క్యాంపు రాజకీయం..లాభసాటి బేరం..! | Local Elections effect | Sakshi
Sakshi News home page

క్యాంపు రాజకీయం..లాభసాటి బేరం..!

Published Fri, Dec 11 2015 6:03 PM | Last Updated on Sun, Sep 3 2017 1:50 PM

Local Elections effect

రంగారెడ్డి జిల్లా తాండూరు నియోజకవర్గంలో స్థానిక సంస్థల శాసనమండలి ఎన్నికల పోరు ఆసక్తికరంగా మారింది.

తాండూరు (రంగారెడ్డి) : రంగారెడ్డి జిల్లా తాండూరు నియోజకవర్గంలో స్థానిక సంస్థల శాసనమండలి ఎన్నికల పోరు ఆసక్తికరంగా మారింది. ప్రలోభాల మాయలో ప్రతిపక్షాల గూటికి జంప్ జిలానీలు వెళ్లకుండా అధికార పార్టీ ఓటర్లను శిబిరాలకు తరలిస్తూ జాగ్రత్త పడుతోంది. గురువారం రాత్రే శిబిరాలకు వెళ్లిన ఓటర్లను 'పంపకాల'తో సంతృప్తి పరిచారు. ఎంపీటీసీలు, మున్సిపల్ కౌన్సిలర్లను బెంగళూరు శిబిరానికి తరలించేందుకు ఏర్పాట్లు జరిగాయి. వారిలో కొందరు క్రితం రోజు రాత్రే శిబిరానికి తరలిపోయారు. మరికొందరు శుక్రవారం రాత్రికి బయలుదేరి వెళ్లారు. మహిళా ప్రజాప్రతినిధులు తమ కుటుంబసభ్యులను వెంట తీసుకువెళ్లారని తెలుస్తోంది. శుక్రవారం అమావాస్య కావడంతో శనివారం శిబిరంలో చేరేందుకు మరికొందరు ఓటర్లు ఏర్పాట్లు చేసుకున్నారు.

ఇతర పార్టీలకు గాలం
నియోజకవర్గంలో ప్రతిపక్ష పార్టీలకు చెందిన కొందరు ఎంపీటీసీ, కౌన్సిలర్లకు అధికార పార్టీ గాలం వేసినట్టు సమాచారం. ఇందులో కొందరితో రహస్యంగా చర్చలు కూడా జరిపినట్టు తెలుస్తోంది. ప్రతిపక్ష పార్టీలకు చెందిన సదరు ప్రజాప్రతినిధులకు రూ.5 లక్షల వరకు ఇచ్చేందుకు ఒప్పందాలు జరిగాయని, ఇందులో కొంత మొత్తం అడ్వాన్స్‌గా ముట్టజెప్పినట్టు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. మిగతా మొత్తం పోలింగ్ రోజు నాటికి అందజేస్తామని హామీ ఇచ్చారని తెలుస్తోంది.

వామ్మో ఆఫర్ ఆదుర్స్...
కొందరు మున్సిపల్ కౌన్సిలర్లు ఎమ్మెల్సీ ఎన్నికల్లో మద్దతు ఇవ్వడానికి రూ.1కోటి డిమాండ్ చేశారని సమాచారం. ఇందుకు అధికార పార్టీ నుంచి ఎలాంటి సంకేతాలు రాకపోయినప్పటికీ... మధ్యస్థంగా బేరం కుదిరే అవకాశం లేకపోలేదని అనుకుంటున్నారు.

ఆరుగురు టీఆర్‌ఎస్ కౌన్సిలర్లు...
ఇక టీఆర్‌ఎస్‌కు చెందిన ఆరుగురు కౌన్సిలర్లు శనివారం బెంగళూరు శిబిరానికి వెళ్లనున్నట్టు తెలుస్తోంది. వ్యక్తిగత కారణాల రీత్యా ముగ్గురు కౌన్సిలర్లు శిబిరానికి రాలేమని ముఖ్యనేతలతో చెప్పినట్టు సమాచారం. మున్సిపల్ చైర్‌పర్సన్ కొన్ని రోజుల తరువాత శిబిరంలో కలవాలని నేతలు సూచించినట్టు పార్టీ వర్గాల్లో ప్రచారం ఉంది.

జిల్లా వ్యాప్తంగా...:
పెద్దేముల్ మండలంలో 14మంది ఎంపీటీసీ సభ్యుల్లో ఏడుగురు, యాలాలలో 13మందికి 11 మంది, బషీరాబాద్‌లో 12మందిలో 8మందిని బెంగళూరు శిబిరానికి నేతలు తరలించినట్టు ప్రచారం జరుగుతోంది. తాండూరు మండలంలో 15మంది ఎంపీటీసీల్లో కొందరు శనివారం శిబిరానికి వెళ్లడానికి ఏర్పాట్లు చేసుకున్నారని తెలుస్తోంది. శిబిరానికి తరలించిన ఎంపీటీసీలు చేజారిపోకుండా నమ్మకస్తులైన సీనియర్ నేతలకు అధికార పార్టీ బాధ్యతలు అప్పగించినట్టు తెలుస్తోంది. మొత్తంమ్మీద తాండూరు నియోజకవర్గంలో క్యాంపు రాజకీయాలు ఆసక్తిగా మారాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement