వంతాడ, చింతలూరులో అక్రమ మైనింగ్:భూమా
కాకినాడ: తూర్పు గోదావరి జిల్లా వంతాడ, చింతలూరులో అక్రమ మైనింగ్ జరిగినట్లు గుర్తించామని ఆంధ్రప్రదేశ్ శాసనసభ పబ్లిక్ ఎకౌంట్స్ కమిటీ (పీఏసీ) చైర్మన్ భూమా నాగిరెడ్డి తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా అటవీ భూముల్లో లీజుదారులు 40 అడుగుల మేర రోడ్లు నిర్మించారని ఆయన గురువారమిక్కడ పేర్కొన్నారు.
మైనింగ్ లీజు వ్యవహారంలో రెవెన్యూ, అటవీశాఖ, మైనింగ్ శాఖలు జాయింట్ సర్వే చేయలేదని భూమా అన్నారు. పర్యావరణ అనుమతులు లేకుండానే చింతలూరు, పెద్దినపూడిలలో మైనింగ్ తవ్వకాలు చేపట్టారని ఆయన తెలిపారు. ఎస్ఈజెడ్ పరిహారం విషయంలో రైతులు అసంతృప్తితో ఉన్నారని, వీటిపై నివేదిక తయారు చేసి ప్రభుత్వానికి అంద చేస్తామని భూమా నాగిరెడ్డి చెప్పారు.
కాగా జిల్లాలోని కొత్తపల్లి మండలం కొత్తమూలపేటలోని కేఎస్ఈజెడ్ నిర్వాసిత కాలనీ, చైనా బొమ్మల తయారీ కంపెనీలను బుధవారం పబ్లిక్ ఎకౌంట్స్ కమిటీ సభ్యులు పరిశీలించారు.