సాక్షి, న్యూఢిల్లీ: పట్టణ పేదరిక నిర్మూలనలో భాగంగా ఆర్థికంగా వెనకబడిన వర్గాల కోసం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, గుజరాత్, రాజస్తాన్ రాష్ట్రాలకు కేంద్ర పట్టణ పేదరిక నిర్మూలన మంత్రిత్వ శాఖ 2,28,204 ఇళ్లను మంజూరు చేసింది. ఈమేరకు మంత్రిత్వశాఖ బుధవారం ప్రకటన విడుదల చేసింది. ఇళ్ల నిర్మాణాలకు గాను కేంద్రం రూ. 3,231 కోట్లు ఆర్థిక సహాయాన్ని అందజేయనుంది.
అందరికి ఇల్లు పథకం కింద ఆంధ్రప్రదేశ్‌లోని 37 పట్టణాలకు 1,93,147, తెలంగాణలోని 10 పట్టణాలకు 10,290 ఇళ్లు మంజూరయ్యాయి. కాగా, గుజరాత్‌లోని 4 పట్టణాలకు 15,580, రాజస్తాన్‌లోని 10 పట్టణాలకు 6,255, తమిళనాడులోని 5 పట్టణాలకు 2,932 ఇళ్లను మంజూరు చేసింది. కేంద్రం ఆర్థిక సహాయం కింద ఒక్కో ఇంటికి రూ. 1.50 లక్షలు అందించనుంది. ఇళ్ల నిర్మాణాల పథకానికి రాష్ట్ర ప్రభుత్వాలు భూములను కేటాయించాల్సి ఉంటుందని మంత్రిత్వశాఖ వెల్లడించింది.