2 భారీ రిజర్వాయర్లు | 2 massive reservoirs in hyderabad | Sakshi
Sakshi News home page

2 భారీ రిజర్వాయర్లు

Published Fri, Jul 31 2015 3:42 AM | Last Updated on Tue, Sep 4 2018 5:16 PM

2 భారీ రిజర్వాయర్లు - Sakshi

2 భారీ రిజర్వాయర్లు

హైదరాబాద్ మహానగర దాహార్తిని తీర్చేందుకు కృష్ణా, గోదావరి జలాలను నిల్వ చేసేందుకు నగర శివార్లలో రెండు భారీ స్టోరేజి రిజర్వాయర్ల నిర్మాణానికి జలమండలి సన్నాహాలు చేస్తోంది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని కృష్ణా, గోదావరి జలాలను నిల్వ చేసి వేసవిలో నగర దాహార్తిని సమూలంగా తీర్చేందుకు పది టీఎంసీల నిల్వ సామర్థ్యంతో వీటిని నిర్మించనున్నారు. వీటి కోసం స్థలాలను అన్వేషించేందుకు, క్షేత్రస్థాయి పరిశీలన జరిపేందుకు జలమండలి డెరైక్టర్లతో గురువారం కమిటీని నియ మించారు.

ఇందులో జలమండలి ఇంజనీర్ ఇన్ చీఫ్, ప్రాజెక్టు, ఆపరేషన్స్, టెక్నికల్, రెవెన్యూ విభాగాల డెరైక్టర్లను సభ్యులుగా నియమించినట్లు జలమండలి వర్గాలు ‘సాక్షి’కి తెలిపాయి.  
 - సాక్షి, హైదరాబాద్

 
* నగర శివార్లలో త్వరలో నిర్మాణం
* తీరనున్న ‘గ్రేటర్’ దాహార్తి
* జలమండలి డెరైక్టర్లతో కమిటీ నియామకం
* కృష్ణా, గోదావరి జలాల నిల్వ కోసమే..
* పది టీఎంసీల సామర్థ్యంతో రెండు జలాశయాలు

 
భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా...
రాబోయే వంద సంవత్సరాల కాలంలో మహానగర తాగునీటి అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఈ భారీ స్టోరేజి రిజర్వాయర్లను నిర్మించాలని సంకల్పించారు. నగరం శరవేగంగా విస్తరిస్తుండడం, జనాభా పెరుగుతున్న నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న జలాశయాలకు అదనంగా మరో 20 టీఎంసీల నీటి నిల్వకు ఏర్పాట్లు చేయాలని కేసీఆర్ సంకల్పించారు. దీని కోసం కృష్ణా, గోదావరి బేసిన్‌లలో పది టీఎంసీల నిల్వ సామర్థ్యంతో రెండు రిజర్వాయర్లను నిర్మించాలని యోచిస్తున్నారు. కృష్ణా, గోదావరి నదుల నుంచి నీటి లభ్యత అధికంగా ఉన్న సమయాల్లో పంపింగ్ ద్వారా వాటర్‌ను తరలించి ఈ రిజర్వాయర్లలో నిల్వ చేయాలని నిర్ణయించారు.
 
అనువైన స్థలాల ఎంపికే కీలకం..
ఈ రిజర్వాయర్ల నిర్మాణానికి సుమారు 15 వేల ఎకరాల భూములు అవసరమవుతాయి. ఔటర్‌రింగ్‌రోడ్డు లోపల భూసేకరణకు కోట్లాది రూపాయలు వ్యయం చేయాలి. దీంతో మెదక్, నల్లగొండ, మహబూబ్‌నగర్ జిల్లాల పరిధిలోని ఎత్తై గుట్టలు, ప్రభుత్వ భూములున్న ప్రాంతాల్లోనే ఈ భారీ రిజర్వాయర్ల నిర్మాణం సాధ్యపడుతుందని జలమండలి వర్గాల ప్రాథమిక అంచనా. నాలుగు వైపులా ఎత్తై రాతి కొండలు రక్షణ గోడవలె ఉండి మధ్యలో నీటి నిల్వకు అవకాశం ఉన్న ప్రాంతాలైతే స్టోరేజి రిజర్వాయర్ల నిర్మాణానికి అనుకూలంగా ఉంటాయని భావిస్తున్నారు. ఇందుకోసం ఏరియల్ సర్వే నిర్వహించడంతోపాటు వ్యాప్కోస్ వంటి నిపుణులైన సంస్థలతో సమగ్ర సర్వే చేయించాల్సి ఉంటుందని పేర్కొంటున్నారు.
 
ముంపు సమస్యలు లేకుండా చూడాలి
భారీ స్టోరేజి రిజర్వాయర్లు నిర్మించే సమయంలో ముంపు సమస్యలు లేకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. సుమారు 40 గ్రామాలు విస్తరించి ఉండే స్థలంలో ఈ రిజర్వాయర్లను నిర్మించాల్సి ఉంటుంది. ఇందుకు అవసరమైన స్థలాలు సేకరించడం కూడా కష్టసాధ్యమే. ఇక నగరానికి తరలించేందుకు అవసరమైన పంపింగ్ ఏర్పాట్లు, లిఫ్ట్‌ల ఏర్పాటు, విద్యుత్ అవసరాలు, వ్యయ అంచనాలను కూడా పరిగణనలోకి తీసుకొని సమగ్ర కార్యాచరణ సిద్ధం చేయాలి. ప్రస్తుతం ఉన్న జలాశయాల్లో నీటినిల్వలను స్వల్పంగా పెంచేందుకు ప్రయత్నించాలి.
- టి.హనుమంతరావు, రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్, నీటిపారుదల శాఖ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement