, మాజీ మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ ఎన్‌.రూత్‌రాణి, కాపు సంఘం నాయకులు జి.మోహనరావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం ర్యాలీగా వెళ్లి ఎక్సైజ్‌ పోలీసు స్టేషన్‌లో వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌ సీపీ నాయకులు వడ్రాణం ప్రసాదరావు, బొనిగల వేణు ప్రసాద్, ఆకుల వెంకటేశ్వరరావు, బోయిన శివనాగరాజు తదితరులు ఉన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement