- గద్వాల ఎమ్మెల్యే డీకే అరుణ
ఖమ్మం
రాష్ట్రంలో ప్రజాస్వామ్య విలువలు మంటగలుస్తున్నాయనీ... ప్రజల పక్షాన శాసనసభలో వాణి వినిపించాల్సిన ప్రతిపక్షాల గొంతు నొక్కడమే పనిగా కేసీఆర్ ప్రభుత్వం వ్యవహరిస్తోందని.. ’’ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, గద్వాల ఎమ్మెల్యే డీకే అరుణ విమర్శించారు. సోమవారం ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో ఆమె స్థానిక ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌తో కలిసి పాల్గొన్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ ప్రజాశ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వాలు పనిచేయాలని, అలా చేయని పక్షంలో ప్రతిపక్షాలు తవ వాణిని నిరసనల రూపంలో తెలిపే హక్కు రాజ్యాంగం కల్పించిందని చెప్పారు.
గత శాసన సభా సమావేశాలల్లో ప్రతిపక్షాలను సభ నుంచి సస్పెండ్ చేసి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిందని విమర్శించారు. జరగబోయే సమావేశాలకు ముందుగా నిర్వహించిన రూల్స్ కమిటీలో నిరసనలు తెలిపితే సభ నుంచి పంపిస్తామని ప్రకటించడం శోచనీయమన్నారు. తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ రాజ్యంగా, ఇక్కడ మిగిలిన పార్టీలు శత్రు సైన్యంగా భావించి ఇతర పార్టీల నాయకులు లేకుండా చేసేందుకు కేసీఆర్ కుట్ర పన్నుతున్నారని అన్నారు. ఇదే కొనసాగితే ప్రజల నుంచి ప్రతిఘటన ఎదుర్కొవాల్సి వస్తుందని హెచ్చరించారు.