పోలీసు శాఖకే పరిమితమైన కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ ఇప్పుడు జలమండలిలోనూ ఏర్పాటు కానుంది. మూతలు లేనివి, దెబ్బతిన్న మ్యాన్‌హోళ్లు, మంచినీరు, డ్రెయినేజీ పైపులైన్ల లీకేజీలు, మరమ్మతులు, రిజర్వాయర్ల నిర్మాణం పనులను నిరంతరం పర్యవేక్షించేందుకు జలమండలి కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్‌ను త్వరలో ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.
ఈ కేంద్రానికి ఖైరతాబాద్‌లోని జలమండలి ప్రధాన కార్యాలయం వేదిక కానుంది. ఈ కేంద్రంలో పోలీసుశాఖ నగరవ్యాప్తంగా ఏర్పాటు చేసిన సీసీటీవీల నుంచి వీడియో ఫుటేజీని రోజువారీగా సేకరించి అధికారులు విశ్లేషించడం ద్వారా క్షేత్రస్థాయి సిబ్బందికి దిశానిర్దేశం చేయనున్నారు. మరోవైపు నగరంలో నిర్మాణంలో ఉన్న 56 భారీ మంచినీటి స్టోరేజి రిజర్వాయర్ల పురోగతిని పర్యవేక్షించేందుకుసైతం పనులు జరుగుతున్న ప్రాంతాల్లో సీసీటీవీలు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.