బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ ప్రస్తుతం స్కై ఫోర్స్ అనే మూవీతో టాలీవుడ్ ప్రేక్షకులను పలకరించనున్నారు. సందీప్ కేవ్లానీ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా ఈనెల 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ యాక్షన్ థ్రిల్లర్‌ను వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కించారు. ఈ మూవీని జియో స్టూడియోస్, మడాక్ ఫిల్మ్స్ సంయుక్తంగా నిర్మించారు. ప్రస్తుతం ఈ మూవీ ప్రమోషన్లతో బిజీగా ఉన్నారు. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూకు హైజరైన అక్షయ్ బాక్సాఫీస్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు.
ఓటీటీల వల్లే మంచి సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద ఫెయిల్ అవుతున్నాయని అక్షయ్ కుమార్ అన్నారు. ఓటీటీలు వచ్చాక థియేటర్లకు వెళ్లే ప్రేక్షకుల భారీగా తగ్గిందని తెలిపారు. పెద్ద చిత్రాలు సైతం బాక్సాఫీస్ వద్ద రాణించకపోవడానికి ప్రధాన కారణం ఓటీటీలేనని వెల్లడించారు.
అక్షయ్ కుమార్ మాట్లాడుతూ..'ఈ మధ్యకాలంలో నేను చాలామందితో సినిమాల గురించి ఆరా తీశా. ఏ సినిమా అయినా ఓటీటీలో చూస్తామని అంటున్నారు. బాక్సాఫీస్ వద్ద సినిమాలు సరిగ్గా సక్సెస్ అవ్వకపోవడానికి ప్రధాన కారణం ఓటీటీనే అని నాకు అర్థమైంది. కరోనా టైమ్‌లో ఓటీటీ వేదికగా ఇంట్లోనే కుటుంబంతో కలిసి సినిమాలు చూశారు. ఆ తర్వాత పరిస్థితులు మారినప్పటికీ ప్రేక్షకులు ఓటీటీకే మొగ్గు చూపుతున్నారు. అది ఒక అలవాటుగా మారిందని' అన్నారు. కాగా.. తెలుగులోనూ మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కిస్తోన్న కన్నప్ప చిత్రంలో అక్షయ్ కుమార్ కీలక పాత్ర పోషిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment