
ప్రముఖ కార్టూనిస్టు కన్నుమూత..
ముంబయి : ప్రఖ్యాత కార్టూనిస్టు మంగేష్ టెండూల్కర్(82) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన పుణెలోని ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం రాత్రి తుదిశ్వాస విడిచారు. టెండూల్కర్ మూడేళ్లుగా క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. అయితే ఇటీవల తీవ్ర అస్వస్థతకు గురికావడంతో జూలై 9న రూబీ హాల్ క్లినిక్‌లో చేర్పించారు. ఊపిరితిత్తులు సరిగా పనిచేయకపోవడంతో సోమవారం రాత్రి 11 గంటల సమయంలో టెండూల్కర్ కన్నుమూసినట్లు ఆస్పత్రి వైద్యులు తెలిపారు. తుది శ్వాస విడిచేవరకు ఆయన ఉత్సాహంగా ఉండేవారని, గత నెలలో ఆయన కార్టూన్ల ప్రదర్శనను నిర్వహించినట్లు కుటుంబీకులు తెలిపారు.
నాటక రచయిత దివంగత విజయ్ టెండూల్కర్‌కు సోదరుడు. దైనందిన జీవితానికి సంబంధించిన ఎన్నో కార్టూన్లు వేశారు. అనేక మ్యాగజిన్‌లకు, పత్రికలకు ఆయన కార్టూన్లు వేస్తుండేవారు. తన కార్టూన్లు, కారికేచర్‌లలో ట్రాఫిక్‌పై అవగాహన కల్పించేవి కూడా ఉన్నాయి. వీటిలో చాలా వాటిని ట్రాఫిక్ విభాగం వినియోగించుకుంటోంది. తరచూ ట్రాఫిక్ సిగ్నళ్ల దగ్గర ఉండి ట్రాఫిక్ రూల్స్ పాటించడంపై కరపత్రాలు కూడా పంచుతుండేవారు. అంతేగాక భూచక్ర, సండే మూడ్ వంటి పుస్తకాలు కూడా రచించారు.