కులగణాంకాల పరిశీలనకు కమిటీ
నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడి నేతృత్వంలో కమిటీ
* రాష్ట్రాల నుంచి సిఫార్సులు రావాలి
* కుల వివరాల క్రోడీకరణ జరిగిన వెంటనే నివేదిక విడుదల
న్యూఢిల్లీ: కుల గణనాల విడుదల విషయంలో తీవ్ర వివాదం చెలరేగడంతో ఆ గణాంకాలను పరిశీలించేందుకు నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు అరవింద్ పనగరియా నేతృత్వంలో నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.
ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షతన గురువారం సమావేశమైన కేంద్ర మంత్రిమండలి ఈ ప్రతిపాదనకు ఆమోదం తెలిపినట్లు కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ విలేకరులకు తెలిపారు. ఈ కమిటీ కుల గణాంకాలను వర్గీకరిస్తుందని.. ఈ వర్గీకరణ పూర్తయిన తరువాత సరైన సమయంలో ప్రజల ముందుంచుతామని అన్నారు. 2011 మే 19న యూపీఏ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రాతిపదికనే కుల, గిరిజన వర్గాల గణాంకాలపై నిపుణుల బృందాన్ని ఏర్పాటు చేసినట్ల్లు వివరించారు.
కులగణనాలు లేకుండా సామాజిక ఆర్థిక కుల గణాంకాల(ఎస్‌ఈసీసీ) డేటాను విడుదల చేయటంపై సమాజ్‌వాదీ పార్టీ, జేడీయూ, ఆర్జేడీ, డీఎంకేలు చేస్తున్న విమర్శలపై జైట్లీ స్పందిస్తూ, 8 దశాబ్దాల తర్వాత ఈ నెల 3న తామే ఎస్‌ఈసీసీ డాటాను విడుదల చేశామన్నారు. దేశంలో 46 లక్షల రకాల కులాలు, ఉప కులాలు.. వివిధ ఇంటిపేర్లు, గోత్రనామాలు ఉన్నాయని జైట్లీ చెప్పారు. ఉదాహరణకు జాట్ కులంలో వివిధ ఇంటిపేర్లు, గోత్రనామాలు ఉన్నాయని, వీటిని ఏకీకృతం చేయాల్సిన అవసరం ఉందని వివరించారు.
కుల గణాంకాలను సమీకృతం చేసేందుకు వీటిని సమ్మిళితం చేయాలని 8 నెలల క్రితమే రాష్ట్రాలకు కేంద్రం లేఖలు రాసిందన్నారు. కుల గణాంకాలను వీలైనంత త్వరగా ప్రజల ముందుంచాలని ప్రభుత్వం భావిస్తోందని.. రాష్ట్రాలు ఎంత త్వరగా వివరాలు పంపిస్తే తప్ప పనగరియా నేతృత్వంలోని కమిటీకి కుల గణాంకాల వర్గీకరణ పూర్తి చేయటం సాధ్యం కాదని చెప్పారు. నిపుణుల కమిటీలో సామాజిక న్యాయశాఖ, గిరిజన సంక్షేమ శాఖలు నిపుణులను నామినేట్ చేస్తాయన్నారు. కమిటీ నివేదిక ఇచ్చిన వెంటనే విడుదల చేస్తామని అన్నారు.
400 రైల్వేస్టేషన్లు మరింత అభివృద్ధి
మెట్రోలు, ప్రధాన నగరాలు, పర్యాటక, ఆధ్యాత్మిక ప్రాంతాల్లోని 400 రైల్వే స్టేషన్లను మరిం త అభివృద్ధి చేసేందుకు కేంద్ర కేబినెట్ ఆమో దం తెలిపింది. ‘ఎక్కడ ఉన్నది అలా(యాజ్ ఈజ్.. వేర్ ఈజ్)’ పద్ధతిలో స్టేషన్లను పునర్వ్యవస్థీకరిస్తారు. ఏ-1, ఏ కేటగిరీ స్టేషన్లను ఈ పథకంలో ఎంచుకుంటారు.
295 కాలం చెల్లిన చట్టాల రద్దు.. మూడు వేల వరకు కాలం చెల్లిన చట్టాలను రద్దు చేసే క్రమంలో భాగంగా 295 చట్టాల రద్దుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. వీటిలో ఎక్కువ చట్టాలు 30 ఏళ్ల కంటే పాతవి. వివాహ చట్టాల్లో సవరణలు, సిమెంట్ నిల్వ - బ్లాక్‌మార్కెటింగ్ చట్టం వంటివి ఇందులో ఉన్నాయి. ఇప్పటికే 125 చట్టాలను ప్రభుత్వం రద్దు చేసింది. మరో 945 చట్టాలను త్వరలోనే రద్దుచేయనుంది.
ఢిల్లీ పొరుగున జాతీయ రహదారి విస్తరణ
ఢిల్లీ పొరుగున హరియాణ, ఉత్తరప్రదేశ్‌లలో జాతీయ రహదారి ఎన్‌ఈ-2ను ఆరు లేన్లుగా విస్తరించాలన్న ప్రతిపాదనకు ప్రభుత్వం ఓకే చెప్పింది. ఇందుకోసం రూ. 7,558 కోట్ల బడ్జెట్‌కు ఆమోదం తెలిపింది.
కోర్టుల కంప్యూటరీకరణ
న్యాయస్థానాల్లో పెండింగ్ కేసులను త్వరగా పరిష్కరించేందుకు వీలుగా కోర్టు హాళ్లను జైళ్లతో కంప్యూటర్ పరిజ్ఞానం, వీడియో కాన్ఫరెన్స్ సౌకర్యంతో అనుసంధానం చేసే ప్రతిపాదనకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇందుకోసం రూ.1,670 కోట్ల ఖర్చవుతుందని అంచనా. సార్క్‌దేశాల సరిహద్దుల్లో మౌలిక వనరుల ప్రాజెక్టులను అభివృద్ధి చేసేందుకు సార్క్ అభివృద్ధి నిధికి భారత మూలధన వాటా వినియోగానికి ప్రభుత్వం ఆమోదం చెప్పింది. కెనడా, అర్మేనియాలతో వివిధ ఒప్పందాలు చేసుకునేందుకు కూడా మంత్రిమండలి ఓకే చెప్పింది.
ఏపీ సహా ఏడు రాష్ట్రాల్లో విద్యుత్ సరఫరా ప్రాజెక్టు
ఆంధ్రప్రదేశ్, గుజరాత్, హిమాచల్‌ప్రదేశ్, కర్ణాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్తాన్‌లను కలుపుతూ రూ. 8,548.68 కోట్ల అంచనా వ్యయంతో అంతర్రాష్ట్ర విద్యుత్ సరఫరా(ట్రాన్స్‌మిషన్) ప్రాజెక్టు నిర్మాణానికి ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఆమోదం తెలిపింది. వ్యయంలో 40 శాతం(రూ.3,419.47 కోట్లు) నేషనల్ క్లీన్ ఎనర్జీ ఫండ్ కింద కేంద్రం కేటాయిస్తుంది. జర్మనీ బ్యాంక్ కె.ఎఫ్.డబ్ల్యూ నుంచి 40 శాతం రుణంగా సమకూర్చుతుంది. మిగిలిన 20 శాతం నిధులను రాష్ట్రాలు కేటాయించాల్సి ఉంటుంది. ఈ ప్రాజెక్టు కింద ఐదేళ్లలోపు వివిధ ఒల్టేజీ స్థాయిల్లో 48 గ్రిడ్ సబ్‌స్టేషన్లను, ట్రాన్స్‌మిషన్ లైన్లను నిర్మించనున్నారు.
ఏపీ, ఒడిషా ‘తుపాను నివారణ’ రూ. 835 కోట్లు పెంపు
ఆంధ్రప్రదేశ్, ఒడిషాల తీరప్రాంత ప్రజలపై తుపాను ప్రమాదాన్ని తగ్గించే పథకం అంచనా వ్యయాన్ని కేంద్రం గణనీయంగా పెంచింది. ఈ రాష్ట్రాలకు ఉద్దేశించిన జాతీయ తుపాను ప్రమాద నివారణ పథకం తొలిదశ కింద అంచనా వ్యయాన్ని రూ. 2,331.71 కోట్లకు పెంచుతూ గురువారం కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఇది తొలుత కేటాయించిన రూ. 1,496.71 కోట్ల కన్నా రూ. 835 కోట్లు అధికం.
ఇందులో ప్రపంచ బ్యాంకు రుణం ద్వారా కేంద్రం రూ. 1,843.94 కోట్లు సాయాన్ని అందిస్తుంది. మిగతా రూ. 487.77 కోట్లను ఏపీ, ఒడిషాలు సమకూర్చుకోవాలి. తుపాను ను ముందుగా గుర్తించడం, హెచ్చరికల జారీ వ్యవస్థ తదితరాలను ఈ పథకం కింద చేపడతారు. తీరప్రాంతాల మౌలిక సదుపాయాల కల్పన ద్వారా ఏపీలో 7.18 లక్షలు, ఒడిశాలో 10.46 లక్షల మందికి ప్రయోజనం కలగనుంది. ఏపీలో 12,640 హెక్టార్లు, ఒడిషాలోని 38,296 హెక్టార్ల భూములకు రక్షణ ఏర్పడనుంది. రెండు రాష్ట్రాల్లో చేపట్టిన తుపాను ప్రమాద నివారణ పథకం పూర్తి చేయడానికి గడువును 2016 జనవరి 31 నుంచి 2018 మార్చి 31 వరకు పొడిగించారు.