* ‘భూసేకరణ’ ఆర్డినెన్స్‌కు కేంద్ర కేబినెట్ ఆమోదం
* పారిశ్రామిక కారిడార్లు, గ్రామీణ మౌలిక వసతులు,
* రక్షణ ప్రాజెక్టుల భూసేకరణకు రైతుల ఆమోదం అక్కర్లేదు
* మరింత మెరుగైన పరిహార, పునరావాస ప్రయోజనాలు
* ప్రాజెక్టుల్లో అడ్డంకుల తొలగింపునకే ఈ మార్పులు
* కేంద్ర ప్రభుత్వం వెల్లడి
సమాజ అభివృద్ధి అవసరాలను దృష్టిలో పెట్టుకుని భూసేకరణ చట్టంలో కొన్ని సవరణలు చేశాం. కొత్తగా 10ఏ సెక్షన్‌ను పొందుపర్చాం. జాతీయ భద్రత, రక్షణ, విద్యుదీకరణ సహా గ్రామీణ మౌలిక వసతులు, పారిశ్రామిక కారిడార్లు, ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్య ప్రాజెక్టుల వంటి సామాజిక మౌలిక వసతుల కల్పనకు ఉద్దేశించిన ప్రాజెక్టుల విషయంలో.. భూయజమానుల తప్పనిసరి ఆమోదం, సామాజిక ప్రభావ అంచనా (ఎస్‌ఐఏ) నిబంధనలు వర్తించకుండా సవరణలు చేశాం.
- కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ
న్యూఢిల్లీ: పంటభూములపై రైతులకున్న యాజమాన్యపు హక్కులను కాలరాచే కీలక సవరణలకు కేంద్రప్రభుత్వం తెరతీసింది. అభివృద్ధి పేరుతో రైతుల అనుమతి లేకుండానే వారి భూమిని స్వాధీనం చేసుకునేందుకు ఆర్డినెన్స్‌ను సిద్ధం చేసింది. ప్రభుత్వ, ప్రభుత్వ- ప్రైవేటు భాగస్వామ్యం(పీపీపీ) ఉన్న ప్రాజెక్టుల కోసం భూసేకరణ జరిపే సమయంలో.. ప్రభావిత రైతుల్లో కనీసం 70 శాతం మంది, ప్రైవేటు ప్రాజెక్టుల విషయంలో కనీసం 80 శాతం మంది అంగీకారం తప్పనిసరిగా అవసరమన్న నిబంధనను తొలగిస్తూ భూసేకరణ చట్టంలో సవరణలు చేసింది. ఆయా ప్రాజెక్టులకు సామాజిక ప్రభావ అంచనా(ఎస్‌ఐఏ) నిబంధనను కూడా తొలగించింది. తాజా సవరణల ప్రకారం ఒకటి కన్నా ఎక్కువ పంటలు పండే సారవంతమైన భూములను కూడా రైతుల అంగీకారం లేకుండా స్వాధీనం చేసుకోవచ్చు.
భూ సేకరణ చట్టంలో తాజా సవరణలతో కూడిన ఆర్డినెన్సుకు సోమవారం కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ సవరణలు రైతులకు లబ్ధి చేకూర్చేవేనని, వారికి మరింత మెరుగైన పరిహార, పునరావాస ప్రతిపాదనలు అందులో పొందుపర్చామని పేర్కొంటూ కేబినెట్ భేటీ అనంతరం ప్రభుత్వం ఒక ప్రకటన విడుదల చేయడం గమనార్హం. 2013లో యూపీఏ ప్రభుత్వం తెచ్చిన చట్టంలో రైతుల అనుమతి లేకుండా భూసేకరణ సాధ్యం కాదన్న నిబంధన పొందుపర్చడం వల్ల ప్రాజెక్టుల నిర్మాణంలో అడ్డం కులు ఏర్పడుతున్నాయని, ఆ నిబంధనను తొలగించాలని కార్పొరేట్ సంస్థలు ఒత్తిడి చేయడం వల్లనే ఈ సవరణలు చేశారని ఆరోపణలు వెల్లువెత్తాయి.
ఆ ప్రాజెక్టులకు అనుమతి తప్పనిసరి కాదు
పారిశ్రామిక కారిడార్లు, ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్య ప్రాజెక్టులు, గ్రామీణ మౌలిక వసతులు, పేదలకు ఉద్దేశించిన గృహనిర్మాణ ప్రాజెక్టులు, రక్షణ అవసరాలకు ఉద్దేశించిన ప్రాజెక్టులు.. వీటి కొరకు భూమిని సేకరించేందుకు సంబంధిత భూ యజమానుల అనుమతి తప్పనిసరి కాదని భూ సేకరణ చట్టంలో సవరణలు చేస్తూ ఆర్డినెన్స్‌ను రూపొందించారు. అలాగే, భూములు కోల్పోతున్న రైతులకు అధిక పరిహారం, పునరావాస ప్రయోజనాలు అందించేందుకు 13 కేంద్ర చట్టాలను ఈ చట్ట పరిధిలోనికి తీసుకువచ్చారు.
వాటిలో జాతీయ భద్రత, రక్షణ సంబంధ చట్టాలున్నాయి. ఆ మేరకు చట్టంలోని పునరావాస, పునఃస్థిరీకరణ, పరిహార(రిహాబిలిటేషన్, రీసెటిల్‌మెంట్ అండ్ కాంపెన్సేషన్) నిబంధనల్లో మార్పులు చేశారు. సమాజ అభివృద్ధి అవసరాలను దృష్టిలో పెట్టుకుని భూ సేకరణ చట్టంలో కొన్ని సవరణలు చేశామని, కొత్తగా 10ఏ సెక్షన్‌ను పొందుపర్చామని కేబినెట్ భేటీ అనంతరం కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ వెల్లడించారు.
జాతీయ భద్రత, రక్షణ, విద్యుదీకరణ సహా గ్రామీణ మౌలిక వసతులు, పారిశ్రామిక కారిడార్లు, ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్య ప్రాజెక్టుల వంటి సామాజిక మౌలిక వసతుల కల్పనకుద్దేశించిన ప్రాజెక్టుల విషయంలో.. భూయజమానుల తప్పనిసరి ఆమోదం, సామాజిక ప్రభావ అంచనా(ఎస్‌ఐఏ) నిబంధనలు వర్తించకుండా సవరణలు చేశామన్నారు. భూ సేకరణలో ఇబ్బందులను తొలగించేలా, ప్రతికూల ప్రభావం పడే కుటుంబాలకు మరింత మెరుగైన పరిహారం అందేలా నిబంధనలను సవరించామని ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది.
తాజా మార్పుల వల్ల ప్రాజెక్టుల నిర్మాణం, రైతుల పరిహార ప్రక్రియ వేగవంతమవుతుందని పేర్కొంది. పీపీపీ ప్రాజెక్టుల కోసం భూమి సేకరిస్తున్నప్పుడు.. సంబంధిత భూ యజమానుల్లో కనీసం 70% మంది, పైవేటు కంపెనీల ప్రాజెక్టుల కోసం కనీసం 80% మంది అంగీకారం తప్పనిసరి అని 2013లో పార్లమెంటు ఆమోదించిన చట్టంలో ఉంది.
చట్టంలో చేర్చిన మరికొన్ని సవరణలు..
పారిశ్రామిక కారిడార్ల కోసం భూమిని సేకరిస్తున్న సందర్భాల్లో.. భూమిని కోల్పోతున్న కుటుంబాల్లో ఒకరికి తప్పకుండా ఉద్యోగం ఇవ్వాల్సి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టుల కొరకు భూమిని సేకరిస్తున్న సందర్భాల్లో తరచుగా ఉపయోగిస్తున్న 13 చట్టాలు ప్రస్తుతమున్న భూసేకరణ చట్ట పరిధిలో లేవు. బాధితులకు మెరుగైన పరిహారం అందించేందుకు వాటిని ఈ సవరణల ద్వారా మళ్లీ ఆ చట్ట పరిధిలోకి తీసుకువచ్చారు.
కార్పొరేట్ సంస్థల కోసమే..!
భూ సేకరణ చట్టాన్ని సవరిస్తూ ఆర్డినెన్సు జారీ చేసేందుకు కేబినెట్ ఆమోదం తెలపడంపై సామాజిక కార్యకర్త మేథాపట్కర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్పొరేట్ సంస్థల లబ్ధికే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని ఆరోపించారు.
రైతు హక్కులు రద్దు!
Published Tue, Dec 30 2014 1:49 AM | Last Updated on Sat, Sep 2 2017 6:55 PM
Advertisement