వర్షాలకు కూలిన శిథిల భవనం
- దంపతుల మృతి, ఇద్దరు చిన్నారుల పరిస్థితి విషమం
- పాతబస్తీలో ఘటన
హైదరాబాద్: హైదరాబాద్ పాతబస్తీ ఆషూర్‌ఖానాలోని హుస్సేనీఆలం ఆషూర్‌ఖానా నౌభత్ ఖానా భవనం కుప్పకూలింది. ఈ ఘటనలో భార్యాభర్తలు మృతి చెందగా... ఇద్దరు చిన్నారులకు తీవ్రగాయాలయ్యాయి. సయ్యద్ మోహీనుల్లా హసన్ హైదర్(43), హథియా(38)లు దంపతులు. వీరికి ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వంశపారంపర్యంగా ఆషూర్‌ఖానాలో ఉంటు న్న మోహీనుల్లా ముతవల్లీగా విధులు నిర్వహిస్తున్నారు. కాగా శనివారం రాత్రి దంపతులు కుమార్తె సమ్రీన్(12), కుమారుడు సయ్యద్ సులేమాన్(7)లతో భవనంలో నిద్రించారు.
రాత్రంతా వర్షంలో తడిసిన ఆషూర్‌ఖానా భవనం ఆదివారం ఉదయం 7.30 గంటల సమయంలో కుప్పకూలింది. హైదర్ దంపతులు, సమ్రీన్, సులేమాన్‌లకు తీవ్రగాయాలు కావడంతో ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు హసన్, హథియాలు అప్పటికే మృతి చెందినట్లు ప్రకటించారు. సమ్రీన్, సులేమాన్‌ల పరిస్థితి కూడా విషమంగా ఉందన్నారు. మెరుగైన వైద్యం కోసం వీరిని యశోద ఆస్పత్రికి తరలించారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఘటనా స్థలాన్ని ఎమ్మెల్సీ ఎన్.రాంచందర్‌రావు, చార్మినార్ ఎమ్మెల్యే సయ్యద్ అహ్మద్ పాషా ఖాద్రీ తదితరులు సందర్శించారు.
రూ. 2 లక్షల ఎక్స్‌గ్రేషియా: డిప్యూటీ సీఎం
ఆషూర్‌ఖానా మృతుల కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీ వెల్లడించారు. బాధిత కుటుంబ సభ్యులు, క్షతగాత్రులను పరామర్శించిన అనంతరం విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రభుత్వం పక్షాన మృతులకు రూ.2 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. ఘటనలో తీవ్రంగా గాయపడిన వారికి అవసరమైతే కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు అందించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. మృతుల పిల్లలకు ఉచిత విద్యతో పాటు ఇంటి వసతి కల్పిస్తామన్నారు. మృతుల అంత్యక్రియలకు తన సొంత డబ్బు రూ. 50 వేలు అందించారు.
నోటీసులిచ్చాం: గ్రేటర్ కమిషనర్
హుస్సేనీఆలంలోని ఆషూర్‌ఖానా శిథిలావస్థకు చేరుకోవడంతో నాలుగేళ్ల క్రితమే నోటీసులను జారీ చేశామని గ్రేటర్ కమిషనర్ సోమేశ్‌కుమార్ అన్నారు. శిథిలావస్థకు చేరిన నౌభత్‌ఖానా భవనాన్ని వెంటనే ఖాళీ చేయాలని ఇప్పటికే బాధితులకు సూచించామన్నారు. శిథిలావస్థకు చేరిన ఆషూర్‌ఖానా మరమ్మతుల కోసం ఇప్పటికే రూ.40 లక్షల నిధులను మంజూరు చేశామన్నారు.
నిధులు కాజేస్తున్నారు: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి
ఆషూర్‌ఖానాలకు కేటాయించిన నిధులను వక్ఫ్ బోర్డు అధికారులు కాజేస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్యే జి. కిషన్ రెడ్డి అన్నారు. హుస్సేనీఆలం ఆషూర్‌ఖానాలో జరిగిన సంఘటన స్థలాన్ని ఆయన సందర్శించారు.