ఖాకీల కిరికిరి..!
జిల్లాలోనూ పోలీసుల వడ్డీవ్యాపారం!
బాధితులపై దౌర్జన్యం, బెదిరింపులు
దృష్టి సారించిన పోలీస్ ఉన్నతాధికారులు
పీఎస్‌లను తరచుగా తనిఖీ చేయనున్న ఎస్పీ, పైస్థాయి అధికారులు
ఖమ్మం : కరీంనగర్‌లో అక్రమ వడ్డీ వ్యాపారం, బెదిరింపులు, దౌర్జన్యాలతో భూములు, ఇళ్లు, ఇళ్లస్థలాల స్వాధీనం వంటి ఆరోపణలతో కరీంనగర్ ఏఎస్సై మోహన్‌రెడ్డిని సీఐడీ అధికారులు అరెస్ట్ చేసిన విషయం విదితమే. జిల్లాలో కూడా పలువురు ఖాకీలు వడ్డీవ్యాపారం, గిరిగిరి, ప్రైవేట్ చిట్టీలు నడుపుతూ కోట్ల రూపాయలు ఆర్జిస్తున్నారనే ఆరోపణలున్నాయి. రూ.5 వడ్డీ నుంచి రూ.10 వడ్డీ వరకు కూడా వారు బాధితుల నుంచి వసూలు చేస్తున్నారు. వడ్డీకి నగదు ఇచ్చే సమయంలో వారి ఆస్తులను, నగలను తాకట్టు పెట్టుకోవడంతోపాటు వడ్డీలు కట్టలేని బాధితులను బెదిరించి చక్రవడ్డీలు వేస్తూ వారి ఆస్తులను తమ పేరుతో రిజిస్ట్రేషన్ చేయించుకుంటున్నట్లు సమాచారం.
కొంతమంది ఖాకీలు వారి కుటుంబ సభ్యులతో ప్రైవేట్ చిట్టీలు, గిరిగిరి నడుపుతూ లక్షలాది రూపాయలు ఆర్జిస్తూ.. బాధితుల నుంచి ముక్కుపిండి వసూలు చేస్తున్నట్లు విమర్శలు వస్తున్నాయి. మరికొంతమంది ఖాకీలు ఏకంగా ప్రైవేట్ సెటిల్‌మెంట్లలో తల దూరుస్తూ బినామీల పేర్లతో బాధితుల భూములను బలవంతంగా రిజిస్ట్రేషన్ చేయించుకుంటున్నట్లు తెలుస్తోంది. గతంలో రంగనాథ్ ఎస్పీగా పనిచేసిన సమయంలో అక్రమ వడ్డీవ్యాపారులు, ఫైనాన్స్ వ్యాపారులపై దాడులు నిర్వహించిన విషయం విదితమే. ఇందులో పలువురు పోలీసులు ఫైనాన్స్ వ్యాపారం, అక్రమ వడ్డీలు వసూలు చేస్తున్న పత్రాలను కూడా స్వాధీన పరుచుకున్న విషయం తెలిసిందే. దీనిపై గతంలో పలు పోలీస్‌స్టేషన్లలో సైతం బాధితులు ఫిర్యాదు చేశారు.
ఖాకీల్లో అక్రమ వడ్డీ వ్యాపారాలు చేస్తున్న వారు బయట వారికే కాకుండా తోటి సిబ్బందికి కూడా వారి అవసరాన్ని బట్టి అధిక వడ్డీలకు నగదు ఇస్తూ వారి వద్ద నుంచి కూడా డబ్బులు వసూలు చేస్తున్నారని సిబ్బందే వాపోతుండటం గమనార్హం. పలువురు ఖాకీల వద్ద బాధితులకు సంబంధించి వందల్లో ప్రామిసరి నోట్లు, చెక్‌లు ఉన్నట్లు సమాచారం. పోలీస్ హెడ్‌క్వార్టర్లలో కొన్నేళ్లుగా కొంతమంది ఖాకీలు ఈ వడ్డీ వ్యాపారాలు, ప్రైవేట్ చిట్టీలు నడుపుతున్నారని విమర్శలున్నా ఇప్పటి వరకు వారిపై ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో వారు యథేచ్ఛగా తమ దందా కొనసాగిస్తున్నారు. కొంతమంది ఇలా సంపాదించిన డబ్బులతో భూములు, ఇళ్లు కొనుగోలు చేస్తున్నట్లు కూడా తెలిసింది.
ఉన్నతాధికారుల నజర్
కరీంనగర్‌లో మోహన్‌రెడ్డి కేసు బయటపడటంతో పోలీస్ ఉన్నతాధికారులు జిల్లాపై కూడా ప్రత్యేక దృష్టిసారించినట్లు తెలిసింది. జిల్లావ్యాప్తంగా ఎవరెవరు వడ్డీ, ఫైనాన్స్ వ్యాపారం చేస్తున్నారు? ఇతర వ్యాపారాలతో సంబంధాలున్నాయా? అనే వివరాలు సేకరిస్తున్నట్లు సమాచారం. బాధితులు ఎవరైనా ఖాకీల దందాలపై పోలీస్ ఉన్నతాధికారులకు నేరుగా ఫిర్యాదు చేస్తే అలాంటి వారిపై కఠినచర్యలు తీసుకోవడానికి కూడా ఉన్నతాధికారులు సిద్ధమైనట్లు తెలిసింది. కరీంనగర్ ఘటన నేపథ్యంలో రాష్ట్ర డీజీపీ అనురాగ్‌శర్మ మంగళవారం హైదరాబాద్‌లో తెలంగాణలోని అన్ని జిల్లాల డీఐజీలు, ఎస్పీలతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా ఆయన ప్రతి పోలీస్‌స్టేషన్‌ను ఎస్పీ, డీఐజీ స్థాయి అధికారులు తరచుగా ఆకస్మికంగా తనిఖీ చేస్తూ ఆ స్టేషన్లలో జరిగే కార్యకలాపాలన్నింటిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశాలు జారీ చేశారు. ఇక నుంచి ప్రతీ పోలీస్‌స్టేషన్‌ను ఉన్నతాధికారులు తనిఖీ చేసే అవకాశం ఉంది. ఎవరైనా నిబంధనలకు విరుద్ధంగా వడ్డీ వ్యాపారం, ప్రైవేట్ చిట్టీలు, రియల్ ఎస్టేట్ దందాలు, ప్రైవేట్ సెటిల్‌మెంట్లలో తలదూరిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని, ఈ మేరకు డీజీపీ అనురాగ్‌శర్మ జిల్లా ఎస్పీలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు తెలిసింది.