కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శంకరరావు డిమాండు చేశారు. దీనికోసం కేంద్ర ప్రభుత్వంపై బీసీ ఎంపీలు ఒత్తిడి తేవాలని సూచించారు. తూర్పు గోదావరి జిల్లా అమలాపురంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు.
చట్టసభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు, బీసీ ఉద్యోగులకు పదోన్నతుల్లో రిజర్వేషన్లు తదితర అంశాలపై తమ సంఘం పోరాడుతోందని చెప్పారు. బీసీ సబ్‌ప్లాన్ కూడా ఏర్పాటు చేయాలన్నారు. బీసీ ఎంపీలు పార్లమెంటులో నోరెత్తకపోతే వారిని బయట తిరగనివ్వబోమని హెచ్చరించారు. జనాభా ప్రాతిపదికన విద్య, ఉద్యోగ, రాజకీయ, సామాజిక రంగాల్లో బీసీలకు సమాన వాటా కల్పించాలని డిమాండ్ చేశారు. దేశంలో 2600 బీసీ కులాలుండగా, ఇప్పటివరకూ 2550 కులాల నుంచి ఎవరూ పార్లమెంటులోకి ప్రవేశించనేలేదని చెప్పారు.
బీసీలకు రాజ్యాంగ బద్దమైన హక్కుల సాధన కోసం జాతీయ స్థాయిలో మిలిటెంట్ ఉద్యమాలు చేపడతామని ఆయన స్పష్టం చేశారు. బీసీ కార్పొరేషన్‌కు ఏటా రూ.20 వేల కోట్ల బడ్జెట్ కేటాయించాలని, ప్రతి బీసీ కుటుంబానికి రూ.10 లక్షల నుంచి రూ.50 లక్షల వరకూ రుణాలు మంజూరు చేయాలని శంకరరావు డిమాండ్ చేశారు.