అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పిస్తున్న ఎమ్మెల్యే ముస్తఫా, అప్పిరెడ్డి, నాగార్జున, కావటి మనోహరనాయుడు తదితరులు
పట్నంబజారు (గుంటూరు): ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అని విద్యార్థిలోకం చాటి చెప్పింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆడుతున్న నాటకాలపై కన్నెర్రజేసింది. రాష్ట్రానికి అన్యాయం చేస్తే సహించబోమని కదం తొక్కింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు పానుగంటి చైతన్య ఆధ్వర్యంలో ప్రత్యేక హోదాను కాంక్షిస్తూ ప్రదర్శన నిర్వహించారు. కార్యక్రమానికి పార్టీ నగర అధ్యక్షుడు లేళ్ల అప్పిరెడ్డి, తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే షేక్ మొహమ్మద్ ముస్తఫా, ఎస్సీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు మేరుగ నాగార్జున, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆతుకూరి ఆంజనేయులు, పెదకూరపాడు నియోజకవర్గ సమన్వయకర్త కావటి మనోహర్‌నాయుడు, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు డైమండ్‌బాబులు హాజరయ్యారు. తొలుత లాడ్జి సెంటర్‌లో భారత రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం అక్కడి నుంచి శంకర్‌విలాస్ సెంటర్ వరకు విద్యార్థులతో కలసి భారీ ప్రదర్శన నిర్వహించారు.
ఈ సందర్భంగా అప్పిరెడ్డి మాట్లాడుతూ అధికార మదంతో స్వార్థ ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రయోజనాల్ని తుంగలో తొక్కుతున్నారని ధ్వజమెత్తారు. వైఎస్సార్ సీపీ అధినేత వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ఎన్నో పోరాటాలు చేయడంతోపాటు ఆమరణ దీక్ష చేసిన సందర్భాలను గుర్తు చేశారు. తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే షేక్ మొహమ్మద్ ముస్తఫా మాట్లాడుతూ టీడీపీ నేతలు చేసేంది ఏమీలేకపోగా, ఆర్భాటపు ప్రచారాలు చేసుకోవడం సిగ్గుచేటన్నారు. ఎస్సీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు మేరుగ నాగార్జున మాట్లాడుతూ రాష్ట్రానికి అన్యాయం జరుగుతున్నా కళ్ళులేని కబోదుల్లా టీడీపీ నేతలు వ్యవహరిస్తున్నారని మండి పడ్డారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆతుకూరి ఆంజనేయులు మాట్లాడుతూ నాలుగేళ్లు మాట్లాడటం చేతగాని దద్దమ్మలు ఊరేగింపులు చేసుకోవడం సిగ్గుచేటన్నారు.
పెదకూరపాడు నియోజకవర్గ సమన్వయకర్త కావటి మనోహర్‌నాయుడు మాట్లాడుతూ దసరా వేషాలు తలపించేలా టీడీపీ నేతలు వ్యవహరిస్తున్నారని, నాలుగేళ్లు పార్లమెంటును పట్టించుకోని గల్లా జయదేవ్ నాలుగు మాటలు మాట్లాడి హడావుడి చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు వనమా బాలవజ్రబాబు (డైమండ్ బాబు) మాట్లాడుతూ టీడీపీ నేతలు మనుగడ కోసం సిగ్గూఎగ్గూ లేకుండా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ నేతలు బందా రవీంద్రనాథ్, నూనె ఉమామహేశ్వరరెడ్డి, సోమి కమల్, జగన్‌కోటి, మనేపల్లి బాబు, మాదిరెడ్డి శ్రీనివాసరెడ్డి, మంత్రి మహానంది, గనిక ఝాన్సీరాణి, మద్దుల రాజాయాదవ్, ఖాజా మొహిద్దీన్, వినోద్, విఠల్, రవి, వలి, జగదీష్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment