ఈఎస్‌ఐ పరిధిలోకి వచ్చే రోగులకు తెలంగాణ ప్రభుత్వం ఎట్టకేలకు మెడికల్ రీయింబర్స్‌మెంట్ బిల్లులు విడుదల చేసింది.
సాక్షి, హైదరాబాద్: ఈఎస్‌ఐ పరిధిలోకి వచ్చే రోగులకు తెలంగాణ ప్రభుత్వం ఎట్టకేలకు మెడికల్ రీయింబర్స్‌మెంట్ బిల్లులు విడుదల చేసింది. ఈఎస్‌ఐ ఆస్పత్రుల్లో వైద్య సదుపాయం లేకపోతే సంబంధిత రోగులను ప్రైవేటు ఆస్పత్రులకు పంపిస్తారు. ఈ బిల్లులను ఈఎస్‌ఐ రీయింబర్స్‌మెంట్ చేస్తుంది. అయితే, ఏడాది కాలంగా తెలంగాణ, ఏపీ రాష్ట్రాలు ఈ బిల్లులు చెల్లించకపోవడంతో రూ. కోట్లు బకాయిలుగా ఉండిపోయాయి. దీంతో బాధితులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దీనిపై గత జూన్ 22న ‘ఈఎస్‌ఐ రోగుల నరకయాతన’ అన్న శీర్షికతో ‘సాక్షి’లో కథనం ప్రచురితమైంది.
ఈ కథనానికి మానవహక్కుల కమిషన్ సైతం స్పందించి సుమోటోగా స్వీకరించింది. సాక్షి కథనంతో తెలంగాణ ప్రభుత్వం గత 15 రోజుల్లో 5 వేల మందికి పైగా రోగులకు సుమారు రూ.12 కోట్లు చెల్లించినట్లు ఈఎస్‌ఐ డెరైక్టరేట్ వర్గాలు తెలిపాయి. ఇప్పటికే వైద్య ఖర్చుల బిల్లుల ఆధారంగా రోగులకు చెక్కులు పంపించినట్టు పేర్కొన్నాయి. అయితే, ఏపీ మాత్రం ఈఎస్‌ఐ రోగులకు ఇప్పటికీ బిల్లులు చెల్లించలేదు.
కాగా, ఈఎస్‌ఐ డిస్పెన్సరీలు, పెద్దాసుపత్రుల్లో సాధారణ రక్తపరీక్షలు కూడా చేయడం లేదని రోగులు వాపోతున్నారు. గడిచిన మూడేళ్లలో రూ.150 కోట్ల విలువైన రక్తపరీక్షలకు సంబంధించిన పరికరాలు లేదా రీజెంట్స్ (స్ట్రిప్స్) కొనుగోలు చేసినట్టు మాత్రం చూపించారు. ఇవన్నీ ఎక్కడకు సరఫరా అయ్యాయనేది ప్రశ్నార్థకం.