
విరిగిన కొండచరియలు: 21 మంది దుర్మరణం
మణిపూర్లో కొండచరియలు విరిగిపడి 21 మంది దుర్మరణం చెందారు.
ఇంఫాల్: మణిపూర్లో ప్రకృతి ప్రకోపానికి పెద్ద సంఖ్యలో జనం బలయ్యారు. ఖెంజోయ్ జిల్లాలో ఇండో- మయన్మార్ సరిహద్దును ఆనుకొని ఉన్నగ్రామంలో శనివారం సాయంత్రం ఒక్కసారిగా కొండచరియలు విరిగిపడటంతో 21 మంది దుర్మరణం పాలుకాగా, పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. గడిచిన నాలుగు రోజులుగా ఆ ప్రాంతంలో ఎడతెరపిలేని వర్షం కురుస్తుండటమే కొండచరియలు విరిగిపడటానికి కారణంగా తెలుస్తున్నది.
భారీ వర్షాలతో ఖెంజోయ్ జిల్లా అంతటా వాగులు, వరదలు పొంగిపొర్లుతుండటంతో సహాయ చర్యలకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. సహాయక బృందాలు సంఘటనా స్థలికి చేరుకున్నప్పటికీ ..క్షతగాత్రుల తరలింపు, శిథిలాల తొలిగింపులు నెమ్మదిగా సాగుతున్నాయి. వరదల కారణంగా పొరుగు ప్రాంతాలతో రవాణా సంబంధాలు తెగిపోవడం కూడా ప్రతికూల ప్రభావిన్ని చూపుతోంది. ఇటు మహారాష్ట్రలోని ముంబై- పుణె ఎక్స్ప్రెస్ వేపైనా శనివారం సాయంత్రం కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో చాలా సేపు ట్రాఫిక్ నిలిచిపోయింది.