ఎక్కడివక్కడే.. | Bund success | Sakshi
Sakshi News home page

ఎక్కడివక్కడే..

Published Sun, Aug 30 2015 3:15 AM | Last Updated on Thu, Aug 9 2018 4:26 PM

ఎక్కడివక్కడే.. - Sakshi

ఎక్కడివక్కడే..

సాక్షి, కడప : రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం పోరాడాల్సింది పోయి, పోరాటం చేస్తున్న వారిని అరెస్ట్‌లతో అణచి వేయడం చంద్రబాబు ప్రభుత్వానికే చెల్లిందని వైఎస్‌ఆర్‌సీపీ, సీపీఐ, సీపీఎం, ప్రజా సంఘాల నేతలు మండిపడ్డారు. చంద్రబాబు చరిత్ర హీనుడిగా మిగిలిపోనున్నారని ధ్వజమెత్తారు. ప్రత్యేక హోదా సాధించడంలో భాగంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శనివారం రాష్ట్ర వ్యాప్త బంద్‌కు పిలుపునిచ్చిన నేపథ్యంలో జిల్లా అంతటా సంపూర్ణంగా సాగింది. కడప నగరంలో ఎమ్మెల్యేలు ఎస్‌బీ అంజద్‌బాష, పి.రవీంద్రనాథ్‌రెడ్డి, మేయర్ కె.సురేష్‌బాబులు బంద్‌ను పర్యవేక్షించారు.

ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు మూతపడగా, ప్రభుత్వ కార్యాలయాలను ఆందోళనకారులు మూసి వేయించారు. వ్యాపార వర్గాల వారు స్వచ్ఛందంగా సహకరించారు. ఆర్టీసీ బస్టాండులో ఎమ్మెల్యే రవీంద్రనాథరెడ్డి నేలపై బైఠాయించగా పోలీసులు అరెస్టు చేశారు. సీపీఎం నేత రవిశంకర్‌రెడ్డి ఆధ్వర్యంలో పాత బస్టాండు నుంచి ఆర్టీసీ బస్టాండు వరకు, సీపీఐ నేతలు బాదుల్లా, మద్దిలేటి, నాగసుబ్బారెడ్డి ఆధ్వర్యంలో హోచిమిన్ భవన్ నుంచి ర్యాలీ నిర్వహించారు. మైదుకూరులో ఎమ్మెల్యే రఘురామిరెడ్డి  ఆధ్వర్యంలో నాలుగు రోడ్ల కూడలిలో బైఠాయించి ఆందోళన నిర్వహిస్తుండగా పోలీసులు ఎమ్మెల్యేతోపాటు మిగతా నేతలను అరెస్టు చేశారు. రాయచోటిలో ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి బంద్‌ను పర్యవేక్షించారు. నేతాజీ సర్కిల్ వద్ద బైఠాయించి ఆందోళనలో పాల్గొన్నారు.

 రాజంపేటలో భారీ ర్యాలీ
 జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమర్‌నాథ్‌రెడ్డి నేతృత్వంలో రాజంపేటలో నిరసన ర్యాలీ చేపట్టగా, పోలీసులు అడ్డుకుని ఆయన్ను అరెస్టు చేశారు. అంతకుముందు నేతలు పోలా శ్రీనివాసులురెడ్డి, ఆకేపాటి మురళిరెడ్డి, ఆకేపాటి అనిల్‌కుమార్‌రెడ్డి, చొప్పా యల్లారెడ్డిల ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. రైల్వేకోడూరు ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు, నియోజకవర్గ ఇన్‌ఛార్జి కొల్లం బ్రహ్మనందరెడ్డిలు కుక్కలదొడ్డి వద్ద జాతీయ రహదారిపై బైఠాయించి వాహనాలను అడ్డుకున్నారు. జమ్మలమడుగులో ఎమ్మెల్సీ దేవగుడి నారాయణరెడ్డి, జిల్లా యూత్ స్టీరింగ్ కమిటీ నాయకుడు హనుమంతరెడ్డి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు.

ప్రొద్దుటూరులో ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాద్‌రెడ్డి ఆధ్వర్యంలో తెల్లవారుజామున 3 గంటలకే ఆర్టీసీ డిపో గేటు వద్ద బైఠాయించారు. సీపీఐ, సీపీఎం నేతలు ఆందోళనలో పాల్గొన్నారు. ఎమ్మెల్యే, ఇతర నేతలను పోలీసులు అరెస్టు చేశారు. పోరుమామిళ్లలో ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి ఆధ్వర్యంలో ఆర్టీసీ బస్టాండు వద్ద ఆందోళన చేపట్టారు. బస్సులను కదలకుండా అడ్డుకోవడంతోపాటు ఆందోళన చేస్తున్న పార్టీ శ్రేణులపై పోలీసులు స్వల్పంగా లాఠీఛార్జి చేశారు. అనంతరం గోవిందరెడ్డిని అరెస్టు చేసి పోలీసుస్టేషన్‌కు తరలించారు. బద్వేలు నాలుగురోడ్ల కూడలిలో ఆందోళన చేపట్టిన ఎమ్మెల్యే జయరాములు, ఇతర నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కమలాపురంలో మండల కన్వీనర్ ఉత్తమారెడ్డి ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు.

 వైఎస్ వివేకా, వైఎస్ అవినాష్‌లను అడ్డుకున్న పోలీసులు
  బంద్‌లో భాగంగా తెల్లవారుజామున 4 గంటలకే డిపో వద్ద మాజీ మంత్రి, సీజీసీ సభ్యుడు వైఎస్ వివేకానందరెడ్డి, కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, పార్టీ రాష్ట్ర కార్యదర్శి దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి తదితరుల ఆధ్వర్యంలో బైఠాయించి ఆందోళన చేపట్టారు. అనంతరం ఆర్టీసీ బస్టాండు వద్ద వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించి పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. వైఎస్ వివేకా, వైఎస్ అవినాష్‌రెడ్డిలు బైక్ నడుపుతూ బంద్‌ను పర్యవేక్షిస్తుండగా ఏఎస్పీ అన్బురాజన్, సీఐ ప్రసాద్‌లు వారిని అరెస్టు చేసి పోలీసుస్టేషన్‌కు తరలించారు.

బంద్ సందర్భంగా ఆరు సబ్ డివిజన్ల పరిధిలో 571 మంది వైఎస్సార్ సీపీ, వామపక్షాల నేతలను పోలీసులు అరెస్టు చేశారు. కడప సబ్ డివిజన్ పరిధిలో 132 మంది, రాజంపేట పరిధిలో 85, పులివెందుల పరిధిలో 76, మైదుకూరు పరిధిలో 89, జమ్మలమడుగు పరిధిలో 114, ప్రొద్దుటూరు పరిధిలో 75 మందిని అరెస్టు చేసి సాయంత్రం విడుదల చేశారు. ఏపీఎస్ ఆర్టీసీ కడప రీజియన్‌లోని 8 డిపోల్లో బస్సులు నిలిచి పోవడంతో రూ.67 లక్షల నష్టం వాటిల్లిందని ఆర్టీసీ ఆర్‌ఎం గోపినాథరెడ్డి తెలిపారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement