
స్వైన్‌ప్లూ భయంతో గల్లీ ఖాళీ
- హైదరాబాద్ న్యూ అంబేడ్కర్‌నగర్‌లో ఘటన
హైదరాబాద్: నగరాన్ని స్వైన్‌ఫ్లూ వణికిస్తోంది. ఈ మహమ్మారి సోకి ఓ యువకుడు చనిపోతే... ఆ దెబ్బకు అతడుండే గల్లీ గల్లీ ఖాళీ అయిపోయింది. భయపడిపోయిన సదరు గల్లీ వాసులు ఇళ్లు వదిలి పారిపోయారు. హైదరాబాద్ అంబర్‌పేట న్యూ అంబేడ్కర్‌నగర్ బస్తీలో జరిగిందీ ఘటన.
స్వైన్‌ఫ్లూతో బాధపడుతూ పదిరోజులుగా గాంధీ అసుపత్రిలో చికిత్స పొందుతున్న బస్తీవాసి నటరాజ్(28) సోమవారం మృతిచెందాడు. మృతదేహాన్ని బస్తీలోని అతని ఇంటికి తీసుకువచ్చిన కుటుంబ సభ్యులు అనంతరం శ్మశాన వాటికలో దహన సంస్కారాలు చేశారు. విషయం తెలుసుకున్న చుట్టుపక్కల ఇళ్లవారు బెంబేలెత్తిపోయారు. గాలి ద్వారా ఇతరులకు వ్యాధి సోకుతుందనే భయం దావానలంలా వ్యాపించడంతో వణికిపోయారు. మృతుడి వీధిలో ఉండే వారంతా ఇళ్లకు తాళాలు వేసి వెళ్లిపోయారు. దీంతో ఎప్పుడూ సందడిగా ఉండే గల్లీ ఒక్కసారిగా నిర్మానుష్యంగా మారింది. ఇందులో దాదాపు 50 కుటుంబాలు నివసిస్తున్నాయి. ఇప్పుడు ఒక్క పురుగు కూడా కనిపించడం లేదు. ఇతర బస్తీవాసుల్లో కూడా ఆందోళన మొదలైంది. వ్యాధి ప్రబలకుండా ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.