దమ్ములేకనే తోక ముడిచారు
టీడీపీ నేతలపై భగ్గుమన్న మంత్రి జూపల్లి
సాక్షి, హైదరాబాద్: మహబూబ్‌నగర్ జిల్లా ప్రాజెక్టుల విషయంలో తీరని అన్యాయం చేసిన టీడీ పీ నేతలు తమ బండారం ఎక్కడ బయట పడుతుందోనని తోక ముడిచారని మంత్రి జూపల్లి కృష్ణారావు ధ్వజమెత్తారు. ప్రాజెక్టులపై చర్చించే దమ్ములేకనే వారు వెనకడుగు వేశారన్నారు. రెండు రోజులపాటు అసెంబ్లీ కమిటీ హాలులో ఎదురు చూసిన మంత్రి గురువారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఎదురుచూశారు.
టీడీపీ నేత రావుల చంద్రశేఖర్‌రెడ్డిని చర్చకు ఆహ్వానించిన మంత్రి ఆయన గైర్హాజరు కావడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పాలమూరు ప్రాజెక్టులకు టీడీపీ చేసిందేమీలేదని, తన తొమ్మిదేళ్ల పాలనలో చంద్రబాబు పాలమూరు కోసం కనీసం రూ.10 కోట్లు కూడా ఖర్చు చేయలేదని ఆరోపించారు. ఈ వాస్తవాలన్నీ బయట పడతాయన్న ఆందోళనతోనే తెలంగాణ టీడీపీ నేతలు చర్చకు రాకుండా తప్పుకొని తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు.
శ్వేతపత్రం విడుదల చేస్తారా?: రావుల
వనపర్తి రూరల్: టీడీపీ ప్రభుత్వ హయాంలో జిల్లాలోని ప్రాజెక్టులకు నిధులు ఇవ్వలేదని శ్వేతపత్రం విడుదల చేస్తావా? అని భారీ నీటిపారుదల శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావును టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖర్‌రెడ్డి ప్రశ్నించారు. గురువారం ఆయన మహబూబ్‌నగర్ జిల్లా వనపర్తిలో విలేకరులతో మాట్లాడారు.
రోజుకోతీరున విమర్శలు చేస్తూ మాట్లాడడం తనకు సాధ్యం కాదని, చర్చకు వస్తానంటే ఎన్టీఆర్ భవన్ వద్ద నాలుగు గంటలపాటు ఎదురు చూశానన్నారు. తేదీ, సమయం, స్థలం చెప్పిన మంత్రి.. పారిపోయారని ఎద్దేవా చేశారు. జూపల్లికి ఇక్కడి ప్రాజెక్టుల వివరాలు పూర్తిగా తెలియకపోవడం అమాయకత్వమని ఎద్దేవా చేశారు.