'22న సీమవాసులకు చీకటి దినం'
శ్రీబాగ్ ఒడంబడిక ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాజధాని రాయలసీమలోనే ఏర్పాటు చేయాలని రాయలసీమ పరిరక్షణ సమితి అధ్యక్షుడు బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి డిమాండ్ చేశారు. కొన్ని దశాబ్ధాలుగా అన్ని అంశాల్లో రాయలసీమకు అన్యాయమే జరుగుతుందని, మరోసారి దీనిని చంద్రబాబు కొనసాగించారని ఆవేదన వ్యక్తం చేశారు.
రాజధాని పేరుతో చంద్రబాబు రియల్ ఎస్టేట్ వ్యాపారానికి తెరలేపారని, లక్షల కోట్ల రూపాయల రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారని ఆరోపించారు. రాజధాని ప్రాంతంలో చంద్రబాబు, ఆయన అనుయాయులు వేల ఎకరాల భూములు కొన్నారని ఆరోపించారు. చంద్రబాబు అబ్బసొత్తైనట్టు రాజధాని నిర్మాణానికి రూ. వందల కోట్లు ఖర్చు చేస్తున్నారని విమర్శించారు.
అమరావతికి ఖర్చు చేస్తున్న రూ. వందలకోట్ల దుర్వినియోగంపై హైకోర్టులో 'పిల్' వేస్తామని తెలిపారు. అమరావతి శంకుస్థాపనకు ముహుర్తమైన 22వ తేదీని రాయలసీమ వాసులకు చీకటిదినంగా ఆయన అభివర్ణించారు.