రాజకీయాలను వ్యాపారంగా మార్చిన ఘనత బాబుదే | Chandrababu Naidu criticized by the leaders of the Left | Sakshi
Sakshi News home page

రాజకీయాలను వ్యాపారంగా మార్చిన ఘనత బాబుదే

Published Mon, Feb 15 2016 7:53 PM | Last Updated on Mon, Aug 13 2018 8:10 PM

Chandrababu Naidu criticized by the leaders of the Left

రాజకీయాలను వ్యాపారంగా మార్చిన ఘనత ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకే దక్కుంతుందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు విమర్శించారు. విజయవాడలో సీపీఎం రాష్ట్ర కార్యాలయంలో సోమవారం సమావేశమైన వామపక్ష నేతలు తీసుకున్న పలు కీలక నిర్ణయాలను మీడియాకు వెల్లడించారు. తెలంగాణలో ఓటుకు నోటు కేసు నుంచి బయటపడేందుకు చంద్రబాబు రాజీపడ్డారని, అందుకే అక్కడే సెటిలర్లు టీఆర్‌ఎస్‌తో రాజీపడి టీఆర్‌ఎస్‌ను గెలిపించారని అన్నారు. కమ్యూనిస్టులకు ఓట్లు, సీట్లు లేవని వ్యాఖ్యలు చేస్తున్న చంద్రబాబు తెలంగాణలో టీడీపీ పరిస్థితి ఏమిటో గుర్తించాలన్నారు.


 ఏపీలో ప్రతిపక్ష ఎమ్మెల్యేలను లాగేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తుంటే తెలంగాణలో ఉన్న ఎమ్మెల్యేలు టీఆర్‌ఎస్‌లోకి వెల్లిపోతుండడంతో టీడీపీ ఖాళీ అవుతోందని అన్నారు. అధికారంలో ఉంటే ఒకలా, అధికారం లేకుంటే మరోలా వ్యవహరించే ద్వంద్వనీతి చంద్రబాబుదని మండిపడ్డారు. గతంలో ముద్రగడ పద్మనాభం ఆందోళనకు ప్రతిపక్షనేతగా వెళ్లి మద్దతు పలికిన చంద్రబాబు ఇప్పుడు అదే సమస్యపై పోరాడిన ముద్రగడను విమర్శించారని గుర్తు చేశారు.

రాయలసీమ ప్యాకేజీ కోసం ముద్రగడ తరహాలో ఉద్యమిస్తేనే గాని చంద్రబాబు దిగివచ్చేట్టు లేరని అన్నారు.  తాత్కాలిక రాజధానికి శంకుస్థాపన చేసేందుకు సిద్ధమయ్యారని, మరి కోట్లాది రూపాయలు ఖర్చుపెట్టి చేసిన శంకుస్థాపన చేసిన అమరావతి రాజధాని ఉందో లేదో చంద్రబాబు ప్రజలకు చెప్పాలని డిమాండ్‌ చేశారు.


సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ మాట్లాడుతూ ఢిల్లీలో సీపీఎం కేంద్ర కార్యాలయంపై కాషాయ గుంపు దాడి చేయడం దారుణమని ఖండించారు. దేశంలో అసహనం బాగా పెరిగిందని ఇది ప్రజాస్వామ్య మనుగడకు ప్రమాదం అన్నారు. దేశంలోని అన్ని కేంద్రీయ విశ్వవిద్యాలయాలను తమ గుప్పిట్లో పెట్టుకునేందుకు బీజేపీ, దాని అనుబంధ ఆర్‌ఎస్‌ఎస్, సంఘ్ పరివార్, ఏబీవీపీ ప్రయత్నాలు చేస్తున్నాయని విమర్శించారు. హెచ్‌సీయూలో రోహిత్ ఆత్మహత్య, జేఎన్‌యూలో స్టూడెంట్స్ నేత అరెస్టు కాషాయ కుటమి పనేనని ఆరోపించారు. జేఎన్‌యూ నేత కన్హల్ కుమార్ అరెస్టు, ఎంపీ రాజా కుమార్తె అపరాజితపై దేశద్రోహం కేసు బనాయించే ప్రయత్నాలను ఖండించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement