జనానికి వెన్నుపోటు పొడిచారు | Modi inaugurates in bihar tour | Sakshi
Sakshi News home page

జనానికి వెన్నుపోటు పొడిచారు

Published Sun, Jul 26 2015 1:29 AM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM

జనానికి వెన్నుపోటు పొడిచారు - Sakshi

జనానికి వెన్నుపోటు పొడిచారు

బిహార్ సీఎం నితీశ్‌పై ప్రధాని మోదీ ధ్వజం
* లాలూ, నితీశ్‌ను తిరస్కరించండి.. బీజేపీకి పట్టం కట్టండి
* మాట ప్రకారం రాష్ట్రానికి రూ. 50 వేల కోట్లకన్నా ఎక్కువ ప్యాకేజీ ఇస్తాం
* దీన్‌దయాల్ ఉపాధ్యాయ గ్రామజ్యోతి యోజనకు శ్రీకారం

పట్నా: బిహార్ అసెంబ్లీ ఎన్నికల సంగ్రామానికి ప్రధాని నరేంద్రమోదీ ప్రచారశంఖం పూరించారు. ప్రధానిగా పగ్గాలు చేపట్టిన తర్వాత శనివారం తొలిసారి పట్నాకు వచ్చిన మోదీ..

రాష్ట్ర ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్‌లపై నిప్పులు చెరిగారు. బిహార్ ప్రజలకు నితీశ్ వెన్నుపోటు పొడిచారని, ఆయన డీఎన్‌ఏలోనే ఏదో సమస్య ఉందని అన్నారు. ఆర్జేడీతో చేతులు కలిపిన ఆయన.. మళ్లీ ఆటవిక రాజ్యం తెచ్చేందుకు యత్నిస్తున్నారని విమర్శలు గుప్పించారు. ఇలాంటి నేతలను తిరస్కరించాలని, రాష్ట్ర గతిని మలుపుతిప్పేందుకు ఎన్డీయేకు పూర్తిస్థాయి మెజారిటీ కట్టబెట్టాలని ముజఫర్‌పూర్‌లో జరిగిన బహిరంగ సభలో ప్రజలకు పిలుపునిచ్చారు.

గత అసెంబ్లీ ఎన్నికల ముందు హామీ ఇచ్చినట్లుగానే రాష్ట్రానికి రూ.50 వేల కోట్ల కన్నా ఎక్కువ ప్యాకేజీ ఇస్తామని తెలిపారు. వర్షాకాల పార్లమెంట్ సమావేశాలు ముగిసిన తర్వాత దీనిపై అధికారిక ప్రకటన చేస్తామని వెల్లడించారు. నితీశ్ ‘అంటరాని రాజకీయాలు’ చేస్తారని, తనపై ద్వేషంతో బీజేపీతో సంబంధాలు తెంచుకున్నారన్నారు. ‘గతంలో ఆయనతో భుజం భుజం కలిపి పనిచేసిన జేడీయూ మాజీ నేతలైన మాంఝీ, జార్జ్ ఫెర్నాండెజ్, సుశీల్ కుమార్ మోదీలకు కూడా అన్యాయం చేశారు. ప్రజాస్వామ్యంలో రాజకీయ శత్రువులకు గౌరవం ఇవ్వాలి.

అది ప్రజాస్వామ్యం డీఎన్‌ఏలోనే ఉంది. ఈ లెక్కన చూస్తే నితీశ్ డీఎన్‌ఏలో ఏదో తేడా ఉన్నట్టుంది’ అని అన్నారు. నితీశ్‌కు నాయకత్వ బాధ్యతలు కట్టబెడితే.. విషం తాగుతానన్న లాలూ ఇప్పుడు ఆయనతోనే ఎందుకు జతకట్టారని, తన సొంత ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రజలందరితో ఎందుకు విషం తాగిస్తున్నారని ప్రశ్నించారు.
 
కరెంటు ఏమైంది?.. గత అసెంబ్లీ ఎన్నికల్లో విద్యుత్‌పై ఇచ్చిన హామీని నితీశ్ తుంగలోకి తొక్కారని మోదీ విమర్శించారు. ‘రాష్ట్రమంతా విద్యుత్ సౌకర్యం కల్పిస్తామని నితీశ్ హామీ ఇచ్చారు. అలా ఇవ్వకుంటే 2015లో జరిగే ఎన్నికల్లో ఓట్లు అడగనని చెప్పారు. ఇప్పుడేమైంది? మీ అందరికీ విద్యుత్ అందుతోందా? లేదు. కానీ ఆయన మళ్లీ మీ ఓట్లు అడగడానికి వచ్చారు. మీ నమ్మకానికి ద్రోహం చేసి మళ్లీ మీ ముందుకు వచ్చారు. నా సంగతి వదిలేయండి.. నితీశ్ మీకు కూడా వెన్నుపోటు పొడిచారు. అలాంటి వారిని మళ్లీ నమ్మొద్దు’ అని  అన్నారు.
 
నాలుగు విప్లవాలు రావాలి.. దేశం స్వయం సమృద్ధి సాధించేందుకు నాలుగు రంగాల్లో విప్లవాలు రావాల్సిన అవసరం ఉందని మోదీ చెప్పారు. వ్యవసాయంలో రెండో హరిత విప్లవం, ఇంధన రంగంలో కాషాయ విప్లవం, పాల ఉత్పత్తిలో శ్వేత విప్లవం, మత్స్యరంగంలో నీలి విప్లవాలు రావాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. ప్రఖ్యాత వ్యవసాయ పరిశోధన సంస్థ ఐసీఏఆర్(ఐకార్) 87వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా పట్నాలో నిర్వహించిన కార్యక్రమంలో ప్రధాని ప్రసంగించారు.

హెక్టారుకు ప్రస్తుతం వస్తున్న దిగుబడి గణనీయంగా పెంచాల్సిన అవసరం ఉందన్నారు. తన పిలుపును అందిపుచ్చుకొని ఖరీఫ్ సీజన్‌లో రికార్డు స్థాయిలో పప్పు ధాన్యాల సాగు చేసిన రైతులకు కృతజ్ఞతలు తెలిపారు. ‘మన జాతీయ జెండాలో మూడు రంగులున్నాయి. కానీ ఇప్పుడు మనకు 4 విప్లవాలు కావాలి. కాషాయం రంగును ఒక్కొక్కరు ఒక్కోలా చూస్తారు. కానీ ఇది శక్తికి ప్రతీక. ఇంధన శక్తిలో మనం పుంజుకోవాలి’ అని వివరించారు.  
 
గ్రామీణ విద్యుత్‌కు కొత్త పథకం
గ్రామీణ విద్యుత్ రంగంలో సంస్కరణలకు ఉద్దేశించిన ‘దీన్ దయాల్ ఉపాధ్యాయ గ్రామజ్యోతి యోజన’ పథకాన్ని ప్రధాని మోదీ  ప్రారంభించారు. గ్రామీణ ప్రాంతాలకు 24 గంటల కరెంటు అందజేసేందుకు పలు సంస్కరణలు చేపట్టడం ఈ పథకం లక్ష్యం. రాజీవ్‌గాంధీ గ్రామీణ విద్యుదీకరణ యోజనను ఇందులో కలిపేశారు. కొత్త పథకం కింద గ్రామాల్లో గృహ అవసరాలు, విద్యుత్ అవసరాల కోసం వాడుతున్న ఫీడర్లను వేర్వేరు చేయనున్నారు.
 
మోదీకి నితీశ్ ఏడు ప్రశ్నలు.. తనపై విమర్శలు గుప్పించిన ప్రధానికి నితీశ్ 7 ప్రశ్నలు సంధించారు. ప్రధాని పాత  హామీలన్నీ ఏమయ్యాయన్నారు. ‘రాష్ట్రానికి ఇస్తానన్న ప్రత్యేక హోదా ఏమైంది? 14వ ఆర్థిక కమిషన్ నివేదిక, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి నిధి రద్దు ద్వారా రాష్ట్రం రూ.50 వేల కోట్లు కోల్పోతోంది. ఇదేనా మీ సమాఖ్యస్ఫూర్తి నల్లధనం వెనక్కి తెస్తామన్న హామీ ఏమైంది? రైతుల గురించి బాధపడిపోతున్న మీరు.. వారి సంక్షేమం కోసమే భూసేకరణ బిల్లు తెచ్చారా? న్రిధులు కేటాయింపులు, ప్రణాళికలు లేకుండానే 2022కల్లా దేశంలో ప్రతి ఇంటికి విద్యుత్, మంచినీరు ఎలా ఇస్తారు’ అని ట్విటర్‌లో ప్రశ్నించారు. కాగా నితీశ్, తన మధ్య విభేదాలు సృష్టించేందుకు మోదీ ప్రయత్నిస్తున్నారని లాలూ విమర్శించారు.
 
నితీశ్‌తో ఒకే వేదికపై..
బహిరంగ సభకు ముందు మోదీ.. బిహార్‌లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. దనియావాన్-బిహార్ షరీఫ్ మధ్య కొత్త రైల్వే లైన్‌ను ప్రారంభించారు. రాజ్‌గిర్-బిహార్ షరీఫ్-దనియాన్-ఫతుహ మధ్య ప్యాసింజర్ రైలుతోపాటు పట్నా-ముంబై ఏసీ సువిధా ఎక్స్‌ప్రెస్‌ను ప్రారంభించారు. మెడికల్ ఎలక్ట్రానిక్స్ కోసం నెలకొల్పిన ఇంక్యుబేషన్ సెంటర్‌కు శంకుస్థాపన చేశారు.  పట్నా ఐఐటీ క్యాంపస్‌ను ప్రారంభించారు.

ఓ విద్యుత్ ప్రాజెక్టుకు శంకుస్థాపన సందర్భంగా సీఎం నితీశ్‌తో కలిసి వేదిక పంచుకున్నారు. నితీశ్ ప్రసంగించిన తర్వాత ప్రధాని మాట్లాడారు. వాజ్‌పేయి ప్రభుత్వం తర్వాత బిహార్ నుంచి రైల్వే మంత్రిగా వచ్చినవారి వల్ల అనేక పనులు ఆగిపోయాయంటూ పరోక్షంగా లాలూను విమర్శించారు. రాజకీయాల వల్ల రాష్ట్రం ఎంతగానో నష్టపోయిందన్నారు. రాష్ట్రానికి కేటాయింపులు పెంచుతామని చెప్పారు.

14వ ఆర్థిక సంఘం కింద కేంద్రం నుంచి రాష్ట్రానికి 2020కల్లా రూ.3.75 లక్షల కోట్లు వస్తాయన్నారు. ఇంతకుముందు రూ.1.5 లక్షల కోట్లు మాత్రమే అందేవని చెప్పారు. ఈశాన్య రాష్ట్రాలు అభివృద్ధి చెందినప్పుడే దేశం అభివృద్ధి పథంలో దూసుకుపోతుందని స్పష్టంచేశారు. పేదరికం, నిరుద్యోగం వంటి అనేక సమస్యలకు అభివృద్ధి ఒక్కటే సమాధానమని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement