బ్రహ్మాండ నాయకునికి రెండు బ్రహ్మోత్సవాలు
సాక్షి, తిరుమల: ఈ ఏడాది అధిక మాసం సందర్భంగా తిరుమల శ్రీవారికి రెండు బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. సెప్టెంబర్ 16 నుంచి 24వ తేదీ వరకు వార్షిక, అక్టోబర్ 14 నుంచి 22వరకు నవరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా భారీ ఏర్పాట్లు చేసేందుకు టీటీడీ ఇప్పటికే ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేసింది. టీటీడీ ఈవో డి.సాంబశివరావు, జేఈవో కేఎస్ శ్రీనివాసరాజు, సీవీఎస్‌వో నాగేంద్రకుమార్, చీఫ్ ఇంజనీరు చంద్రశేఖరరెడ్డి బ్రహ్మోత్సవ ఏర్పాట్లపై దృష్టి సారించారు.
ఆ మేరకు శుక్రవారం నుంచి ఆలయం వద్ద బ్యారికేడ్ల నిర్మాణం పనులు ప్రారంభించారు. రాజమండ్రి పుష్కర స్నానాల్లో చోటుచేసుకున్న విషాదకర సంఘటనను దృష్టిలో ఉంచుకుని తిరుమల బ్రహ్మోత్సవాల్లో పటిష్టమైన చర్యలు చేపడుతున్నారు. వాహన సేవలు ఊరేగే ఆలయ వీధుల్లో చేపట్టే బ్యారికేడ్ల నిర్మాణంలో ప్రత్యేక శ్రద్ధ వహించారు. బ్రహ్మోత్సవాలు జరిగే రోజుల్లో అన్ని రకాల ఆర్జిత సేవలు, వీఐపీ బ్రేక్ దర్శనాలు, గదుల అడ్వాన్స్ బుకింగ్ రద్దు చేశారు.