రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న బంద్
హైదరాబాద్ : అన్నదాతల సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిపక్షాలు పోరుబాట పట్టాయి. రైతన్నల ఆత్మహత్యల నివారణకు చర్యలు చేపట్టాలని, ఒకేసారిగా రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ శనివారం రాష్ర్ట బంద్‌కు పిలుపునిచ్చాయి. బంద్ ప్రభావంతో పలు డిపోల్లోంచి బస్సులు బయటకు రాలేదు. నిరసనకారులను పోలీసులు అడ్డుకున్నా లాభం లేకపోయింది. తెల్లవారుజామునుంచే ప్రతిపక్ష నాయకులు డిపోల వద్దకు చేరుకొని బస్సులు బయటకు రాకుండా అడ్డుకుంటున్నారు. నల్లగొండ, మహబూబ్‌నగర్, కరీంనగర్, వరంగల్ అదిలాబాద్, ఖమ్మం, నిజామాబాద్, రంగారెడ్డి జిల్లాలతో పాటు నగరంలోని పలు డిపోల ఎదుట అఖిలపక్ష కార్యకర్తలు ఆందోళనలు చేస్తున్నారు.
వివిధ ప్రాంతాలలో బంద్‌కు నాయకత్వం వహిస్తున్న పలు పార్టీల నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. నగరంలోని ఎంజీబీఎస్ ఎదుట ధర్నా నిర్వహిస్తున్న కాంగ్రెస్ నేతలు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, దానం నాగేందర్, అంజన్‌కుమార్, పొన్నాల లక్ష్మయ్య, సీపీఐ నేత నారాయణ తదితరులను పోలీసులు అరెస్ట్ చేశారు. దిల్‌సుఖ్‌నగర్ బస్టాండ్ ఎదుట ఆందోళన నిర్వహిస్తున్న బీజేపీ నాయకులు ఇంద్రసేనారెడ్డి సహా పలువురు నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. అదే విధంగా జూబ్లీ బస్టాండ్ ఎదుట ఆందోళన నిర్వహిస్తున్న టీడీపీ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
మహబూబ్ నగర్:
కల్వకుర్తి బస్ డిపో ముందు వైఎస్ఆర్ సీపీ నేత ఎడ్మ కిష్టారెడ్డి బైఠాయించడంతో బస్సులు రోడ్డెక్కలేదు. వనపర్తి డిపో ఎదుట అఖిలపక్ష నేతలు బైఠాయించడంతో బస్సులు డిపోకే పరిమతమయ్యాయి.
వరంగల్:
వరంగల్ బస్టాండ్ వద్ద కాంగ్రెస్ నేతల ధర్నా చేపట్టారు. అయితే పోలీసులు అడ్డుకునేందుకు యత్నించడంతో వాగ్వివాదం చోటుచేసుకుంది.
మెదక్: సంగారెడ్డి ఆర్టీసీ డిపో ముందు ప్రతిపక్షాల బైఠాయించాయి. సీఎం కేసీఆర్కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్న ఆందోళనకారులను అరెస్ట్ చేశారు. దుబ్బాక డిపో నుంచి బస్సులు బయటకు రాలేదు.
రంగారెడ్డి:
బంద్‌లో భాగంగా రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం డిపో ఎదుట కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ, సీపీఎం, సీపీఐ నాయకులు బైఠాయించారు. డిపో నుంచి బస్సులు బయటకు వెళ్లకుండా తెల్లవారుజాము నుంచే రాస్తారోకో నిర్వహిస్తున్నారు. ఈ ధర్నాలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మల్లేష్, సీపీఎం జిల్లా కార్యదర్శి మధుసూదన్ రెడ్డి సహా పలువురు కార్యకర్తలు పాల్గొన్నారు.
కరీంనగర్:
జిల్లాలోని 11 డిపోల్లో ఆర్టీసీ బస్సులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. హుజూరాబాద్లో డిపో ఎదుట కాంగ్రెస్ నేతలు ఆందోళన చేస్తున్నారు. తెలంగాణ బంద్కు మద్దతుగా విద్యాసంస్థలు స్వచ్ఛందంగా సెలవు ప్రకటించాయి.
నల్లగొండ:
జిల్లా వ్యాప్తంగా 7 డిపోలలో బస్సులు రోడ్డేక్కలేదు. డిపోల ఎదుట అఖిలపక్షాలు బైఠాయించాయి. సూర్యాపేట ఆర్టీసీ బస్టాండ్ ఎదుట కాంగ్రెస్ నేతలు ఆందోళన చేస్తున్నారు. డిపోల వద్దకు కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ, సీపీఐ, సీసీఎం కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. కాంగ్రెస్ నేత రాంరెడ్డి దామోదర్ రెడ్డి ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఆదిలాబాద్:
ఈ జిల్లాలో బంద్ పాక్షికంగా నడుస్తోంది. బైంసా బస్ డిపో ఎదుట వామపక్షాల నేతలు బస్సులను అడ్డుకుంటున్నారు. బస్ డిపోల ఎదుట బైఠాయించిన కాంగ్రెస్ నేతలను అరెస్ట్ చేశారు
నిజామాబాద్ :
నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా బస్సులు నిలిచిపోయాయి. జిల్లాలోని 6 డిపోలకు చెందిన 680 బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి.